Telugu Global
NEWS

కేసులు పెరుగుతున్నా భయంలేదు.. మహారాష్ట్ర, కర్నాటకలో ఆంక్షల సడలింపు..

దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. అయితే ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు మాత్రం ఆ స్థాయిలో లేవు. దీంతో కొన్ని రాష్ట్రాలు నిబంధనలు సడలించేందుకు మొగ్గు చూపుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నా, విమర్శలు ఎదురవుతున్నా కూడా డోంట్ కేర్ అంటున్నాయి. ఈ లిస్ట్ లో ఉన్న మొదటి రాష్ట్రం కర్నాటక. కర్నాటకలో రోజువారీ కేసుల సంఖ్య 50వేలకు చేరింది. వారం రోజులుగా సగటున రోజుకి 45వేల కొత్త కేసులు అక్కడ నమోదవుతున్నాయి. అయితే ప్రజల […]

కేసులు పెరుగుతున్నా భయంలేదు.. మహారాష్ట్ర, కర్నాటకలో ఆంక్షల సడలింపు..
X

దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. అయితే ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు మాత్రం ఆ స్థాయిలో లేవు. దీంతో కొన్ని రాష్ట్రాలు నిబంధనలు సడలించేందుకు మొగ్గు చూపుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నా, విమర్శలు ఎదురవుతున్నా కూడా డోంట్ కేర్ అంటున్నాయి. ఈ లిస్ట్ లో ఉన్న మొదటి రాష్ట్రం కర్నాటక. కర్నాటకలో రోజువారీ కేసుల సంఖ్య 50వేలకు చేరింది. వారం రోజులుగా సగటున రోజుకి 45వేల కొత్త కేసులు అక్కడ నమోదవుతున్నాయి. అయితే ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని వీకెండ్ లాక్ డౌన్ ఎత్తేస్తున్నట్టు ప్రకటించారు సీఎం బసవరాజ్ బొమ్మై.

రాష్ట్రంలో జ‌న‌వ‌రి నుంచి క‌రోనా కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా.. ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య తక్కువగా ఉన్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు కర్నాటక మంత్రులు. వారాంతపు లాక్‌ డౌన్‌ తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని.. ప్ర‌జ‌లు, వ్యాపార వర్గాలనుంచి వస్తున్న ఫిర్యాదుల్ని దృష్టిలో ఉంచుకుని ఈనిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. రాజ‌ధాని బెంగళూరు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కొన‌సాగుతాయ‌ని మంత్రి అశోక్ స్ప‌ష్టం చేశారు. రాత్రి కర్ఫ్యూ మాత్రం నెలాఖరు వరకు కొన‌సాగుతుందని స్పష్టం చేశారు. పబ్‌ లు, క్లబ్‌ లు, రెస్టారెంట్లు, హోటళ్లలో 50 శాతం సీట్ల సామర్థ్యానికి మాత్రమే అనుమతి ఉంది.

మహారాష్ట్రలో తెరుచుకోబోతున్న స్కూల్స్..
అటు మహారాష్ట్రలో కూడా రోజువారీ కొవిడ్ కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం నిబంధనలు సడలించడానికే మొగ్గు చూపుతోంది. థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో ఇదివరకే మహారాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లకు సెలవలు ఇచ్చింది. కానీ ఇప్పుడు కేసులు పెరుగుతున్నా.. స్కూళ్లను తిరిగి తెరిచేందుకు నిర్ణయించింది. వచ్చే వారం నుంచే అన్నిస్కూళ్లు పునఃప్రారంభిస్తామని తెలిపారు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్. 1వతరగతి నుంచి 12వ తరగ‌తి వ‌ర‌కు స్కూళ్లు తిరిగి ప్రారంభవుతాయని వెల్ల‌డించారు. వాస్తవానికి ఫిబ్రవరి 15వరకు స్కూళ్లు మూసి ఉంచాలని ఇదివరకే ప్రకటించినా ఆ నిర్ణయంపై పునఃసమీక్ష నిర్వహించింది మహారాష్ట్ర ప్రభుత్వం.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది, స్కూళ్లు మాత్రం యధావిధిగా నడుస్తున్నాయి. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమలు చేయలేదు కానీ, స్కూళ్లకు మాత్రం తాళం పడింది. ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు తెలంగాణలో అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

First Published:  22 Jan 2022 12:37 AM GMT
Next Story