తీరం దాటిన వాయుగుండం.. మరికొన్ని గంటలు వానగండం..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం ఉదయం వాయుగుండంగా మారి బీభత్సం సృష్టించింది. ఈరోజు ఉదయం 3 గంటలనుంచి 4 గంటల మధ్యలో పుదుచ్చేరి-చెన్నై మధ్య ఇది తీరందాటిందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వాయుగుండం ప్రభావంతో మరో 24గంటలపాటు వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. వారం రోజుల వ్యవధిలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ రెండో వాయుగుండం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలను వణికించింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాపై వర్షం పగబట్టిందిందా అన్నంతలా కుండపోత కురిసింది. గతంలో […]
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం ఉదయం వాయుగుండంగా మారి బీభత్సం సృష్టించింది. ఈరోజు ఉదయం 3 గంటలనుంచి 4 గంటల మధ్యలో పుదుచ్చేరి-చెన్నై మధ్య ఇది తీరందాటిందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వాయుగుండం ప్రభావంతో మరో 24గంటలపాటు వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
వారం రోజుల వ్యవధిలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ రెండో వాయుగుండం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలను వణికించింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాపై వర్షం పగబట్టిందిందా అన్నంతలా కుండపోత కురిసింది. గతంలో కురిసిన భారీ వర్షాలకు చెరువులు నిండు కుండల్లా మారాయి, వాగులు, వంకలు పూర్తి స్థాయి నీటి సామర్థ్యంతో ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు రెండో వాయుగుండం కారణంగా వర్షాలకు ఆ చెరువులన్నీ కట్టలు తెంచుకుని ఊర్లపై పడ్డాయి. నెల్లూరు జిల్లాలో చెరువులు కలుజులు దాటి పారడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలు స్తంభించాయి. అటు కడప జిల్లా కూడా ఈసారి తీవ్ర ప్రభావానికి లోనైంది. కడప-తిరుపతి జాతీయ రహదారి వరదనీటితో పోటెత్తిన నదిని తలపించింది.
తిరుమలలో వరద బీభత్సం..
తిరుమల గిరుల్లో కురిసిన వర్షానికి మాడ వీధులు జలమయం అయ్యాయి. క్యూలైన్లలో కూడా వరదనీరు ప్రవేశించింది. రెండు ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడటంతో తాత్కాలికంగా రాకపోకలు ఆపేశారు. ఇక నడకదారులను ముందు జాగ్రత్తగా అధికారులు మూసివేయడంతో పెద్ద నష్టం తప్పిందని తెలుస్తోంది. మూడు రోజులపాటు దర్శనాల విషయంలో వెసులుబాటు ఇస్తున్నట్టు ఇప్పటికే టీటీడీ ప్రకటించింది. వర్షం తగ్గేవరకు తిరుమల యాత్రని వాయిదా వేసుకుంటే మంచిదని సూచించింది. జపాలి సహా ఇతర తీర్థాలన్నిటినీ వరదనీరు ముంచెత్తింది.
తిరుపతి జలమయం..
తిరుమల గిరుల్లో కురిసిన వర్షమంతా తిరుపతికి పోటెత్తింది. కపిలతీర్థంలోని జలపాతం ఉరకలెత్తింది. దాదాపుగా తిరుమలలోని ప్రధాన రహదారులన్నీ పిల్ల కాల్వల్లా మారిపోయాయి. రైల్వే అండర్ బ్రిడ్జ్ ల వద్ద నీరు నిలబడిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈరోజు విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. అటు రేణిగుంట విమానాశ్రయంలో భారీ వర్షాలకు విమానాల ల్యాండింగ్ కష్టసాధ్యంగా మారింది. వచ్చిన విమానాలు వచ్చినట్టే తిరుగు ప్రయాణం అయ్యాయి.