సిలబస్ తగ్గించాలా..? సిస్టమ్ మార్చేయాలా..?
వేసవి సెలవలు, దసరా సెలవలు, సంక్రాంతి సెలవలు.. ఇలా సెలవలన్నీ పోను.. స్కూల్ పని దినాలకు అనుగుణంగా ప్రతి తరగతికి సిలబస్ ముందుగానే రూపొందిస్తారు విద్యాశాఖ అధికారులు. ప్రతి ఏడాదీ సిలబస్ ప్రకారమే పాఠ్యాంశాల బోధన ఉంటుంది, దానికి అనుగుణంగానే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ పరీక్షలుంటాయి. కానీ కరోనా కాలంలో ఈ లెక్కలన్నీ తప్పాయి. టైమ్ ప్రకారం సిలబస్ పూర్తి కాదు, టైమ్ ప్రకారం పరీక్షలు జరగడం లేదు. అసలు వార్షిక పరీక్షలు కూడా లేకుండానే […]

వేసవి సెలవలు, దసరా సెలవలు, సంక్రాంతి సెలవలు.. ఇలా సెలవలన్నీ పోను.. స్కూల్ పని దినాలకు అనుగుణంగా ప్రతి తరగతికి సిలబస్ ముందుగానే రూపొందిస్తారు విద్యాశాఖ అధికారులు. ప్రతి ఏడాదీ సిలబస్ ప్రకారమే పాఠ్యాంశాల బోధన ఉంటుంది, దానికి అనుగుణంగానే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ పరీక్షలుంటాయి. కానీ కరోనా కాలంలో ఈ లెక్కలన్నీ తప్పాయి. టైమ్ ప్రకారం సిలబస్ పూర్తి కాదు, టైమ్ ప్రకారం పరీక్షలు జరగడం లేదు. అసలు వార్షిక పరీక్షలు కూడా లేకుండానే పై తరగతులకు వెళ్లిపోతున్నారు విద్యార్థులు. ఇప్పుడు మళ్లీ థర్డ్ వేవ్ సమయంలో పలు రాష్ట్రాల్లో స్కూళ్లు మూతపడ్డాయి, కొన్ని చోట్ల ఆన్ లైన్ క్లాసులు మాత్రమే జరుగుతున్నాయి. ఏపీ వంటి ఒకటీ అరా రాష్ట్రాల్లో మాత్రమే ప్రత్యక్ష తరగతులు జరుగుతున్నాయి. ఈ దశలో మరోసారి సిలబస్ అనే అంశం తెరపైకి వచ్చింది. స్కూళ్లు మూసేసిన రాష్ట్రాల్లో ఆటేమేటిక్ గా సిలబస్ తగ్గించేస్తున్నారు. కానీ ఇది విద్యార్థులకు ఇబ్బంది కలిగించే పరిణామం. ప్రతి తరగతిలోనూ సగం సగం పాఠాలు చదివితే ఇక వారికి సబ్జెక్ట్ లపై పట్టు దొరికేది ఎలా. బేసిక్స్ తెలియకుండా వారు పై తరగతుల్లో రాణించేది ఎలా..?
సిలబస్ తగ్గించాలా..? సంస్కరణలు తేవాలా..?
కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా విద్యావిధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థుల కెరీర్ ను దృష్టిలో పెట్టుకొని సిలబస్ భారాన్ని తగ్గించాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) భావిస్తోంది. అయితే, ఇది సరైన నిర్ణయం కాదని.. సిలబస్ తగ్గించకుండా విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలనేది పలువురు విద్యావేత్తల అభిప్రాయం. సిలబస్ తగ్గించడం కంటే, విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి, వాటితో పాఠ్య ప్రణాళిక రూపొందించాలని సూచిస్తున్నారు.
పోటీ పరీక్షలలో కష్టం..
వార్షిక పరీక్షల్లో సిలబస్ తగ్గించి ప్రశ్నలు అడగటం సులువే. అయితే పోటీ పరీక్షల్లో సిలబస్ మార్చేయాలంటే కుదరదు. నీట్, జేఈఈ పరీక్షలు రాసే విద్యార్థులు అకడమిక్ పరీక్షలకోసం తక్కువ సిలబస్ చదివినా.. పోటీ పరీక్షలకోసం మొత్తం సిలబస్ చదవాల్సిందే. ఇలాంటి సందర్భాల్లో వారు ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ గందరగోళాన్ని నివారించడానికే సిలబస్ ని తగ్గించకుండా పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకు రావాలంటున్నారు నిపుణులు.
కరోనా కాలంలో మనమంతా చాలా పాఠాలు నేర్చుకున్నాం. అదే సమయంలో స్కూళ్లలో చెప్పే పాఠాల్లో కూడా మార్పు రావాలంటున్నారు విద్యారంగ నిపుణులు. సిలబస్ భారం తగ్గించి ఎప్పటికప్పుడు మమ అనిపించకుండా విద్యా వ్యవస్థలోనే మార్పులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది.