Telugu Global
Cinema & Entertainment

అర్జున ఫల్గుణ మూవీ రివ్యూ

నటీనటులు : శ్రీవిష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవీప్రసాద్, రంగస్థలం మహేష్ తదితరులు నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : తేజ మర్ని సినిమాటోగ్రపీ : జగదీష్ చీకటి మ్యూజిక్ డైరెక్టర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ రన్ టైమ్ : 2 గంటల 9 నిమిషాలు రిలీజ్ డేట్ : డిసెంబర్ 31, 2021 రేటింగ్ : 1.5/5 ప్రతి సినిమాకు ఓ జానర్ […]

అర్జున ఫల్గుణ మూవీ రివ్యూ
X

నటీనటులు : శ్రీవిష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవీప్రసాద్, రంగస్థలం మహేష్ తదితరులు
నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : తేజ మర్ని
సినిమాటోగ్రపీ : జగదీష్ చీకటి
మ్యూజిక్ డైరెక్టర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్
రన్ టైమ్ : 2 గంటల 9 నిమిషాలు
రిలీజ్ డేట్ : డిసెంబర్ 31, 2021
రేటింగ్ : 1.5/5

ప్రతి సినిమాకు ఓ జానర్ ఉంటుంది. ఆ జానర్ కు తగ్గట్టే కథ సాగుతుంది. అంచనాలు అందుకుంటే సక్సెస్ అవుతుంది. మరి జానర్ ఏంటో కూడా చెప్పలేని సినిమాలుంటాయా? ఎందుకుండవు? ఈరోజు అలాంటి సినిమానే రిలీజ్ అయింది. దాని పేరు అర్జున ఫల్గుణ.

శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమాతో తేజ మర్ని దర్శకుడిగా పరిచయమయ్యాడు. తన తొలి సినిమాతోనే ప్రేక్షకులకు అన్ని జానర్లు చూపించేయాలని బాగా తహతహలాడినట్టున్నాడు ఈ దర్శకుడు. సినిమాలో కామెడీ, యాక్షన్, క్రైమ్, థ్రిల్, రొమాన్స్, సస్పెన్స్.. ఇలా ఒకటేంటి సర్వరసాలు కలిపేశాడు. ఇలా కలిపి తయారుచేసిన కిచిడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పైన చెప్పుకున్న రసాల్లో ఒక్కటి కూడా రసానుభూతి కలిగించకపోవడం బాధాకరం. సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ పండలేదు. అదేదో పండలేదు అనేకంటే, అసలు రొమాన్స్ లేదనడం కరెక్ట్. థ్రిల్ ఎలిమెంట్స్ క్లిక్ అవ్వలేదు. కామెడీ పేలలేదు. యాక్షన్ హైలెట్ అవ్వలేదు. పాటలు ఆకట్టుకోలేదు. ఏతావతా ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాజిటివ్ ఎలిమెంట్ ఏదైనా ఉందంటే అది శ్రీవిష్ణు నటన మాత్రమే. మరోసారి ఈ హీరో ఆకట్టుకున్నాడు.

ముందు కథ ఏంటో తెలుసుకుందాం.. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో అర్జున్ (శ్రీవిష్ణు), అతడి ఫ్రెండ్స్ (రంగస్థలం మహేష్, చైతన్య, రాజ్ కుమార్ చౌదరి) ఉంటారు. అంతా చిన్నప్పట్నుంచి ఫ్రెండ్స్. వీళ్ల గ్యాంగ్ లోకి శ్రావణి (అమృతా అయ్యర్) కూడా చిన్నప్పుడే చేరుతుంది. అంతా కలిసిమెలిసి పెరుగుతారు. డిగ్రీ చదివినా, తండ్రిపై ప్రేమ, ఊరిపై మమకారంతో సిటీకి వెళ్లడు అర్జున్. ఇంట్లోనే ఉంటూ పాలవ్యాపారం చేస్తాడు.

శ్రావణికి, అర్జున్ అంటే ఇష్టం. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఊరిలో కరణం (సీనియర్ నరేష్), బ్యాంక్ అధికారులతో కుమ్మక్కవుతాడు. పైకి రైతులకు లోన్లు ఇప్పించినట్టు నటించి, ఆస్తులు రాయించుకుంటాడు. ఈ క్రమంలో రంగస్థలం మహేష్ ఆస్తి కూడా జప్తుకు వస్తుంది. ఆస్తిని కాపాడుకునేందుకు, అంతా కలిసి సోడా కొట్టు వ్యాపారం చేయాలనుకుంటారు కానీ కుదరదు. దీంతో ఓ ఫ్రెండ్ చెప్పిన మాటలు విని గంజాయి అక్రమ రవాణాకు రెడీ అవుతారు. ఈ క్రమంలో ఈ గ్యాంగ్ ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? వాటి నుంచి అర్జున్ ఎలా బయటపడ్డాడు, తన గ్యాంగ్ ను ఎలా బయటపడేశాడు అనేది స్టోరీ.

కథకు గోదావరి యాస, భాష జత చేసినప్పటికీ ఇదొక ఫక్తు రొటీన్ క్రైమ్ కామెడీ డ్రామా. ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం. కథలో ట్విస్టులు ఎంతో కీలకం. ఈ విషయంలో దర్శకుడు తేజ మర్ని పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఇతడిచ్చే ట్విస్టులు 90ల్లో సినిమాల్ని గుర్తుచేస్తాయి. మరీ ముఖ్యంగా హీరోను ఎలివేట్ చేయడం కోసం ఆ ట్విస్టుల్ని కూడా సిల్లీగా మార్చేసి, లాజిక్కులు లేకుండా చేసి నెరేషన్ ను నీరసంగా మార్చేశాడు. ఫలితంగా సినిమా చూస్తున్నంత సేపు అర్జున..ఫల్గుణ అనుకోవడం మినహా మనమేం చేయలేం.

ఫస్టాఫ్ లో పాత్రల పరిచయ కార్యక్రమానికే చాలా టైమ్ టైమ్ తీసుకున్న దర్శకుడు.. సెకెండాఫ్ కు వచ్చేసరికి ఆకట్టుకునేలా సన్నివేశాలు రాసుకోలేకపోయాడు. కొన్ని ఎపిసోడ్స్ థ్రిల్లింగ్ గా అనిపించినప్పటికీ, అంతలోనే దర్శకుడు తన చేజేతులా ఆ ఫీల్ ను చెడగొట్టే సన్నివేశాలు పేర్చి సినిమాను డల్ చేశాడు. దీనికితోడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరో సైడ్ కిక్ బ్యాచ్ చేసే కామెడీ ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. సంగీతం అలరించలేదు.

ఉన్నంతలో శ్రీవిష్ణు ఆకట్టుకున్నాడు. అతడి నటన, గోదారి యాస బాగున్నాయి. హీరోయిన్ అమృతా అయ్యర్ కు నటించే అవకాశం లేదు. హీరో ఫ్రెండ్స్ పాత్రలు పోషించిన వ్యక్తులు మెప్పించలేదు. సీనియర్ నరేష్, శివాజీరాజా తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ గా చూసుకుంటే.. జగదీశ్ చీకటి సినిమాటోగ్రఫీ మినహా ఇంకేం ఆకట్టుకోవు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగాలేవు. ఇక దర్శకుడి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.

ఓవరాల్ గా చూసుకుంటే, రాజరాజ చోర సినిమా ఇచ్చిన ఉత్సాహాన్ని, సక్సెస్ ను అర్జున-ఫల్గుణ సినిమాతో కొనసాగించలేకపోయాడు శ్రీవిష్ణు. సినిమా నిడివి 2 గంటల 9 నిమిషాలు మాత్రమే ఉన్నప్పటికీ.. శుభం కార్డ్ పడేసరికి 3 గంటల మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది.

First Published:  31 Dec 2021 3:03 PM IST
Next Story