Telugu Global
Business

స్కాన్ చెయ్.. పే చెయ్.. ఏడాదిలో మూడు రెట్లు పెరిగిన డిజిటల్ పేమెంట్స్..

చిల్లర కష్టాలు పూర్తిగా తప్పాయి, రేపు, మాపు అని తప్పించుకునే మాటలు కూడా ఇప్పుడు వినపడ్డంలేదు. పర్స్ మర్చిపోయినా, మొబైల్ ఉంటే చాలు ఎంచక్కా ఎక్కడైనా ఏవైనా కొనుక్కుని ఇంటికెళ్లొచ్చు. పల్లెటూళ్లలో కూడా ఇప్పుడు ఫోన్ ద్వారా చేసే డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగిపోయాయి. ఎంతలా అంటే.. ఏడాదిలోనే ఏకంగా మూడింతలయ్యేలా. అవును.. భారత్ లో డిజిటల్ పేమెంట్స్ కేవలం ఏడాది కాలంలోనే మూడు రెట్లు పెరిగాయి. సంఖ్యా పరంగా చూసుకున్నా, విలువ ఆధారంగా లెక్కేసినా డిజిటల్ […]

స్కాన్ చెయ్.. పే చెయ్.. ఏడాదిలో మూడు రెట్లు పెరిగిన డిజిటల్ పేమెంట్స్..
X

చిల్లర కష్టాలు పూర్తిగా తప్పాయి, రేపు, మాపు అని తప్పించుకునే మాటలు కూడా ఇప్పుడు వినపడ్డంలేదు. పర్స్ మర్చిపోయినా, మొబైల్ ఉంటే చాలు ఎంచక్కా ఎక్కడైనా ఏవైనా కొనుక్కుని ఇంటికెళ్లొచ్చు. పల్లెటూళ్లలో కూడా ఇప్పుడు ఫోన్ ద్వారా చేసే డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగిపోయాయి. ఎంతలా అంటే.. ఏడాదిలోనే ఏకంగా మూడింతలయ్యేలా. అవును.. భారత్ లో డిజిటల్ పేమెంట్స్ కేవలం ఏడాది కాలంలోనే మూడు రెట్లు పెరిగాయి. సంఖ్యా పరంగా చూసుకున్నా, విలువ ఆధారంగా లెక్కేసినా డిజిటల్ పేమెంట్స్ గతంలో కంటే మూడింతలయ్యాయి.

గతేడాది భారత్ లో 112కోట్ల డిజిటల్ పేమెంట్స్ జరగగా.. ఈ ఏడాది అవి ఏకంగా 370కోట్లకు చేరుకున్నాయి. గతేడాది జరిగిన డిజిటల్ పేమెంట్స్ విలువ 3.6లక్షల కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది 11.4 లక్షల కోట్లకు ఆ విలువ పెరిగింది. భారత్ లో జరిగే ప్రతి 100 లావాదేవీల్లో 20 మొబైల్ ద్వారా జరుగుతున్నాయి.

క్యూఆర్ కోడ్ ఉంటే చాలు..
చిన్నదైనా పెద్దదైనా అసలు వ్యాపారం ఏదయినా క్యూఆర్ కోడ్ ఇప్పుడు తప్పనిసరిగా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది బిచ్చగాళ్లు కూడా క్యూఆర్ కోడ్ స్కానర్లను మెయింటెన్ చేసే వైరల్ వీడియోలు చూస్తున్నాం. సంక్రాంతికి ఇంటిముందుకి వచ్చే డూడూ బసవన్న మెడలో కూడా ఓ క్యూఆర్ కోడ్ స్కానర్ తగిలించేస్తున్నారు గంగిరెద్దులవాళ్లు. అంటే భారత్ లో ఈ డిజిటల్ విప్లవం ఎక్కడి వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. భారత్ క్యూఆర్ మర్చంట్ టచ్ పాయింట్స్ 52లక్షలు ఉండగా, యూపీఐ క్యూఆర్ టచ్ పాయింట్స్ 11.9కోట్లు కావడం గమనార్హం. గతేడాదితో పోల్చి చూస్తే సగటున వందశాతం ఈ టచ్ పాయింట్స్ పెరిగాయి.

అమెరికా కూడా భారత్ తర్వాతే..
మొబైల్ ఫోన్ ద్వారా చేసే డిజిటల్ పేమెంట్స్ లో భారత్.. అమెరికాకంటే ముందుండటం గమనార్హం. అమెరికాలో సగటున 17.7 శాతం డిజిటల్ పేమెంట్స్ జరిగితే, భారత్ లో అవి 20.2 శాతం గా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ పేమెంట్స్ అధికంగా జరిగే దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా నిలవగా, రెండో స్థానంలో దక్షిణ కొరియా ఉంది.

First Published:  7 Dec 2021 2:58 AM IST
Next Story