పాత రోజుల్లోకి వెళ్లలేం.. ఈ మార్పు ఇక 'పది'లం..
కరోనా వల్ల మానవ జీవితంలో వచ్చిన మార్పులు శాశ్వతం అంటున్నారు నిపుణులు. కరోనా కాలాన్ని కష్టకాలం అనుకుంటున్నాం కానీ.. మానవ జీవితంలో దాదాపు 50 ఏళ్ల తర్వాత రావాల్సిన మార్పులన్నీ కరోనా కాస్త ముందుగానే తీసుకొచ్చిందని చెబుతున్నారు. మొత్తంగా మానవ జీవితంలో 10 మార్పులు శాశ్వతంగా నిలిచిపోతాయనేది విశ్లేషకుల మాట. వర్క్ ఫ్రమ్ హోమ్.. కరోనా కాలంలో వచ్చిన ప్రధాన మార్పు వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంటి వద్ద నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించింది కరోనా. సంవత్సరాల […]
కరోనా వల్ల మానవ జీవితంలో వచ్చిన మార్పులు శాశ్వతం అంటున్నారు నిపుణులు. కరోనా కాలాన్ని కష్టకాలం అనుకుంటున్నాం కానీ.. మానవ జీవితంలో దాదాపు 50 ఏళ్ల తర్వాత రావాల్సిన మార్పులన్నీ కరోనా కాస్త ముందుగానే తీసుకొచ్చిందని చెబుతున్నారు. మొత్తంగా మానవ జీవితంలో 10 మార్పులు శాశ్వతంగా నిలిచిపోతాయనేది విశ్లేషకుల మాట.
వర్క్ ఫ్రమ్ హోమ్..
కరోనా కాలంలో వచ్చిన ప్రధాన మార్పు వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంటి వద్ద నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించింది కరోనా. సంవత్సరాల తరబడి ఆఫీస్ లకి వెళ్లకపోయినా పనులు మాత్రం జరిగిపోతూనే ఉన్నాయి. ఈ మార్పు అటు ఉద్యోగులకి, ఇటు యాజమాన్యానికి కూడా ఉపయోగకరంగా మారింది. గతంలో ఐటీ కంపెనీలో మాత్రమే ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఉండగా.. ఇప్పుడు అన్నిరంగాల్లోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది.
ఆన్ లైన్ చర్చలు, ఆన్ లైన్లోనే వేదికలు..
కరోనా కాలంలో ప్రయాణాలు లేవు, ఎక్కడివారక్కడే గప్ చుప్. ఈ సందర్భంలో చర్చలు, సమావేశాలు ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. ఖర్చు తక్కువ, పర్యావరణానికి హాని కాదు, ఆన్ లైన్ చర్చల్లో ఎంతమందైనా పాల్గొనొచ్చు. ఇలా కరోనా తెచ్చిన ఈ మార్పు చాలా ఉపయోగకరంగా ఉందని అంటున్నారు. ఇటీవల ఆన్ లైన్ పెళ్లిళ్లు కడా మొదలు కావడం మరో విశేషం.
డోర్ డెలివరీ మరింత దగ్గరైంది..
ఈ కామర్స్, డోర్ డెలివరీ, ఆన్ లైన్ షాపింగ్ వంటివి ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్నాయి. కరోనా కాలంలో వచ్చిన లాక్ డౌన్ వల్ల ఈ ట్రెండ్ మరింత పెరిగింది. ఆన్ లైన్ షాపింగ్ వల్ల సమయం కలిసి రావడం, ఇతర ఇబ్బందులు తగ్గిపోయాయి.
పెరిగిన ఆన్ లైన్ పేమెంట్స్..
ఆన్ లైన్ పేమెంట్స్ ని ప్రోత్సహించేందుకు పెద్ద నోట్ల రద్దు, ఇతరత్రా మార్పులు తీసుకొచ్చినా.. పెద్దగా ఫలితం లేకపోయింది. అయితే కరోనా తర్వాత ఆన్ లైన్ పేమెంట్స్ వద్దన్నా పెరిగిపోయాయి. ఏప్రిల్- 2020లో భారత్ లో లక్షన్నర కోట్ల రూపాయల లావాదేవీలు ఆన్ లైన్ లో జరగగా.. 2021 నవంబర్ లో 7.7 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు ఆన్ లైన్ లో జరగడం విశేషం.
విద్యా వ్యవస్థలో పెను మార్పు..
కరోనా కాలంలో విద్యా వ్యవస్థలో పెను మార్పులొచ్చాయి. ఆన్ లైన్ లెర్నింగ్ కి అవకాశాలు మెరుగయ్యాయి. స్కూళ్లు, కాలేజీలు మూతబడినా తరగతులు మాత్రం జరిగాయి. నేర్చుకోవాలనే కోరిక ఉన్నవారికి అవకాశాలు కోకొల్లలు. ఖాళీ టైమ్ లో, అనుకూల వాతావరణంలో కూర్చుని నేర్చుకోవడం మొదలైంది. నాలుగు గదుల మధ్య కూర్చుని నేర్చుకోవడం కంటే అనుకూల వాతావరణంలో పాఠ్యాంశాలు నేర్చుకోవడంతో మెరుగైన ఫలితాలు సాధించొచ్చనేది తేలింది.
టెలి మెడిసిన్ కి పెరిగిన ప్రాధాన్యత..
వైద్యుడు ఒకచోట, రోగి మరొక చోట.. కరోనా కాలంలో ఇలాంటి ట్రీట్ మెంట్లు చాలా చోట్ల అందరికీ అనుభవంలోని విషయమే. కరోనా అనుమానం ఉన్నవారంతా ఇంటిలోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు. భారత ప్రభుత్వం ఈ-సంజీవని పేరుతో దీన్ని అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
మారిన వినోదం..
కరోనా కాలంలో వినోద ప్రపంచం పూర్తిగా మారిపోయింది. సినిమా థియేటర్ల వ్యవస్థని ఓటీటీ ఆక్రమించేసింది. తక్కువ ఖర్చులో ఎక్కువ వినోదం అందుబాటులోకి వచ్చింది. భాషా భేదం లేకుండా అన్ని ప్రాంతాల సినిమాలు, వెబ్ సిరీస్ లు అందర్నీ అలరిస్తున్నాయి.
వైద్యరంగంలో పెరిగిన ఉపాధి..
కరోనా వల్ల వైద్య రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక ఉద్యోగుల్ని నియమించుకున్నాయి. అదే సమయంలో చాలామంది నిరుద్యోగులు వైద్య రంగంపై ఆసక్తి పెంచుకున్నారు, అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ప్రంపచ వ్యాప్తంగా ఈ మార్పు గమనించ వచ్చు. జాన్స్ హోప్ కిన్స్ యూనివర్శిటీలో 74శాతం అడ్మిషన్లు పెరిగాయి.
పరిశుభ్రంగా పబ్లిక్ ప్లేస్ లు..
గతంలో ఆస్పత్రులు, పబ్లిక్ స్థలాల్లో పరిశుభ్రత అంతంతమాత్రంగానే ఉండేది. కానీ కరోనా సమయంలో పరిశుభ్రత పెరిగింది. బస్సులు, రైళ్లు.. ఇతర వాహనాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. సినిమా హాళ్లు, ఇతర ప్రాంతాల్లో కూడా శానిటైజ్ చేయడం అలవాటుగా మారింది.
వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ..
కరోనా కాలంలో వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా ప్రతి ఒక్కరికీ శ్రద్ధ పెరిగింది. పబ్లిక్ ప్లేసుల్లో వస్తువుల్ని తాకడం తగ్గించేశారు. శానిటైజర్ల వాడకం, మాస్క్ ల వాడకం కూడా తప్పనిసరి అయింది. ఇంటితో పాటు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలనే అవగాహన పెరిగింది.
మొత్తమ్మీద కరోనా మానవ జీవితంలో పెను మార్పుల్ని తీసుకొచ్చింది. అయితే ఈ మార్పులన్నీ కరోనాతో వెళ్లిపోయేవి కావు, శాశ్వతంగా మానవ జీవితాల్లో నిలిచిపోయేవి.