ఏపీలో క్లాసులు.. తెలంగాణలో సెలవలు.. ఏది కరెక్ట్..?
సంక్రాంతి సెలవల తర్వాత ఏపీలో నేటినుంచి స్కూల్స్, కాలేజీలు అన్నీ యథావిధిగా తెరుచుకుంటున్నాయి. ఏపీలో సంక్రాంతి సెలవలు పొడిగించే ఉద్దేశమేదీ లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు వారి భవిష్యత్తు గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారాయన. ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైందని, 15-18 సంవత్సరాల మధ్య వయసున్న విద్యార్థుల్లో దాదాపు 92 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చామని చెప్పారు. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూనే పాఠశాలలు నడిపేందుకు అన్ని చర్యలూ […]
సంక్రాంతి సెలవల తర్వాత ఏపీలో నేటినుంచి స్కూల్స్, కాలేజీలు అన్నీ యథావిధిగా తెరుచుకుంటున్నాయి. ఏపీలో సంక్రాంతి సెలవలు పొడిగించే ఉద్దేశమేదీ లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు వారి భవిష్యత్తు గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారాయన. ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైందని, 15-18 సంవత్సరాల మధ్య వయసున్న విద్యార్థుల్లో దాదాపు 92 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చామని చెప్పారు. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూనే పాఠశాలలు నడిపేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు మంత్రి సురేష్. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
తెలంగాణలో అలా..
ఏపీ ప్రభుత్వం ప్రత్యక్ష తరగతుల విషయంలో అడుగు ముందుకేసినా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్కూళ్లను తెరిచేందుకు ససేమిరా అంటోంది. తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలకు ఈనెల 30వరకు సెలవలు పొడిగించారు అధికారులు. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించారు. తెలంగాణలో వైద్యకళాశాలలు మినహా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలకు సెలవలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు సీఎస్ సోమేష్ కుమార్.
తల్లిదండ్రుల్లో అయోమయం..
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలా వేర్వేరు నిర్ణయాలు ప్రకటించడంతో తల్లిదండ్రుల్లో కాస్త అయోమయం నెలకొంది. తెలంగాణలో సెలవలు పొడిగించడంపై ఎవరూ కామెంట్ చేయడంలేదు. అదే సమయంలో ఏపీలో సెలవలు లేవని చెప్పడంతో కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్న సమయంలో ప్రత్యక్ష తరగతులు సరికాదని అంటున్నారు తల్లిదండ్రులు. టీనేజ్ టీకా కేవలం 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి, కనీసం ప్రైమరీ సెక్షన్ కి అయినా సెలవలు ప్రకటించాలని కోరుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికి సెలవలు పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. కేసుల సంఖ్య మరింతగా పెరిగితే.. వెంటనే సమీక్ష నిర్వహించి నిర్ణయం ప్రకటిస్తామని చెబుతున్నారు అధికారులు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ పాఠాశాలలు కొనసాగిస్తామని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.