యూపీలో నవ్వులపాలవుతున్న సామూహిక వివాహ యోజన
సామూహిక వివాహ యోజన పేరుతో యూపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పెళ్లిళ్ల పథకం నవ్వులపాలవుతోంది. పెళ్లి చేసుకుంటే ప్రభుత్వ ఆర్థిక సాయం వస్తుందని కొంతమంది డూప్లికేట్ పెళ్లి చేసుకుని వెంటనే ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని పంచుకుంటున్నారు. అటు అధికారులు కూడా వీరికి సాయం చేస్తూ అందినంత నొక్కేస్తున్నారు. సీఎం యోగి మానస పుత్రికగా భావించిన ఈ పథకం చివరికిలా నవ్వులపాలైంది. రూ.51వేల కోసం.. ఉత్తర ప్రదేశ్ లో 18 ఏళ్లు […]
సామూహిక వివాహ యోజన పేరుతో యూపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పెళ్లిళ్ల పథకం నవ్వులపాలవుతోంది. పెళ్లి చేసుకుంటే ప్రభుత్వ ఆర్థిక సాయం వస్తుందని కొంతమంది డూప్లికేట్ పెళ్లి చేసుకుని వెంటనే ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని పంచుకుంటున్నారు. అటు అధికారులు కూడా వీరికి సాయం చేస్తూ అందినంత నొక్కేస్తున్నారు. సీఎం యోగి మానస పుత్రికగా భావించిన ఈ పథకం చివరికిలా నవ్వులపాలైంది.
రూ.51వేల కోసం..
ఉత్తర ప్రదేశ్ లో 18 ఏళ్లు నిండిన అమ్మాయి, 21 ఏళ్లు నిండిన అబ్బాయి.. వారి కుటుంబ ఆదాయం 2 లక్షల రూపాయలకు లోబడి ఉంటే.. అలాంటి వారు పెళ్లికి అర్హులు. పెళ్లి ఖర్చులకోసం 6వేల రూపాయలు ఇస్తారు, కొత్త జంటకు 10వేల రూపాయల విలువైన ఇంటి సామాను బహుమతిగా ఇస్తారు. ఇక అమ్మాయి బ్యాంకు ఖాతాలో 35వేల రూపాయల నగదు జమ అవుతుంది. ఇదీ సింపుల్ గా ఈ పథకం వివరాలు. అయితే ఇక్కడే కొంతమంది తప్పుడు ఆలోచనలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుకోసం దొంగ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కేవలం డబ్బులకోసమే పెళ్లి పీటలెక్కుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు అకౌంట్ లో పడగానే చెరిసగం చేసుకుని ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఈ విషయం అధికారులకు కూడా ముందే తెలుసు, ఒకరకంగా వారి సాయంతోటే ఈ తంతు సజావుగా సాగిపోతుంది. ప్రభుత్వం తరపున ఇచ్చే పెళ్లి ఖర్చులు, వస్తువులు.. అధికారులు పంచేసుకుంటారు. క్లుప్తంగా యూపీలో జరుగుతున్న సామూహిక వివాహ యోజన ఇలా సామూహిక మోసంగా మారింది.
అన్న చెల్లెళ్లు, అక్క తమ్ముళ్లు కూడా పెళ్లిపీటలపై..
మరింత దారుణమైన విషయం ఏంటంటే.. డబ్బులకు కక్కుర్తిపడి కొంతమంది అన్న చెల్లెళ్లకు కూడా పెళ్లి చేస్తున్నారు. బయటి వ్యక్తులకు డబ్బులు ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకే కుటుంబంలోని వ్యక్తులు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఆ తంతు ముగిశాక, వచ్చిన డబ్బుల్ని తల్లిదండ్రులు కుటుంబ అవసరాలకోసం వాడుకుంటున్నారు. ఈ వివాహాలు, అసలా, నకిలీయా, పెళ్లి చేసుకుంటున్నవారు ఒకరికొకరు ఏమవుతారు. అనే విషయాలను కూడా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ తప్పు జరుగుతోంది. అధికారుల ప్రోత్సాహం ఉండటం వల్లే ఇలాంటి తప్పులు రిపీట్ అవుతున్నాయి. ఫిరోజాబాద్ లో ఇటీవలే అన్నా చెల్లెళ్లు పెళ్లి చేసుకోవడంపై ఉన్నతస్థాయి అధికారులకు సమాచారం అందడంతో వారు విచారణకు ఆదేశించారు. అప్పటికే యూపీలో అలాంటి పెళ్లిళ్లు 4 చోట్ల జరిగాయని తెలిసింది. ఇక డిసెంబర్ 11వతేదీ 263మంది పెళ్లి చేసుకోగా అందులో 200 వివాహాలు కేవలం డబ్బులకోసం జరిగాయని తేలింది. దీంతో ఈ పథకం అమలుపై ప్రభుత్వం పునరాలోచిస్తోంది.