భారత్ లో కార్ల ధరలు భారీగా పెరిగే అవకాశం..
ప్రయాణికుల భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో భారత్ లో కార్ల రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సర్క్యూట్ చిప్ ల కొరత కారణంగా కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. డిమాండ్ కి తగ్గట్టుగా కార్ల తయారీ ఊపందుకోలేదు. దీనికితోడు ఇప్పుడు కార్లకు 6 ఎయిర్ బ్యాగ్ లను తప్పనిసరి చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 8 మంది ప్రయాణించే కార్లలో తప్పనిసరిగా 6 ఎయిర్ బ్యాగ్ లు […]
ప్రయాణికుల భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో భారత్ లో కార్ల రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సర్క్యూట్ చిప్ ల కొరత కారణంగా కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. డిమాండ్ కి తగ్గట్టుగా కార్ల తయారీ ఊపందుకోలేదు. దీనికితోడు ఇప్పుడు కార్లకు 6 ఎయిర్ బ్యాగ్ లను తప్పనిసరి చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 8 మంది ప్రయాణించే కార్లలో తప్పనిసరిగా 6 ఎయిర్ బ్యాగ్ లు ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. దీనివల్ల ఎక్కువ మంది ప్రయాణించే కార్లలో కూడా భద్రత మెరుగవుతుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను ఆమోదించినట్లు మంత్రి ట్వీట్ లో పేర్కొన్నారు. భారత దేశంలోని కార్లను గతంలో కంటే మరింత సురక్షితంగా మార్చేందుకు, ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు ఇదో ముందడుగు అని గడ్కరీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
2019 జులై 1 నుంచి భారత్ లో డ్రైవర్ వైపు ఎయిర్‌బ్యాగ్ నిబంధనను తప్పనిసరి చేశారు. 2022 జనవరి 1 నుంచి అన్ని కార్లలో 2 ఎయిర్ బ్యాగ్ లు తప్పనిసరి చేస్తూ ఆ నిబంధన సవరించారు. తాజాగా ఎనిమిది మంది ప్రయాణించే కార్లలో ధర, వేరియంట్ తో సంబంధం లేకుండా అన్నింటిలో ఆరు ఎయిర్ బ్యాగ్ లు ఉండాల్సిందేననే నిబంధన తెరపైకి తెచ్చారు. ఎయిర్ బ్యాగ్ లు కొత్తగా అమర్చాలంటే వాటి రేటుని కచ్చితంగా పెంచాల్సిందే. అంటే ఇకపై ఎకానమీ రేట్లలో లభించే పెద్ద కార్ల రేట్లు భారీగా పెరుగుతాయనమాట.
M-1 వాహనాల శ్రేణిలో ప్రమాదాలు జరిగినప్పుడు ముందు, వెనుక కూర్చున్న వారికి భద్రత కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న రెండు ఎయిర్ బ్యాగ్ లతోపాటు మరో నాలుగు ఎయిర్ బ్యాగ్ లు అదనంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ 4 ఎయిర్ బ్యాగ్ లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అదనపు ఖర్చుని వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ప్రయాణికుల భద్రత మెరుగయ్యే క్రమంలో కార్ల రేట్లు మాత్రం పెరిగే అవకాశం ఉంది. అయితే 6 ఎయిర్ బ్యాగ్ ల నిబంధన ఎప్పట్నుంచి అమలులోకి వస్తుందో చూడాలి.