నాన్ రిస్క్ దేశాలనుంచే రిస్క్ ఎక్కువ..
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. శనివారం ఒక్కరోజే 12 కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 21కి పెరిగింది. అయితే ఇందులో ఒకరు హైదరాబాద్ కి చేరుకున్న వెంటనే బెంగాల్ వెళ్లిపోవడంతో ఆ కేసుని లెక్కలో వేయడంలేదు. తెలంగాణలో ప్రస్తుతం 20 ఒమిక్రాన్ కేసులున్నట్టు అధికారిక సమాచారం. విచిత్రం ఏంటంటే.. నాన్ రిస్క్ దేశాలనుంచి వస్తున్నవారే ఎక్కువగా ఒమిక్రాన్ ని తెస్తున్నారు. ప్రస్తుతానికి ఎయిర్ పోర్టుల్లో హై రిస్క్ దేశాలనుంచి.. అంటే బ్రిటన్, […]
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. శనివారం ఒక్కరోజే 12 కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 21కి పెరిగింది. అయితే ఇందులో ఒకరు హైదరాబాద్ కి చేరుకున్న వెంటనే బెంగాల్ వెళ్లిపోవడంతో ఆ కేసుని లెక్కలో వేయడంలేదు. తెలంగాణలో ప్రస్తుతం 20 ఒమిక్రాన్ కేసులున్నట్టు అధికారిక సమాచారం. విచిత్రం ఏంటంటే.. నాన్ రిస్క్ దేశాలనుంచి వస్తున్నవారే ఎక్కువగా ఒమిక్రాన్ ని తెస్తున్నారు. ప్రస్తుతానికి ఎయిర్ పోర్టుల్లో హై రిస్క్ దేశాలనుంచి.. అంటే బ్రిటన్, దక్షిణాఫ్రికా సహా కొన్ని ఇతర దేశాలనుంచి వచ్చేవారిని మాత్రమే పట్టిపట్టి చూస్తున్నారు. వారికి పరీక్షలు తప్పనిసరి చేస్తున్నారు. అయితే నాన్ రిస్క్ దేశాలనుంచి వచ్చేవారిలో కేవలం 2 శాతం మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే తెలంగాణలో బయటపడిన 20 ఒమిక్రాన్ కేసుల్లో నాన్ రిస్క్ దేశాలనుంచి వచ్చినవారే 16మంది ఉండటం విశేషం.
అందరికీ పరీక్షలు అసాధ్యమా..?
విదేశాలనుంచి వచ్చేవారందరికీ పరీక్షలు నిర్వహించడం, అందరి శ్వాబ్ సేకరించి ఒమిక్రాన్ వేరియంట్ నిర్థారణ కోసం పంపించడం కష్ట సాధ్యం. అందుకే ఎట్ రిస్క్ కంట్రీస్, నాన్ రిస్క్ కంట్రీస్ అనే విభజన పెట్టుకున్నారు. నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చేవారిపై పెద్దగా దృష్టి పెట్టడంలేదు. అయితే ప్రస్తుతం బయటపడుతున్న కేసులన్నీ నాన్ రిస్క్ దేశాలనుంచి వస్తున్నవే కావడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. అయితే ఎయిర్ పోర్ట్ లో పరీక్షలు చేయడం పౌర విమానయాన శాఖ, కేంద్రం అధీనంలో ఉండటంతో.. తెలంగాణ ప్రభుత్వం వారికి ఓ అభ్యర్థన చేసింది. విదేశాలనుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ విధిగా పరీక్షలు చేయాలని చెప్పింది. అయితే దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
తప్పుడు చిరునామాలతో తిప్పలు..
విదేశాలనుంచి వచ్చేవారిలో చాలామందికి పాస్ పోర్ట్ లో అడ్రస్ అప్ డేట్ కాకపోవడం, కొంతమంది ఉద్దేశ పూర్వకంగానే తప్పుడు మొబైల్ నెంబర్లు, చిరునామాలు ఇవ్వడంతో అధికారులు తిప్పలు పడుతున్నారు. ఒమిక్రాన్ నిర్థారణ అయిన తర్వాత వారి చిరునామాకోసం వెదికితే అక్కడ ఎవరూ కనిపించని పరిస్థితి. ఈలోగా ప్రైమరీ కాంటాక్ట్ లు, సెకండరీ కాంటాక్ట్ లు వెదుక్కోవడం మరో తలనొప్పి. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ సోకినవారిని పట్టుకోవడం, వారిని కలసినవారికి పరీక్షలు చేయడం కష్టంగా మారింది. పరీక్షల సంఖ్య పెంచితే మరిన్ని కేసులు వెలుగులోకి రావొచ్చని చెబుతున్నారు అధికారులు. అయితే ఒమిక్రాన్ సోకినవారిలో ఎవరికీ తీవ్ర స్థాయి అనారోగ్యం లేకపోవడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం. కేసులు బయటపడిన చోట కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు అధికారులు.