Telugu Global
National

కేంద్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ..

ఒమిక్రాన్ విషయంలో కేంద్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే ఎట్ రిస్క్ దేశాలనుంచి వచ్చే ప్రయాణికులతో జాగ్రత్త అంటూ వార్నింగ్ బెల్ కొట్టిన కేంద్రం.. తాజాగా వార్ రూమ్ లు యాక్టివేట్ చేయండి అంటూ రాష్ట్రాలకు మరో సిగ్నల్ ఇచ్చింది. డెల్టా రకంతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్‌ 3 రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతోందని కేంద్రం తెలిపింది. మరింత దూరదృష్టితో వ్యవహరించాలని, ఒమిక్రాన్ సోకినవారి సంఖ్య, వారిని కలసినవారి సంఖ్య, వారి గుర్తింపు విషయంలో […]

కేంద్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ..
X

ఒమిక్రాన్ విషయంలో కేంద్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే ఎట్ రిస్క్ దేశాలనుంచి వచ్చే ప్రయాణికులతో జాగ్రత్త అంటూ వార్నింగ్ బెల్ కొట్టిన కేంద్రం.. తాజాగా వార్ రూమ్ లు యాక్టివేట్ చేయండి అంటూ రాష్ట్రాలకు మరో సిగ్నల్ ఇచ్చింది. డెల్టా రకంతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్‌ 3 రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతోందని కేంద్రం తెలిపింది. మరింత దూరదృష్టితో వ్యవహరించాలని, ఒమిక్రాన్ సోకినవారి సంఖ్య, వారిని కలసినవారి సంఖ్య, వారి గుర్తింపు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు.

ఒమిక్రాన్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాల వారీగా ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నైట్‌ కర్ఫ్యూలు విధించడం, జనసమూహాలను నియంత్రించడం, ఆఫీసుల్లో సిబ్బంది సంఖ్యను తగ్గించడం, ప్రజా రవాణాపై ఆంక్షలు విధించే విషయంలో అలసత్వం వద్దని హెచ్చరించారు. అదే సమయంలో ఆస్పత్రుల్లో కొవిడ్ బెడ్స్ సిద్ధం చేసుకుని ఉంచాలని, అంబులెన్స్ లు, ఆక్సిజన్ లభ్యత వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. కొవిడ్ మందులు, వైద్య సౌకర్యాల మెరుగుదలకు అత్యవసర నిధులు వినియోగించుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్‌ ని వేగవంతం చేయాలని కోరారు.

12 రాష్ట్రాలకు విస్తరించిన ఒమిక్రాన్..
తాజాగా మహారాష్ట్రలో 11, తెలంగాణలో 4 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడంతో దేశ వ్యాప్తంగా నమోదైన కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య 215కి పెరిగింది.ఇప్పటివరకు 12 రాష్ట్రాలకు ఒమిక్రాన్‌ విస్తరించగా.. అధిక కేసులు మహారాష్ట్ర (65), ఢిల్లీ (54), తెలంగాణ (24)లో నమోదయ్యాయి. ఒమిక్రాన్ సోకిన 215మందిలో ఇప్పటికే 77 మంది కోలుకున్నారు. మిగిలినవారు చికిత్స తీసుకుంటున్నారు.

కర్నాటకలో కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం..
ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. డిసెంబరు 30 నుంచి జనవరి 2వ తేదీ వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి పార్టీలు, వేడుకలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. పబ్‌లు ,రెస్టారంట్లు, అపార్ట్‌ మెంట్లలో డీజేలు ఉపయోగించకూడదని చెప్పింది. రెండు డోసుసల టీకా తీసుకుంటేనే.. పబ్ లు, రెస్టారెంట్లలో పార్టీలు చేసుకోవచ్చు. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి, 50శాతం హాజరుకి మాత్రమే అవకాశం. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఎం బసవరాజ్ బొమ్మై.

First Published:  22 Dec 2021 3:10 AM IST
Next Story