రిలీజ్ కు ముందు వివాదం రేపిన నాని
సరిగ్గా తన కొత్త సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు నాని. ఓవైపు శ్యామ్ సింగరాయ్ సినిమా రిలీజ్ పెట్టుకొని, మరోవైపు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశాడు. దీంతో ఏపీలో పలువురు మంత్రులు, నాని వ్యాఖ్యల్ని తిప్పికొడుతున్నారు. వైసీపీ శ్రేణులు, సోషల్ మీడియాలో నానిపై ట్రోలింగ్ షురూ చేశాయి. ఇంతకీ నాని ఏమన్నాడు..? “ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో అది కరెక్ట్ కాదు. ఆ విషయం అందరికీ తెలుసు. ఎలా చెప్పాలో […]
సరిగ్గా తన కొత్త సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు నాని. ఓవైపు శ్యామ్ సింగరాయ్ సినిమా రిలీజ్ పెట్టుకొని, మరోవైపు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశాడు. దీంతో ఏపీలో పలువురు మంత్రులు, నాని వ్యాఖ్యల్ని తిప్పికొడుతున్నారు. వైసీపీ శ్రేణులు, సోషల్ మీడియాలో నానిపై ట్రోలింగ్ షురూ చేశాయి.
ఇంతకీ నాని ఏమన్నాడు..?
“ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో అది కరెక్ట్ కాదు. ఆ విషయం అందరికీ తెలుసు. ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు, కానీ కరెక్ట్ కాదు. సినిమాలు, రాజకీయాలు పక్కనపెట్టేస్తే.. మీరు ప్రేక్షకుల్ని అవమానిస్తున్నారు. ఓ 10 మందికి ఉద్యోగం ఇచ్చి, పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి బాక్సాఫీస్ కౌంటర్ కంటే.. పక్కనే ఉన్న కిరాణా షాపు కౌంటర్ ఎక్కువగా ఉంటే అది లాజిక్ అనిపించుకోదు. ప్రేక్షకుల్ని అవమానించడం కరెక్ట్ కాదు.”
ఇలా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశాడు హీరో నాని. తన అభిప్రాయం చెప్పకుండా, ఏకంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న చర్యలు, ప్రేక్షకులకు అవమానం అనే రీతిలో మాట్లాడారు. సరిగ్గా ఇక్కడే ఏపీ మంత్రులకు కోపం వచ్చింది.
మంత్రులు ఏమన్నారు..?
టికెట్ ధరల్ని నియంత్రిస్తే ప్రేక్షకుల్ని అవమానించడం ఎలా అవుతుందని ప్రశ్నించారు మంత్రులు కన్నబాబు, బొత్స. సినిమాను సామాన్యుడికి అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఏమైనా సమస్యలుంటే.. అధికారులతో మాట్లాడాలని బొత్స అన్నారు. అటు కన్నబాబు.. నానికి పరోక్షంగా చురకలంటించారు. కిరాణా వ్యాపారం గురించి నాని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.