ఎడాపెడా సిమ్ కార్డ్ లు తీసుకోవడం ఇక కుదరదు..
భారత్ లో మొబైైల్ కనెక్షన్ల సంఖ్యకు, మొబైల్ వినియోగదారుల సంఖ్యకు చాలా తేడా ఉంటుంది. ఈ ఏడాది జనవరి నాటికి 139 కోట్ల జనాభాకు 110 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే అధికారికంగా చాలామంది రెండు లేదా మూడు కనెక్షన్లు వాడుతుంటారు. అవసరం ఉన్నా లేకపోయినా సిమ్ కార్డులు ఎడా పెడా తీసుకునేవారి సంఖ్య కూడా ఎక్కువే. స్నేహితుల కోసం, కుటుంబ సభ్యులు, బంధువులకోసం తమపేరుపై సిమ్ కార్డులు తీసుకునేవారు కూడా ఉంటారు. ఇకపై ఇలా […]
భారత్ లో మొబైైల్ కనెక్షన్ల సంఖ్యకు, మొబైల్ వినియోగదారుల సంఖ్యకు చాలా తేడా ఉంటుంది. ఈ ఏడాది జనవరి నాటికి 139 కోట్ల జనాభాకు 110 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే అధికారికంగా చాలామంది రెండు లేదా మూడు కనెక్షన్లు వాడుతుంటారు. అవసరం ఉన్నా లేకపోయినా సిమ్ కార్డులు ఎడా పెడా తీసుకునేవారి సంఖ్య కూడా ఎక్కువే. స్నేహితుల కోసం, కుటుంబ సభ్యులు, బంధువులకోసం తమపేరుపై సిమ్ కార్డులు తీసుకునేవారు కూడా ఉంటారు. ఇకపై ఇలా ఎడాపెడా సిమ్ కార్డులు తీసుకోవడం కుదరదు. ఒక వ్యక్తి పేరుతో గరిష్టంగా 9 మొబైల్ కనెక్షన్లు మాత్రమే ఉండాలని టెలికం శాఖ కొత్త నిబంధన తెరపైకి తెచ్చింది. అంతకు మించి సిమ్ కార్డులు తీసుకోవాలంటే మరోసారి ఆయా కార్డులను ధృవీకరించాల్సి ఉంటుందని ఆపరేటర్లకు స్పష్టం చేసింది.
ఈశాన్య రాష్ట్రాలకు కేవలం 6 మాత్రమే..
భారత్ లో ఒక వ్యక్తి గరిష్టంగా తన పేరుతో 9 సిమ్ కార్డులు కలిగి ఉండొచ్చు. అదే ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం వాటి సంఖ్యను 6కి పరిమితం చేశారు. కొత్తగా సిమ్ కార్డ్ తీసుకోడానికి వెళ్లేవారికి ఇకపై ఈ తరహా చెకింగ్ ఉంటుంది. గతంలో వారి పేరుమీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయనేది లెక్క తీస్తారు. 9కంటే ఎక్కువగా ఉంటే మాత్రం వాటిలో వేటిని కొనసాగించాలో నిర్ణయించుకునేందుకు 30రోజులు సమయం ఇస్తారు. ఆలోగా వినియోగదారుడు నిర్ణయం తీసుకోకపోతే, కనెక్షన్లు తీసుకున్న తేదీని బట్టి.. 9 కంటే ఎక్కువగా ఉన్న కొత్త వాటిని డీయాక్టివేట్ చేస్తారు. 45రోజుల్లోగా వాటిని పూర్తిగా తొలగిస్తారు.
ఎందుకిలా..?
ఎడా పెడా సిమ్ కార్డులు తీసుకోవడం, ఒకరిపేరుతో మరొకరు కార్డులు తీసుకోవడం, ఐడీ ప్రూఫ్ లు లేకపోయినా అపరిచితులకు సిమ్ కార్డులు ఇవ్వడం ఎక్కువగా జరుగుతోంది. ఆన్ లైన్ నేరాలకు కూడా ఇలాంటి మొబైల్ కనెక్షన్లను వాడుకుంటున్నారు మోసగాళ్లు. అనామకుల పేర్లతో సిమ్ కార్డులు తీసుకుని మోసగాళ్లు తెలివిగా తప్పించుకుంటన్నారు. చివరకు పోలీస్ ఎంక్వయిరీలో మాత్రం అమాయకులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో టెలికం శాఖ ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అయితే 9 సిమ్ కార్డుల ప్రతిపాదన కూడా మరీ ఎక్కువ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక వ్యక్తికి రెండు లేదా మూడు సిమ్ లు మాత్రమే తీసుకునే అవకాశం ఇవ్వాలని, మొబైల్ పోర్టబిలిటీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. గరిష్టంగా 9 సిమ్ కార్డ్ ల ప్రతిపాదన సరికాదని అంటున్నారు కొంతమంది. టెలికం శాఖ మాత్రం ప్రస్తుతానికి 9 సిమ్ కార్డ్ ల నిబంధనను తెరపైకి తెచ్చింది. దీన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆపరేటర్లకు ఆదేశాలిచ్చింది.