ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత..
సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. హైదరాబాద్ లోని ఇంటిలో ఉండగా.. ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను దగ్గర్లోని స్టార్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి తరలించేలోపే ఆయన చనిపోయినట్టు తెలుస్తోంది. ఆస్పత్రి వర్గాలు ఆయన మరణాన్ని ధృవీకరించడంతో కుటుంబ సభ్యులు పార్థివ దేహాన్ని తిరిగి ఇంటికి తెచ్చారు. వయోభారంతోపాటు ఆయనకు ఇటీవల కొన్ని […]
సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. హైదరాబాద్ లోని ఇంటిలో ఉండగా.. ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను దగ్గర్లోని స్టార్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి తరలించేలోపే ఆయన చనిపోయినట్టు తెలుస్తోంది. ఆస్పత్రి వర్గాలు ఆయన మరణాన్ని ధృవీకరించడంతో కుటుంబ సభ్యులు పార్థివ దేహాన్ని తిరిగి ఇంటికి తెచ్చారు. వయోభారంతోపాటు ఆయనకు ఇటీవల కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు రావడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తమిళనాడు గవర్నర్ గా పదవీకాలం ముగిసిన తర్వాత పూర్తిగా మీడియాకు కూడా దూరమయ్యారాయన.
1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరులో రోశయ్య జన్మించారు. 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికయ్యారు. 1974, 1980లో మరో రెండుసార్లు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్ అండ్ బీ, రవాణా శాఖ మంత్రిగా సేవలు అందించారు. టి. అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం అనంతరం.. 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు చేపట్టి.. 2016 ఆగస్టు 30 వరకూ సేవలు అందించారు.
రోశయ్యకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నా కూడా ఆయన వారసులెవరూ రాజకీయాల్లో లేకపోవడం విశేషం. వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నా రోశయ్య.. స్వతంత్ర పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా, కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆయన మరో పార్టీవైపు చూడలేదు. చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.