ఐఏఎస్ క్యాడర్ రూల్స్: కేంద్రం, రాష్ట్రాల మధ్య చిచ్చు..
ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్చేందుకు కేంద్రం సిద్ధపడటంపై రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు.. రూల్స్ మారిస్తే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పాయి. కేంద్రం ప్రతిపాదించిన సవరణలకు తాము అనుకూలం కాదంటూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖలు రాశాయి. ఇప్పటికే కేంద్రం ప్రతిపాదనలను పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సీఎంలు వ్యతిరేకించారు. తాజాగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రధానికి లేఖలు రాశారు. ఏంటీ కొత్త రూల్స్.. […]
ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్చేందుకు కేంద్రం సిద్ధపడటంపై రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు.. రూల్స్ మారిస్తే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పాయి. కేంద్రం ప్రతిపాదించిన సవరణలకు తాము అనుకూలం కాదంటూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖలు రాశాయి. ఇప్పటికే కేంద్రం ప్రతిపాదనలను పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సీఎంలు వ్యతిరేకించారు. తాజాగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రధానికి లేఖలు రాశారు.
ఏంటీ కొత్త రూల్స్..
ఐఏఎస్ క్యాడర్ రూల్స్-1954లో 4 సవరణలను కేంద్రం ప్రతిపాదించింది. వీటి ప్రకారం స్టేట్ క్యాడర్ ఆఫీసర్ ను కేంద్రానికి నిర్దేశిత సమయంలోగా పంపించడంలో ఆలస్యం అయితే, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుంచి ఆ అధికారి రిలీవ్ అయినట్టే పరిగణించాలి. కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటేషన్‌పై ఎంత మంది అధికారులను పంపించాలి, ఎవరెవర్ని పంపించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి. ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంగీకారం కుదరకపోతే, తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. ఈ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని నిర్దిష్ట గడువులోగా రాష్ట్రాలు అమలు చేయాలనేది మరో సవరణ. ప్రజా ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి క్యాడర్ ఆఫీసర్ల సేవలు అవసరమైనపుడు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను నిర్దిష్ట గడువులోగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సి ఉంటుందనేది మరో ప్రతిపాదన. అయితే వీటిపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం..
ఐఏఎస్ క్యాడర్ రూల్స్ సవరించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు దేశ సమాఖ్య పునాదులను బలంగా కుదిపేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. వీటిపై తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను వ్యక్తం చేయాలని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
అధికారులతో రాజకీయ క్రీడలు వద్దు..
కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ప్రధానికి ఇదే విషయమై లేఖ రాశారు, సవరణలు ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సవరణలు అధికారుల్లో భయాందోళనలు సృష్టిస్తాయని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాకుండా రాష్ట్రంలో వేరే పార్టీ అధికారంలో ఉంటే.. ఆ రాష్ట్రంలో విధానాల రూపకల్పన, పథకాలను సమర్థంగా అమలు చేయడంలో ఐఏఎస్‌లు సంకోచించే పరిస్థితి తలెత్తుతుందని విజయన్ తన లేఖలో పేర్కొన్నారు. ఐఏఎస్‌లను రాజకీయ క్రీడలో భాగస్వాములను చేయొద్దని ఆయన ప్రధానికి రాసిన లేఖలో కోరారు.