సూర్య, జ్యోతిక దంపతుల పై పరువు నష్టం దావా..!
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. సాక్షాత్తు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారు. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను స్వయంగా సూర్య దంపతులు నిర్మించారు. కాగా ఈ సినిమా విడుదల అయినప్పటినుంచి వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. ముందుగా ఈ సినిమాలో హిందీ భాషను కించపరిచారంటూ విమర్శలు రాగా, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు వన్నియర్ […]
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. సాక్షాత్తు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారు. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను స్వయంగా సూర్య దంపతులు నిర్మించారు. కాగా ఈ సినిమా విడుదల అయినప్పటినుంచి వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి.
ముందుగా ఈ సినిమాలో హిందీ భాషను కించపరిచారంటూ విమర్శలు రాగా, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు వన్నియర్ కులస్తులకు వ్యతిరేకంగా చూపారని ఆ కుల సంఘం నాయకులు మండిపడ్డారు. తమిళనాడులో ప్రముఖ పార్టీ అయిన పీఎంకే సూర్యను కొట్టిన వారికి లక్ష రూపాయల బహుమానం అందిస్తామని ప్రకటించడం కూడా సంచలనంగా మారింది.
కాగా తాజాగా హీరో సూర్య, దర్శకుడు జ్ఞానవేల్, నిర్మాతల్లో ఒకరైన సూర్య సతీమణి జ్యోతికపై వన్నియర్ కుల సంఘం అధ్యక్షుడు అరుల్ మొళి కడలూరు జిల్లా చిదంబరం కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు. తప్పుడు సమాచారం చేయడం, ఇరువర్గాల మధ్య ఘర్షణలు రెచ్చగొట్టడం, ప్రజా శాంతికి విఘాతం కలిగించడం వంటి వాటిని ప్రధానంగా ప్రస్తావిస్తూ అరుల్ మొళి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు. దీనిపై త్వరలోనే విచారణ కూడా జరగనుంది. కాగా హీరో సూర్య కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్న వారికి ఆయన ఫ్యాన్స్ గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సూర్యకు మద్దతు తెలుపుతున్నారు.