Telugu Global
National

రైళ్లలో రాయితీలు లేవు, రావు.. కేంద్రం క్లారిటీ..

వృద్ధులు, వికలాంగులు, విలేకరులు.. ఇలా రైళ్లలో భారత ప్రభుత్వం 54 కేటగిరీల ప్రయాణికులకు రాయితీలు ఇచ్చేది. అయితే అదంతా గతం. ఇప్పుడా పరిస్థితి లేదు. కరోనా సాకుతో స్పెషల్ ట్రైన్లు అనే పేరుతో నిన్న మొన్నటి వరకు వీరబాదుడు బాదింది రైల్వే శాఖ. ఇటీవలే ఆ అదనపు చార్జీలను ఆపేసింది. అయితే ఇప్పుడిక రాయితీలకు కూడా కాలం చెల్లిందని ప్రకటించారు మంత్రి అశ్వినీ వైష్ణవ్. భారతీయ రైళ్లలో ఇకపై ఎవరికీ రాయితీలు ఇవ్వబోమని, ఎవ్వరికైనా టికెట్ రేటు […]

రైళ్లలో రాయితీలు లేవు, రావు.. కేంద్రం క్లారిటీ..
X

వృద్ధులు, వికలాంగులు, విలేకరులు.. ఇలా రైళ్లలో భారత ప్రభుత్వం 54 కేటగిరీల ప్రయాణికులకు రాయితీలు ఇచ్చేది. అయితే అదంతా గతం. ఇప్పుడా పరిస్థితి లేదు. కరోనా సాకుతో స్పెషల్ ట్రైన్లు అనే పేరుతో నిన్న మొన్నటి వరకు వీరబాదుడు బాదింది రైల్వే శాఖ. ఇటీవలే ఆ అదనపు చార్జీలను ఆపేసింది. అయితే ఇప్పుడిక రాయితీలకు కూడా కాలం చెల్లిందని ప్రకటించారు మంత్రి అశ్వినీ వైష్ణవ్. భారతీయ రైళ్లలో ఇకపై ఎవరికీ రాయితీలు ఇవ్వబోమని, ఎవ్వరికైనా టికెట్ రేటు ఒకటేనని ప్రకటించారాయన.

కరోనాతో 36వేల కోట్లు నష్టం..
కరోనా సమయంలో రైల్వే తీవ్ర నష్టాలను ఎదుర్కొంది. దాదాపు 36వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వ అంచనా. ప్యాసింజర్ రైళ్లతోపాటు, గూడ్స్ రైళ్లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో.. తీవ్ర నష్టం ఎదురైందని అధికారులు చెబుతున్నారు. లాక్ డౌన్ తర్వాత గూడ్స్ రైళ్ల ద్వారా నష్టాన్ని భర్తీ చేసుకోగలిగినా.. మొత్తమ్మీద కరోనా వల్ల రైల్వే తీవ్ర ప్రభావానికి లోనైందని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు రాయితీలకు కోత పెట్టామంటున్నారు.

పర్యాటకంపై దృష్టి..
కరోనా తర్వాత పర్యాటకరంగంపై రైల్వే దృష్టిపెట్టింది. బస్సుల్లాగే, రైళ్లలో కూడా టూర్ ప్యాకేజీలు ఏర్పాటు చేసింది. పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పర్యాటక ప్రాంతాలకు కూడా రైళ్లను సిద్ధం చేస్తోంది. ప్రైవేటు భాగస్వామ్యంతో నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రాయితీలకు మంగళంపాడేసింది ప్రభుత్వం. వివిధ వర్గాలనుంచి వస్తున్న అభ్యర్థనలను పరిశీలిస్తున్నట్టు ప్రకటించినా.. రాయితీల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందనే విషయం అర్థమవుతోంది. ప్రస్తుతానికి ప్రయాణ చార్జీలను పాత రేట్లకే తీసుకొచ్చినా.. త్వరలో నష్టాలను చూపెట్టి చార్జీల మోత మోగించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. పెరిగిన ధరలన్నిటికీ కరోనాని సాకుగా చెబుతున్న కేంద్రం.. రైల్వే చార్జీలకు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తుందనడంలో అనుమానం లేదు.

First Published:  4 Dec 2021 3:39 AM IST
Next Story