Telugu Global
National

వ్యవసాయ చట్టాలను తిరిగి తెచ్చే ప్రసక్తే లేదు.. తోమర్ క్లారిటీ..

నూతన వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది కానీ.. త్వరలోనే వాటిని తిరిగి తెరపైకి తెస్తుందనే అర్థం వచ్చేలా ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. రైతుల ఆందోళనలతో కేంద్రం వెనక్కి తగ్గిందని సంతోషించేలోపే.. ఇలా సాగు చట్టాలపై డబుల్ గేమ్ ఏంటని విపక్షాలు మండిపడ్డాయి. వచ్చేఏడాది జరగాల్సిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల అనంతరం కేంద్రం తన అసలు స్వరూపం బయటపట్టే […]

వ్యవసాయ చట్టాలను తిరిగి తెచ్చే ప్రసక్తే లేదు.. తోమర్ క్లారిటీ..
X

నూతన వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది కానీ.. త్వరలోనే వాటిని తిరిగి తెరపైకి తెస్తుందనే అర్థం వచ్చేలా ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. రైతుల ఆందోళనలతో కేంద్రం వెనక్కి తగ్గిందని సంతోషించేలోపే.. ఇలా సాగు చట్టాలపై డబుల్ గేమ్ ఏంటని విపక్షాలు మండిపడ్డాయి. వచ్చేఏడాది జరగాల్సిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల అనంతరం కేంద్రం తన అసలు స్వరూపం బయటపట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. బీజేపీ కుట్రల్ని ప్రజలు భగ్నం చేయాలని పిలుపునిచ్చారు. అటు రైతు సంఘాలు కూడా కేంద్ర మంత్రి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాయి.

దిగొచ్చిన తోమర్..
కేంద్ర మంత్రి తోమర్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించడంతో కేంద్రం నష్టనివారణ చర్యలు చేపట్టింది. మంత్రి తోమర్ తో ఓ ప్రకటన విడుదల చేయించింది. తన వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చెప్పారని కేంద్ర మంత్రి తాజాగా వివరణ ఇచ్చారు. తాను అలా చెప్పలేదని, ప్రభుత్వం ఆ చట్టాలను తిరిగి తీసుకురాదని వెల్లడించారు. కేంద్రం మంచి చట్టాలను రూపొందించింది కానీ, కొన్ని కారణాల వల్ల రద్దు చేయాల్సి వచ్చిందని, అయితే రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మాత్రమే తాను చెప్పానని వివరణ ఇచ్చారు తోమర్.

రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాల నేతలు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఆందోళనల్లో పదుల సంఖ్యలో రైతులు మరణించారు. ఈ మరణాలపై కూడా పెద్ద వివాదం జరిగింది. రైతుల ఆందోళనల్లో ఒక్క ప్రాణం కూడా పోలేదని కేంద్రం వాదించింది. కానీ కాంగ్రెస్ ఆధారాలతో సహా పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీసింది. ఈ నేపథ్యంలో గొడవ మరింత ముదిరేలోపు, వచ్చే ఏడాది జరగబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో రైతు చట్టాలే ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారేలోపు వాటిని కేంద్రం వెనక్కు తీసుకుంది. అయితే తోమర్ వ్యాఖ్యలతో మరోసారి కేంద్రంపై అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. దీంతో తోమర్ తోనే వాటిపై వివరణ ఇప్పించింది కేంద్రం. రైతు చట్టాలను తిరిగి తీసుకొచ్చే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చింది.

First Published:  26 Dec 2021 8:17 AM GMT
Next Story