Telugu Global
Cinema & Entertainment

లక్ష్య మూవీ రివ్యూ

నటీనటులు: నాగశౌర్య, కేతిక‌శ‌ర్మ, జగపతి బాబు, సచిన్ ఖేడెకర్, శత్రు, సత్య , కిరీటి తదితరులు. సినిమాటోగ్రాఫర్‌ : రామ్‌రెడ్డి సంగీతం: కాల‌బైర‌వ‌ ఎడిటింగ్: జునైద్‌ నిర్మాత‌లు : నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం : సంతోష్‌ జాగర్లపూడి విడుదల తేది : 10 డిసెంబర్ 2021 రేటింగ్ : 2/5 కథ నిడివి రెండున్నర గంటలు ఉంటుంది. కానీ అందులో కొత్త పాయింట్ ఒక్కటే ఉంటుంది. […]

లక్ష్య మూవీ రివ్యూ
X

నటీనటులు: నాగశౌర్య, కేతిక‌శ‌ర్మ, జగపతి బాబు, సచిన్ ఖేడెకర్, శత్రు, సత్య , కిరీటి తదితరులు.
సినిమాటోగ్రాఫర్‌ : రామ్‌రెడ్డి
సంగీతం: కాల‌బైర‌వ‌
ఎడిటింగ్: జునైద్‌
నిర్మాత‌లు : నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్
కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం : సంతోష్‌ జాగర్లపూడి
విడుదల తేది : 10 డిసెంబర్ 2021
రేటింగ్ : 2/5

కథ నిడివి రెండున్నర గంటలు ఉంటుంది. కానీ అందులో కొత్త పాయింట్ ఒక్కటే ఉంటుంది. ఆ పాయింట్ పై నమ్మకంతో కోట్లు పెట్టి సినిమా తీస్తారు. ప్రేక్షకులు కూడా ఆ పాయింట్ తో కనెక్ట్ అయితే సినిమా హిట్టవుతుంది. లేదంటే నిరాశపరుస్తుంది. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈరోజు లక్ష్య సినిమా వచ్చింది. నిడివి 2 గంటల 20 నిమిషాలుంది. కానీ అందులో కొత్త పాయింట్ నిమిషం కూడా లేదు. ఇలాంటి పాయింట్ లెస్ సినిమా కోసం ఎంతో శ్రమించి సిక్స్ ప్యాక్ సాధించాడు శౌర్య. నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టారు.

ఆర్చరీ (విలువిద్య)లో కొడుకు సాధించలేకపోయిన విజయాన్ని మనవడు పార్థు (నాగశౌర్య) ద్వారా ఎలాగైనా సాధించాలనుకుంటాడు రఘు రామయ్య(సచిన్ ఖేడెకర్). దీని కోసం తన డబ్బు, ఆరోగ్యాన్ని సైతం ఫణంగా పెడతాడు. మనవడు కూడా మెరుగ్గా రాణిస్తాడు. తాతను సంతోష పెడతాడు. అయితే అనుకోకుండా తాత చనిపోతాడు. మనవడు డిస్టర్బ్ అవుతాడు. మందుకు అలవాటు పడతాడు. స్నేహితుడు రాజేష్ (కిరీటి) చెప్పిన మాటలు విని డ్రగ్స్ కు బానిసవుతాడు. అదే క్రమంలో ఆర్చరీలో తన ప్రత్యర్థి రాహుల్ (శత్రు) చేతిలో దెబ్బతిని కుడిచేయి మణికట్టు పోగొట్టుకుంటాడు. ఇలా వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా పూర్తిగా పాతాళంలో పడిపోయిన పార్థు.. తిరిగి ఎలా తన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్నాడు, పోటీల్లో ఎలా విజేతగా నిలిచాడనేది స్టోరీ.

పేరుకి ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అయినప్పటికీ, ఓ వ్యక్తి జీవితాన్ని ఆవిష్కరించిన సినిమా ఇది. అర్జున్ రెడ్డి టైపులో హీరో లైఫ్ లోని ఉత్థానపతనాల్ని చూపించిన సినిమా ఇది. ఇందులో హీరో నాగశౌర్యకు కొత్త పాయింట్ ఏం కనిపించిందో అర్థం కావడం లేదు. దీని కోసం అతడు సిక్స్ ప్యాక్ సాధించేలా ఎందుకు కష్టపడ్డాడో అస్సలు అర్థం కావడం లేదు. అసలు సమస్యంతా ఈ సినిమా స్క్రీన్ ప్లేతోనే వచ్చింది.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వచ్చే సినిమాలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. హీరో క్రీడల్లో రాణించడం, దాని కోసం కష్టపడడం లాంటి అంశాల్నే చూపిస్తారు. క్రికెట్, ఫుట్ బాల్, కబడ్డీ, బాక్సింగ్.. ఇలా గేమ్ మారినా అందులో ఎమోషన్, హీరో ప్రిపరేషన్ మారదు. లక్ష్యలో కూడా ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో ఇవన్నీ చూపించారు. కానీ ఎమోషన్ ను పండించలేకపోయారు. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి రాసుకున్న స్క్రీన్ ప్లే చాలా పేలవంగా ఉంది. అతడు రాసుకున్న సన్నివేశాలు బలహీనంగా ఉన్నాయి. అందుకే లక్ష్య సినిమా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది.

సినిమా ప్రారంభమైన అరగంటకే దర్శకుడి ఫెయిల్యూర్ కనిపిస్తుంది. సన్నివేశాలు పేర్చుకుంటూ వెళ్లిపోయాడు. ఓ విలుకాడి కలను, ఆ కల చెదిరిపోయే పరిస్థితుల్ని చెప్పడానికి ఫస్టాఫ్ ను వాడుకున్న దర్శకుడు, ద్వితీయార్థంలో పూర్తిగా చేతులెత్తేశాడు. క్లైమాక్స్ మినహా ఇంకేదీ ఆకట్టుకోదు. దీనికితోడు సెకండాఫ్ లో జగపతిబాబును తీసుకొచ్చి, అతడిపై, శౌర్యపై సినిమాను నడిపించడం అస్సలు బాగా లేదు.

కథ, కథనం తేలిపోయిన ఈ సినిమా కోసం నాగశౌర్య చాలా కష్టపడ్డాడు. పాత్రకు ఎంత కావాలో అంతకంటే ఎక్కువే ఇచ్చాడు. హీరోయిన్ కేతిక శర్మ అందాలు కూడా వృధా అయ్యాయి. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, శత్రు, కిరీటీ తమ పాత్రలకు న్యాయం చేశారు. కాలభైరవ అందించిన పాటల కంటే నేపథ్యసంగీతం బాగుంది. నిర్మాతలు నారాయణ్ దాస్, శరత్ మరార్ చాలా ఖర్చు చేశారు.

ఓవరాల్ గా లక్ష్య సినిమా తన టార్గెట్ ను అందుకోలేకపోయింది. 2 నెలల గ్యాప్ లో వరుసగా రెండోసారి నాగశౌర్య నిరాశపరిచాడు.

First Published:  10 Dec 2021 3:18 PM IST
Next Story