Telugu Global
National

అత్యున్నత స్థాయి హెలికాప్టర్లే.. అయినా..?

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సైనిక ర్యాంకుల్లోనే అత్యున్నత స్థాయి వ్యక్తి, అత్యున్నత ప్రమాణాలు కలిగిన హెలికాప్టర్లో ప్రయాణించినా ఆయన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అదే సమయంలో భారత సైన్యం అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా ఉన్న MI రకం హెలికాప్టర్ల భద్రతపై కూడా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రెండు ఇంజిన్లు ఉన్న రష్యన్‌ తయారీ MI-17V5 హెలికాప్టర్‌ ను […]

అత్యున్నత స్థాయి హెలికాప్టర్లే.. అయినా..?
X

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సైనిక ర్యాంకుల్లోనే అత్యున్నత స్థాయి వ్యక్తి, అత్యున్నత ప్రమాణాలు కలిగిన హెలికాప్టర్లో ప్రయాణించినా ఆయన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అదే సమయంలో భారత సైన్యం అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా ఉన్న MI రకం హెలికాప్టర్ల భద్రతపై కూడా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

రెండు ఇంజిన్లు ఉన్న రష్యన్‌ తయారీ MI-17V5 హెలికాప్టర్‌ ను ఎంతో సురక్షితమైనదిగా భావిస్తారు. 15 నుంచి 20మంది సైనికులు ఇందులో సురక్షితంగా ప్రయాణించడానికి వీలుంటుంది. సీడీఎస్‌ ప్రయాణిస్తున్న నేపథ్యంలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకొనే ఉంటారు. అందులోనూ కోయంబత్తూరు నుంచి కున్నూర్‌ చాలా దగ్గర. అంత దగ్గర దూరంలో, ఘోర ప్రమాదం జరగడంతో సైనిక అధికారులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి ప్రధాన కారణం పొగమంచు అని చెబుతున్నారు. ప్రమాద సమయంలో మొత్తం 14మంది హెలికాప్టర్లో ఉండగా.. కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

MI-17V5 హెలికాప్టర్‌ ను సైనికులతోపాటు యుద్ధ సామగ్రిని చేరవేసేందుకు ఉపయోగిస్తుంటారు. సైనికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఈ హెలికాప్ట‌ర్ల‌లో ఆధునిక టెక్నాల‌జీని అప్డేట్ చేస్తుంటారు. టెక్నిక‌ల్‌ గా అత్యున్న‌త శ్రేణికి చెందిన హెలికాప్ట‌ర్లే అయినా తరచూ ప్ర‌మాదాలు జరగడం గమనార్హం. 2010 నుంచి 2021 వ‌ర‌కు MI హెలికాప్ట‌ర్లు అనేక‌సార్లు ప్ర‌మాదాల‌కు గుర‌య్యాయి. ఈ ప్ర‌మాదాల వ‌ల‌న 41 మంది సైనికులు మృతి చెందారు.

2010 న‌వంబ‌ర్ 19 వ తేదీన త‌వాంగ్ నుంచి గౌహ‌తి వెళ్తున్న MI హెలికాప్ట‌ర్ మ‌ధ్య‌లో కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో 12 మంది సైనికులు మృతి చెందారు. 2012 ఆగ‌స్ట్ 30 వ తేదీన గుజ‌రాత్ ఎయిర్‌బేస్ నుంచి బ‌య‌లుదేరిన హెలికాప్ట‌ర్ కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో 9 మంది మృతి చెందారు. 2013 జూన్ 25 న కేదారనాథ్ వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న వారి స‌హాయ‌క చర్య‌ల్లో పాల్గొనేందుకు వెళ్లిన హెలికాప్ట‌ర్ గౌరీకుండ్ వ‌ద్ద ప్ర‌మాదానికి గురవడంతో 8 మందికి గాయాల‌య్యాయి. 2017 అక్టోబ‌ర్ 6 వ తేదీన అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ లోని త‌వాంగ్‌ లో ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ అడ‌వుల్లో కూలిపోయింది. ఏడుగురు మృత్యువాత పడ్డారు. తాజాగా తమిళనాడులోని కూనూరు వద్ద జరిగిన ప్రమాదంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య.. సహా మొత్తం 13మంది చనిపోయారు.

First Published:  9 Dec 2021 2:02 AM IST
Next Story