23.29 శాతం ఫిట్ మెంట్.. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు..
ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. గత కొంతకాలంగా జరిగిన చర్చల అనంతరం సీఎం జగన్, పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకున్నారు. 23.29 శాతం ఫిట్ మెంట్ ఖరారు చేశారు. ఈమేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో పదవీ విరమణ వయసుని 60నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. జనవరి నుంచి పీఆర్సీ అమలు.. జనవరి 1, 2022 నుంచి పెంచిన జీతాలు చెల్లిస్తామని ప్రకటించింది ప్రభుత్వం. పీఆర్సీ […]
ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. గత కొంతకాలంగా జరిగిన చర్చల అనంతరం సీఎం జగన్, పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకున్నారు. 23.29 శాతం ఫిట్ మెంట్ ఖరారు చేశారు. ఈమేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో పదవీ విరమణ వయసుని 60నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం.
జనవరి నుంచి పీఆర్సీ అమలు..
జనవరి 1, 2022 నుంచి పెంచిన జీతాలు చెల్లిస్తామని ప్రకటించింది ప్రభుత్వం. పీఆర్సీ జూలై 1, 2018 నుంచి అమలవుతుందని తెలిపారు అధికారులు. గతంలో ప్రకటించిన మానిటరీ బెనిఫిట్స్ ఏప్రిల్ 1, 2020 నుంచి అమలులోకి వచ్చినట్టు పరిగణలోకి తీసుకుంటారు. అంటే పెరిగిన జీతాలు ఫిబ్రవరి నెలలో ఉద్యోగులు అందుకుంటారని స్పష్టమైంది.
11వ వేతన సవరణ సంఘం నివేదిక అమలుతోపాటు, ఇతర 71 డిమాండ్ల నేపథ్యంలో సీఎం జగన్ రెండు దఫాలు ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయ్యారు. అనంతరం పీఆర్సీపై తుది ప్రకటన విడుదలైంది. కొత్త పీఆర్సీ ప్రకటన వల్ల ఉద్యోగుల జీతాల రూపంలో ఏపీ ప్రభుత్వంపై రూ.10,247 కోట్ల భారం పడబోతోంది.
కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోనివారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించే విషయంలో మరో ముందడుగు పడింది. జూన్ 30 లోగా ఈనియామకాలన్నీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ లో ప్లాట్లు కేటాయిస్తారు. 20శాతం రిబేటు ఇస్తారు. 10 శాతం ప్లాట్లు ప్రభుత్వ ఉద్యోగులకోసం రిజర్వ్ చేస్తారు.
సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్ 30లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియను పూర్తిచేస్తామని తెలిపింది ప్రభుత్వం. వారికి రెగ్యులర్ పే స్కేల్ అమలు జూన్ నుంచి అమలులోకి వస్తుంది. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు, పీఎఫ్, జీఎల్‌ఐ, లీవ్ ఎన్ క్యాష్‌మెంట్ తదితర సమస్యలన్నీ ఏప్రిల్ లోగా పూర్తి చేస్తామన్నారు. పెండింగ్ ఉన్న డీఏ బకాయిలన్నీ జనవరి జీతం తో కలిపి ఇస్తారు.