పార్టీ పన్నీర్ కు, అసెంబ్లీ పెత్తనం పళనికి.. శశికళకు బిగ్ షాక్
అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికల సందర్భంగా చీలికలు తేవాలని, తన వర్గాన్ని బలపరచుకోవాలని శశికళ కొన్నాళ్లుగా వ్యూహాలు రచిస్తున్నారు. పన్నీర్ సెల్వం, పళని స్వామి మధ్య కూడా చిచ్చుపెట్టాలని చూశారు. ఓ దశలో పన్నీర్ సెల్వం.. శశికళ చేరికపై నర్మగర్భ వ్యాఖ్యలు చేయడంతో ఆమె రీఎంట్రీపై కొంతమంది అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరికి మాజీ ముఖ్యమంత్రులిద్దరూ ఒక్కటయ్యారు. పార్టీపై పెత్తనం పన్నీర్ సెల్వంకు అప్పగిస్తూ పళనిస్వామి త్యాగం చేయడంతో రాజీ కుదిరింది. దీంతో శశికళ పాచిక పారలేదనే […]
అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికల సందర్భంగా చీలికలు తేవాలని, తన వర్గాన్ని బలపరచుకోవాలని శశికళ కొన్నాళ్లుగా వ్యూహాలు రచిస్తున్నారు. పన్నీర్ సెల్వం, పళని స్వామి మధ్య కూడా చిచ్చుపెట్టాలని చూశారు. ఓ దశలో పన్నీర్ సెల్వం.. శశికళ చేరికపై నర్మగర్భ వ్యాఖ్యలు చేయడంతో ఆమె రీఎంట్రీపై కొంతమంది అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరికి మాజీ ముఖ్యమంత్రులిద్దరూ ఒక్కటయ్యారు. పార్టీపై పెత్తనం పన్నీర్ సెల్వంకు అప్పగిస్తూ పళనిస్వామి త్యాగం చేయడంతో రాజీ కుదిరింది. దీంతో శశికళ పాచిక పారలేదనే చెప్పాలి.
అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికల్లో పన్నీర్ సెల్వం పార్టీ సమన్వయకర్తగా, పళని స్వామి ఉప సమన్వయకర్తగా ఎన్నికయ్యారు. ఈ పదవులకు సంబంధించి ఇతరులెవరూ దరఖాస్తు చేయకపోవడంతో వారిద్దరూ ఏకగ్రీవం అయ్యారు. వాస్తవానికి తాజా మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. పార్టీపై కూడా తనకే పెత్తనం ఉండాలనేది ఆయన ఆశ. అయితే పన్నీర్ సెల్వం వర్గం మాత్రం పార్టీ పెత్తనం తమకే దక్కాలని కోరుకుంది. ఓ దశలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదురుతుందని, దీన్ని అవకాశంగా చేసుకుని పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వాలని శశికళ భావించారు. కానీ ఆమె ఆశలపై నీళ్లు చల్లుతూ మాజీ ముఖ్యమంత్రులిద్దరూ ఒకటయ్యారు. పార్టీని, అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానాన్ని పంచుకున్నారు.
పార్టీ సమన్వయకర్త పదవికోసం శశికళ బ్యాచ్ కి చెందిన కొందరు నామినేషన్లు వేయడానికి ప్రయత్నించగా వారిని పన్నీర్, పళని వర్గం అడ్డుకుంది. వారిపై దాడి చేసి మరీ దరఖాస్తుల్ని చించివేసి బయటకు పంపించేశారు. దీంతో అన్నాడీఎంకేకు పన్నీర్ సమన్వయకర్తగా, పళని ఉప సమన్వయకర్తగా ఏకగ్రీవం అయ్యారు.
శశికళ దారెటు..?
పార్టీ సంస్థాగత ఎన్నికల్లో నియమ నిబంధనలు మార్చేశారని, దీనిపై న్యాయపోరాటం చేస్తానంటున్నారు శశికళ. అసలు శశికళకు, తమ పార్టీకి సంబంధం లేదని, ఆమెను ఎప్పుడో బహిష్కరించేశామని, అది ముగిసిన అధ్యాయమని అంటున్నారు అన్నాడీఎంకే నేతలు. ఈ దశలో శశికళ ఇంకా అన్నాడీఎంకేలో రీఎంట్రీకోసం ఆశపడతారా..? లేక బీజేపీవైపు చూస్తారా అనేది తేలాల్సి ఉంది.