Telugu Global
National

5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్.. ఫిబ్రవరి 10నుంచి మార్చి 7 వరకు పోలింగ్..

కరోనా ఆంక్షల నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందిగ్ధానికి గతంలోనే తెరదించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. సీఈసీ సుశీల్‌ చంద్ర.. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ను ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 690 శాసనసభ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు, 7 దశల్లో ఎన్నికలు […]

5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్.. ఫిబ్రవరి 10నుంచి మార్చి 7 వరకు పోలింగ్..
X

కరోనా ఆంక్షల నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందిగ్ధానికి గతంలోనే తెరదించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. సీఈసీ సుశీల్‌ చంద్ర.. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ను ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 690 శాసనసభ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు, 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. మార్చి 10న కౌటింగ్‌, అదేరోజు ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించారు.

యూపీలో గరిష్టంగా ఏడు విడతల్లో..
ఉత్తర ప్రదేశ్‌ లో ఫిబ్రవరి 10తో మొదలై.. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవాకు ఫిబ్రవరి 14న ఒకే దశలో పోలింగ్‌ ముగుస్తుంది. ఇక మణిపూర్ రాష్ట్రానికి ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. యూపీలో 403 అసెంబ్లీ స్థానాలుండగా, ఉత్తరాఖండ్‌ లో 70, పంజాబ్‌ లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది.

తొలిసారిగా ఆన్ లైన్ లో నామినేషన్లు..
ఐదు రాష్ట్రాల్లో జరిగే ఈ ఎన్నికల్లో మొత్తం 18.34కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాలను 16శాతం పెంచుతున్నారు. పోలింగ్‌ సమయాన్ని కూడా గంట సేపు పొడిగిస్తున్నారు. పోలింగ్‌ విధుల్లో పాల్గొనేవారికి ప్రికాషనరీ డోస్, అంటే మూడో డోసు కొవిడ్ టీకాను అందిస్తారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ఆన్‌లైన్‌ నామినేషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు సీఈసీ ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌ లైన్‌ లో కూడా తమ నామినేషన్లు దాఖలు చేయొచ్చు. రాజకీయ పార్టీలన్నీ వర్చువల్‌ విధానంలో ప్రచారం నిర్వహించుకోవాలని సీఈసీ సూచించారు. జనవరి 15 వరకు ర్యాలీలు, రోడ్‌షోలు, పాదయాత్రల వంటి బహిరంగ ప్రచారాలపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.

First Published:  8 Jan 2022 8:41 AM GMT
Next Story