Telugu Global
Cinema & Entertainment

అతిథి దేవోభవ మూవీ రివ్యూ

నటీనటులు : ఆది సాయికుమార్, నువేక్ష, రోహిణి, సప్తగిరి, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కెమెరా : అమరనాథ్ బొమ్మిరెడ్డి మ్యూజిక్ : శేఖర్ చంద్ర ఎడిటింగ్ : కార్తీక్ శ్రీనివాస్ నిర్మాణం : శ్రీనివాస సినీ క్రియేషన్స్ నిర్మాతలు : రాజబాబు మిర్యాల , అశోక్ రెడ్డి మిర్యాల దర్శకత్వం : పొలిమేర నాగేశ్వరరావు విడుదల : 7 జనవరి 2022 రేటింగ్ : 1.5/5 రానురాను ఆది సాయికుమార్ సినిమాలు మరీ తీసికట్టుగా తయారవుతున్నాయి. వరుస […]

అతిథి దేవోభవ మూవీ రివ్యూ
X

నటీనటులు : ఆది సాయికుమార్, నువేక్ష, రోహిణి, సప్తగిరి, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు
కెమెరా : అమరనాథ్ బొమ్మిరెడ్డి
మ్యూజిక్ : శేఖర్ చంద్ర
ఎడిటింగ్ : కార్తీక్ శ్రీనివాస్
నిర్మాణం : శ్రీనివాస సినీ క్రియేషన్స్
నిర్మాతలు : రాజబాబు మిర్యాల , అశోక్ రెడ్డి మిర్యాల
దర్శకత్వం : పొలిమేర నాగేశ్వరరావు
విడుదల : 7 జనవరి 2022
రేటింగ్ : 1.5/5

రానురాను ఆది సాయికుమార్ సినిమాలు మరీ తీసికట్టుగా తయారవుతున్నాయి. వరుస పెట్టి సినిమాలు తీస్తున్న ఈ హీరో, జనాలపైకి పదుల సంఖ్యలో సినిమాలు వదుల్తున్నాడు. ఏదో ఒకటి క్లిక్ అవుతుందిలే అనే భావన అతడిలో కనిపిస్తోంది తప్ప, చేస్తున్న సినిమా మీద గట్టిగా శ్రద్ధ పెడుతున్నట్టు కనిపించడం లేదు. ఈరోజు రిలీజైన అతిథి దేవోభవ సినిమాలో కూడా అదే నిర్లిప్తత కనిపించింది.

సినిమాలో మంచి పాయింట్ ఉంది. కానీ దాన్ని ఎలా చెప్పాలో ఎవ్వరికీ తెలియలేదు. ఈ విషయంలో కొత్త దర్శకుడ్ని తప్పు పట్టడానికేం లేదు, అతడి పరిథి అంతవరకే. ఇన్నాళ్లుగా సినిమాలు చేస్తున్న ఆది సాయికుమార్ కైనా తెలియాలి కదా. పైగా ఫోబియాతో నవ్వు పుట్టించిన భలే భలే మగాడివోయ్, మహానుభావుడు లాంటి రెండు క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మనకు ఉండనే ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకోనైనా ఈ సినిమాను తీసుంటే బాగుండేది. అలాంటి ప్రయత్నం జరిగినట్టు ఏ కోశాన కనిపించదు, అనిపించదు.

ఇందులో హీరో అభయ్ (ఆది సాయికుమార్) కు ఓ ఫోబియో ఉంటుంది. దాని పేరు మోనోఫోబియా. ఇలాంటి వ్యక్తులు ఒంటరిగా ఉండలేరు. ఇంకా చెప్పాలంటే ఒంటరితనమే వీళ్లకు పెద్ద శాపం అన్నమాట. అందుకే ఎప్పుడూ తనతో ఒక తోడు ఉండాలని భావిస్తూ అమ్మ(రోహిణి)తోనే ఉంటాడు. ఇతగాడి ప్రాబ్లమ్ తెలుసుకున్న ప్రేమించిన అమ్మాయి కూడా కాదని వెళ్లిపోతుంది. అదే టైమ్ లో సీన్ లోకి వైష్ణవి (నువేక్ష) వస్తుంది. ఆమెను చూసి ప్రేమలో పడతాడు హీరో.

వైష్ణవి కూడా అభయ్ కి దగ్గరై అతని ప్రేమలో పడుతుంది. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా అభయ్ ని అపార్థం చేసుకొని అతని నుండి విడిపోవాలనుకుంటుంది. ఆ సమయంలో ప్రేమించిన వైష్ణవిని అభయ్ ఎలా కన్విన్స్ చేశాడు? ఫైనల్ గా తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడనేది బ్యాలెన్స్ స్టోరీ.

హీరోకు ఓ బలహీనత ఉండడం, ఆ బలహీనతను అధిగమించే క్రమంలో కామెడీ పుట్టడం, క్లైమాక్స్ లో ఎమోషనల్ టచ్ ఇవ్వడం అనేది సక్సెస్ ఫుల్ ఫార్ములా. దర్శకుడు మారుతి పరిచయం చేసిన ఈ ఫార్ములాను అతిథి దేవోభవ మేకర్స్ ఫాలో అవ్వలేకపోయారు. కాసేపు కామెడీగా, మరికొద్దిసేపు సీరియస్ గా కథను నడిపించి మంచి కాన్సెప్ట్ ను కిచిడీ చేశారు. పోలీస్ స్టేషన్ లో తీసిన భారీ ఫైట్ చూస్తే.. ఈ విషయం ఈజీగా అర్థమైపోతుంది. హీరోతో కామెడీ చేయించక, అలాఅని పూర్తిస్థాయిలో యాక్షన్ చూపించక నిరాశపరిచారు.

సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే విషయం అర్థమైపోతుంది. ఇలా తెలిసిపోయిన, తేలిపోయిన విషయాన్ని ఇంట్రెస్టింగ్ గా చెప్పడంలోనే దర్శకుడి గొప్పదనం ఉంటుంది. అలా కట్టిపడేసే నెరేషన్ ఈ సినిమాలో మచ్చుకు కూడా కనిపించదు. అన్నీ రొటీన్ సన్నివేశాలు, రొటీన్ పాత్రలు, రొటీన్ ట్విస్టులే. సప్తగిరితో పండించాలని చూసిన కామెడీ వృధా ప్రయాసగా మిగిలిపోయింది. ఇంటర్వెల్ లో ఉన్నంతలో మంచి ట్విస్ట్ ఇచ్చిన దర్శకుడు.. సెకెండాఫ్ నుంచి స్క్రీన్ ప్లేను పరుగెత్తిస్తాడనుకుంటే, మళ్లీ అక్కడ కూడా నిరాశే పలకరిస్తుంది. అలా అటుఇటు కాకుండా సినిమాను ముగించి మమ అనిపిస్తాడు.

ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే, ముందుగా విమర్శించాల్సింది ఆది సాయికుమార్ నే. ఇకపై మంచి కాన్సెప్ట్ ఉన్న కథల్ని మాత్రమే సెలక్ట్ చేసుకుంటానని చెప్పిన ఆదిసాయికుమార్.. ఆ కాన్సెప్ట్ కు తగ్గట్టు తన నటనను మార్చుకోలేకపోతున్నాడు. కథ ఏదైనా, సన్నివేశం ఎలాంటిదైనా తను ఇలానే నటిస్తాను అన్నట్టుంది ఆది యాక్టింగ్. ఈ విషయంలో ఆది కాస్త ఎక్కువ దృష్టి పెట్టాల్సిందే. హీరోయిన్ నువేక్ష చూడ్డానికి బాగుంది కానీ, ఆమె నటించడానికేం లేదు. ఉన్నంతలో రోహిణి పాత్ర ఆకట్టుకోగా.. మిగతా పాత్రలన్నీ తప్పదన్నట్టు ప్రవర్తించాయి.

టెక్నికల్ గా కూడా సినిమాలో ఏం లేదు. శేఖర్ చంద్ర ఇచ్చిన పాటల్లో 2 బాగున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన 'బాగుంటుంది' అనే పాట నిజంగానే బాగుంది. కానీ బయటకొచ్చిన తర్వాత మంచి సాంగ్ ఈ సినిమా వల్ల వేస్ట్ అయిందనే ఫీలింగ్ వస్తుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టు ఉన్నాయి.

ఓవరాల్ గా అతిథి దేవోభవ సినిమా ఆకట్టుకోని కథనంతో సాగింది. ఈ సినిమాతో ఆది సాయికుమార్ మరోసారి నిరాశపరిచాడు.

First Published:  7 Jan 2022 12:32 PM IST
Next Story