Telugu Global
National

కూలీలకు పెరిగిన డిమాండ్. ఉద్యోగస్తులకు తగ్గిన అవకాశాలు..

కరోనా తర్వాత ఉద్యోగాలు, ఉపాధి పనుల్లో చాలా మార్పులొచ్చాయి. కార్పొరేట్ కంపెనీలన్నీ ఉద్యోగుల సంఖ్యను సగానికి సగం తగ్గించేశాయి. ఒకవ్యక్తి అందరి పని చేయాలి, ఒక్కరే అన్ని పనులు నేర్చుకోవాలి అనే ఫార్ములాని ప్రవేశ పెట్టాయి యాజమాన్యాలు. ఉన్న ఉద్యోగాలు పోయే క్రమంలో పని ఒత్తిడి పెరిగినా కొంతమంది ఉద్యోగులు సర్దుకుపోతున్నారు. దీంతో అలాంటివారితోనే కంపెనీలు పని చేయించుకుంటున్నాయి. విచిత్రం ఏంటంటే.. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నా ఉద్యోగ అవకాశాలు మాత్రం పెరగడంలేదు. నవంబర్ లో […]

కూలీలకు పెరిగిన డిమాండ్. ఉద్యోగస్తులకు తగ్గిన అవకాశాలు..
X

కరోనా తర్వాత ఉద్యోగాలు, ఉపాధి పనుల్లో చాలా మార్పులొచ్చాయి. కార్పొరేట్ కంపెనీలన్నీ ఉద్యోగుల సంఖ్యను సగానికి సగం తగ్గించేశాయి. ఒకవ్యక్తి అందరి పని చేయాలి, ఒక్కరే అన్ని పనులు నేర్చుకోవాలి అనే ఫార్ములాని ప్రవేశ పెట్టాయి యాజమాన్యాలు. ఉన్న ఉద్యోగాలు పోయే క్రమంలో పని ఒత్తిడి పెరిగినా కొంతమంది ఉద్యోగులు సర్దుకుపోతున్నారు. దీంతో అలాంటివారితోనే కంపెనీలు పని చేయించుకుంటున్నాయి. విచిత్రం ఏంటంటే.. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నా ఉద్యోగ అవకాశాలు మాత్రం పెరగడంలేదు. నవంబర్ లో దేశవ్యాప్తంగా నిరుద్యోగత మరింత పెరగడమే దీనికి ఉదాహరణ.

కూలీలకు ఇబ్బడిముబ్బడిగా పనులు..
కరోనా కష్టకాలంలో ముఖ్యంగా వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాక్ డౌన్ కాలంలో సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రాణాలకు సైతం తెగించారు. అలాంటివారిలో చాలామంది లాక్ డౌన్ తర్వాత తిరిగి పనులకు వెళ్లేందుకు ఇష్టపడటంలేదు. దీంతో స్థానికంగా ఉండేవారికి అవకాశాలు పెరిగాయి. 1.12 కోట్ల మంది రోజువారీ కూలీలకు అదనంగా పని లభించింది. వీరిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, రోడ్డుపక్కన ఉండే వర్తకులు, ఇతర పనులు చేసుకునేవారు కూడా ఉన్నారు. అదే సమయంలో 68లక్షలమంది ఉద్యోగాలు వదిలేశారు. కొన్నిచోట్ల కంపెనీలు మూతబడి అందరు ఉద్యోగులు ఇబ్బందిపడగా, మరికొన్నిచోట్ల కొంతమందికి ఉద్వాసన తప్పలేదు. విద్యారంగంలో దాదాపుగా సగానికి సగం స్టాఫ్ తగ్గిపోయింది. అయితే వారిలో చాలామంది ఆన్ లైన్ బోధనవైపు మొగ్గు చూపడంతో ఉద్యోగం పోయినా ఉపాధి మిగిలింది.

పట్టణ ప్రాంతాల్లో అక్టోబర్ నెలలో నిరుద్యోగిత 9.3 శాతంగా ఉండగా, నవంబర్లో అది 10.5 శాతానికి ఎగబాకింది. గ్రామీణ ప్రాంతాల్లో అక్టోబర్ లో 11.9 శాతం నిరుద్యోగిత ఉండగా.. నవంబర్ నాటికి 10.6కి తగ్గింది. అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికంటే.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికే ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. కరోనా కాలంలో ప్రైవేటు ఉద్యోగాలనేవి గాల్లో దీపాలనే విషయం మరోసారి పక్కాగా రుజువైంది. దీంతో చాలామంది శాశ్వత ఉపాధి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎక్కడో దూరంగా ఉద్యోగాలు చేసుకోవడం కంటే.. కుటుంబానికి దగ్గరగా ఉంటూ స్వయం ఉపాధి పనులు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

First Published:  15 Dec 2021 2:42 AM IST
Next Story