ఏపీ మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ.. త్వరలో సమగ్రంగా కొత్త బిల్లు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకుంది. రాజధాని కేసుల న్యాయవిచారణలో భాగంగా మూడు రాజధానుల బిల్లుని ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్టు ఏపీ అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకి తెలిపిన కొద్ది సేపటికే.. ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణతోపాటు, సీఆర్డీఏ బిల్లు రద్దు చేసేలా తీసుకున్న నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకుంటున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. అయితే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లు త్వరలోనే […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకుంది. రాజధాని కేసుల న్యాయవిచారణలో భాగంగా మూడు రాజధానుల బిల్లుని ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్టు ఏపీ అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకి తెలిపిన కొద్ది సేపటికే.. ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణతోపాటు, సీఆర్డీఏ బిల్లు రద్దు చేసేలా తీసుకున్న నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకుంటున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. అయితే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లు త్వరలోనే సభ ముందుకు వస్తుందని వివరించారు.
మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కు తగ్గిందని, కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్టే, రాష్ట్రం మూడు రాజధానుల బిల్లుని కూడా రద్దు చేస్తుందని ఉదయం నుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అంతలోనే మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఇది ఇంటర్వెల్ మాత్రమే, శుభం కార్డు కాదని స్పష్టం చేశారు. దీంతో అందరిలో మరో అనుమానం మొదలైంది. తాజాగా ప్రభుత్వం వెనక్కు తగ్గలేదని సీఎం జగన్ మాటల్లో స్పష్టమైంది. ఇప్పుడు మూడు రాజధానుల బిల్లుని ప్రభుత్వం వెనక్కు తీసుకుంటున్నట్టు తెలిపినా, తిరిగి సమగ్రమైన బిల్లుని సభ ముందు ప్రవేశ పెడతామని జగన్ స్పష్టం చేశారు.
రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, ఇతర మౌలిక వసతులకోసమే దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు అమరావతికోసం ఖర్చు పెట్టేందుకు గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖలో ఇంతకంటే తక్కువ ఖర్చుతో రాజధాని ఏర్పాటు చేసుకోగలమని అందుకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని, అభివృద్ధి వికేంద్రీకరణకు మొగ్గు చూపామని అసెంబ్లీలో తెలిపారు సీఎం జగన్. గతంలో ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉన్న కర్నూలుకి కూడా న్యాయం చేసేందుకే న్యాయరాజధానిని అక్కడ పెట్టాలనుకున్నామని చెప్పారు. అదే సమయంలో అమరావతి అంటే తనకు ద్వేషం లేదని, తన ఇల్లు కూడా ఇక్కడే ఉందని గుర్తు చేశారు. అమరావతి రాజధాని ప్రాంతం అటు విజయవాడకు, ఇటు గుంటూరుకి కూడా దూరంగా ఉంటుందని చెప్పారు జగన్. వికేంద్రకరణ సంబంధించి అనేక అపోహలు, అనుమానాలు, కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు, దుష్ప్రచారాలు చేశారని, వాటన్నిటికీ సమాధానంగా సమగ్రమైన బిల్లు తెస్తామని అన్నారు జగన్. మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని వివరించేందుకు, న్యాయపరంగా అన్ని సమాధానాలను బిల్లులోనే పొందు పరిచేందుకు, బిల్లుని మరింత మెరుగు పరిచేందుకు, విస్తృతంగా వివరించేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లు వెనక్కి తీసుకుంటున్నామని అన్నారు జగన్.