Telugu Global
National

దేశంలోనే మరో సంచలన పథకం.. తమిళనాడులో శ్రీకారం..

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. వీటి నివారణకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటిస్తున్నా బాధితులను ఆదుకోడానికి మాత్రం ముందుకు రావడంలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలులో ఉన్నా కూడా అవి ఆయా రాష్ట్రాల్లో ఉన్నవారికి మాత్రమే వర్తిస్తాయి. అందులోనూ కొన్ని పరిమితులున్నాయి. ఈ దశలో తమిళనాడు ప్రభుత్వం ఓ వినూత్న పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఇన్నయిర్ కొప్పోమ్.. నమైకాక్కుమ్-48 అనే పేరుతో ఈ పథకాన్ని పట్టాలెక్కించింది కూడా. బాధితులెవరైనా సరే..? […]

దేశంలోనే మరో సంచలన పథకం.. తమిళనాడులో శ్రీకారం..
X

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. వీటి నివారణకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటిస్తున్నా బాధితులను ఆదుకోడానికి మాత్రం ముందుకు రావడంలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలులో ఉన్నా కూడా అవి ఆయా రాష్ట్రాల్లో ఉన్నవారికి మాత్రమే వర్తిస్తాయి. అందులోనూ కొన్ని పరిమితులున్నాయి. ఈ దశలో తమిళనాడు ప్రభుత్వం ఓ వినూత్న పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఇన్నయిర్ కొప్పోమ్.. నమైకాక్కుమ్-48 అనే పేరుతో ఈ పథకాన్ని పట్టాలెక్కించింది కూడా.

బాధితులెవరైనా సరే..?
బాధితులు తమిళనాడుకి చెందినవారా, కాదా అనే తారతమ్యం లేదు. ఎక్కడివారైనా తమిళనాడు పరిధిలో ప్రమాదానికి గురయితే మాత్రం మొదటి 48 గంటల్లో వారికి అందే వైద్యం పూర్తిగా ఉచితం. ప్రమాదంలో గాయపడినవారికి చికిత్స అందించేందుకు 201 ప్రభుత్వ ఆస్పత్రులు, 409 ప్రైవేట్ ఆస్పత్రులు.. ఇలా మొత్తం 610 ఆస్పత్రులను ఎంపిక చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆస్పత్రులకు చేర్చడం దగ్గర్నుంచి వారికి అందించే చికిత్స ఖర్చుని కూడా తానే భరించేందుకు ముందుకు వచ్చింది తమిళనాడు ప్రభుత్వం. అంతే కాదు హైవేల పక్కన ఉండే అన్ని ప్రైవేట్ ఆస్పత్రులను ఈ లిస్ట్ లో చేర్చి ఈ పథకానికి అత్యధిక ప్రజోపయోగాన్ని కలిగించింది. ఏ ప్రాంతానికి చెందినవారయినా, ఎలాంటి భేద భావం లేకుండా అందరికీ సమానంగా ఈ పథకం ప్రయోజనాలు అందుతాయి.

ఆదినుంచీ సంచలనాలే..
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు క్యాంటిన్ వ్యవస్థ రద్దు చేశారు. ఆలయాల అర్చకత్వానికి దళితులకు అవకాశమిచ్చారు. తమిళనాడు పోలీసులకు వీక్లీ ఆఫ్ వెసులుబాటు కల్పించారు. ఇటీవల చెన్నై వరదల సమయంలో ఆయన చూపిన చొరవను అందరూ అభినందిస్తున్నారు. ప్రజలతో మమేకమై ఆయన పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. తాజాగా రోడ్డు ప్రమాదాల బారిన పడినవారికి సంజీవనిగా భావిస్తున్న ఇన్నయిర్ కొప్పోమ్.. నమైకాక్కుమ్-48 పథకానికి శ్రీకారం చుట్టారు. రోడ్డు ప్రమాదాల బాధితుల చికిత్స విషయంలో కేంద్రం కూడా మీనమేషాలు లెక్కిస్తున్న సమయంలో స్టాలిన్ తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శప్రాయం.

First Published:  19 Dec 2021 3:53 AM IST
Next Story