Telugu Global
NEWS

ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె.. ఉద్యోగ సంఘాల నోటీసు..

ఏపీ ఉద్యోగ సంఘాలు సమ్మె చేయడానికే మొగ్గు చూపాయి. హైకోర్టులో కేసు విచారణ పూర్తయ్యేవరకు ఆగాలా, లేక ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చించాలా అనే తర్జన భర్జన అనంతరం.. ఎట్టకేలకు సమ్మెకు సై అంటూ ఉద్యోగులు నోటీసు ఇచ్చారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలనే ప్రధాన డిమాండ్ తో ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. పీఆర్సీ సాధన సమితి పేరుతో 20 మంది స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ […]

ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె.. ఉద్యోగ సంఘాల నోటీసు..
X

ఏపీ ఉద్యోగ సంఘాలు సమ్మె చేయడానికే మొగ్గు చూపాయి. హైకోర్టులో కేసు విచారణ పూర్తయ్యేవరకు ఆగాలా, లేక ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చించాలా అనే తర్జన భర్జన అనంతరం.. ఎట్టకేలకు సమ్మెకు సై అంటూ ఉద్యోగులు నోటీసు ఇచ్చారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలనే ప్రధాన డిమాండ్ తో ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. పీఆర్సీ సాధన సమితి పేరుతో 20 మంది స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ కు సమ్మె నోటీసు అందజేశారు. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు అందులో పేర్కొన్నారు. సీఎస్‌ సమీర్‌ శర్మ ఢిల్లీ పర్యటనలో ఉండటంతో.. జీఏడీ కార్యదర్శికి నోటీసు ఇచ్చారు ఉద్యోగ సంఘాల నేతలు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునేవరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.

చర్చల్లో భాగంగా తమ సమస్యలు ఆలకించామని ప్రభుత్వం చెబుతోందని.. వాటి పరిష్కారానికి మాత్రం ముందుకు రావడం లేదన ఆరోపిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. తమనే కాకుండా పౌర సమాజాన్ని కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని చెప్పారు. ఇది ఆషామాషీ ఉద్యమం అనుకోవద్దని.. 13లక్షల మంది ఉద్యోగులు, పింఛనర్ల ఉద్యమమని ప్రభుత్వం గ్రహించాలన్నారు. ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు తమకు అధికారిక సమాచారం లేదని.. ఆ కమిటీలో ఏం చర్చిస్తారో తమకు తెలియదన్నారు.

కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. కొత్త పీఆర్సీపై ఉద్యోగులకు లేని తొందర ప్రభుత్వానికి ఎందుకో అర్థం కావడం లేదని విమర్శించారు. ఉద్యోగులు సానుకూలంగా స్పందించాలంటే పాత విధానంలోనే జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమ సమయంలో ఉద్యోగులంతా క్రమశిక్షణతో మెలగాలని వ్యక్తిగత దూషణలు చేయవద్దని కోరారు. 11వ వేతన సవరణ సంఘం నివేదికను బయటపెట్టాలని, అసలు దాన్ని ఎందుకు దాచిపెట్టారో చెప్పాలన్నారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేస్తేనే చర్చలకు వస్తామని స్పష్టం చేశారు. ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా తమ ఉద్యమానికి పోలీసులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

First Published:  24 Jan 2022 9:52 AM GMT
Next Story