బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్.. కరీంనగర్ సబ్‌జైలుకు తరలింపు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, మరో నలుగురికి కరీంనగర్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కరీంనగర్ సబ్ జైలుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని తరలించారు. అసలు ఏం జరిగిందంటే.. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను సవరించాలంటూ బండి సంజయ్ ఆదివారం కరీంనగర్‌లో జాగరణ దీక్ష తలపెట్టారు. ఆదివారం ఉదయం సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన సంజయ్.. కరీంనగర్‌కు రాకముందే వందలాదిగా కార్యకర్తలు దీక్ష స్థలానికి చేరుకున్నారు. […]
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, మరో నలుగురికి కరీంనగర్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కరీంనగర్ సబ్ జైలుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని తరలించారు.
అసలు ఏం జరిగిందంటే..
ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను సవరించాలంటూ బండి సంజయ్ ఆదివారం కరీంనగర్‌లో జాగరణ దీక్ష తలపెట్టారు. ఆదివారం ఉదయం సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన సంజయ్.. కరీంనగర్‌కు రాకముందే వందలాదిగా కార్యకర్తలు దీక్ష స్థలానికి చేరుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య బండి సంజయ్ బైకు మీద తన కార్యాలయానికి చేరారు. ప్రహరీ గేటుకు, ఆఫీస్‌కు లోపలి నుంచే తాళం వేసుకున్నారు. లాఠీఛార్జీలు, తోపులాటలతో బండి ఆఫీసు యుద్ధక్షేత్రాన్ని తలపించింది.
రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్ కట్టర్లతో గేట్లు తొలగించి, అనంతరం గునపాలతో తలుపులు తెరిచారు. తలుపులు బద్ధలు కొట్టి లోనికి ప్రవేశించిన పోలీసులు సంజయ్‌ని బలవంతంగా అరెస్టు చేసి మానకొండూరు స్టేషన్‌కు తరలించారు. దీంతో సంజయ్ అక్కడే దీక్షకు దిగారు. అరెస్టుకు ముందు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఇదిలా ఉండగా..
కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో జాగరణ దీక్షకు అనుమతి లేదని పోలీసులు ఉదయమే నోటీసులు జారీచేశారు. అయినా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షా స్థలికి చేరుకోవడం.. పోలీసులు వారిని అరెస్టు చేయడం జరిగింది.
అరెస్టు అయిన బండి సంజయ్‌ని విడుదల చేయాల్సిందిగా ఆయన తరఫు న్యాయవాది బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా.. కరీంనగర్ కోర్టు ఆ పిటీషన్ను తిరస్కరించింది. సంజయ్‌తో పాటు మరో నలుగురు బీజేపీ నేతలకు 14 రోజుల రిమాండ్ విధించింది. గతంలో బండి సంజయ్‌పై నమోదైన 10 కేసులను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని గతంలో ఐపీసీ 353 సెక్షన్ కింద నమోదైన కేసులపై బీజేపీ లీగల్ సెల్ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేపు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.