సాగు చట్టాల రద్దు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన..
సాగు చట్టాలపై బీజేపీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇన్నాళ్లూ చట్టాల రద్దు విషయంలో మొండిగా వ్యవహరించిన ప్రధాని మోదీ మెట్టు దిగారు. నూతనంగా తీసుకొచ్చిన సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. ఢిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళనకు ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రధాన కీలక ప్రకటన చేశారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దుకోసం గతేడాది నవంబర్ 26 నుండి రైతులు వివిధ ప్రదేశాలలో నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ ఏడాది రిపబ్లిక్ […]
సాగు చట్టాలపై బీజేపీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇన్నాళ్లూ చట్టాల రద్దు విషయంలో మొండిగా వ్యవహరించిన ప్రధాని మోదీ మెట్టు దిగారు. నూతనంగా తీసుకొచ్చిన సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. ఢిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళనకు ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రధాన కీలక ప్రకటన చేశారు.
నూతన వ్యవసాయ చట్టాల రద్దుకోసం గతేడాది నవంబర్ 26 నుండి రైతులు వివిధ ప్రదేశాలలో నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో ఉద్యమం హింసాత్మకంగా మారింది. అప్పటినుంచి కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి. గతంలో రైతు సంఘాలతో జరిగిన చర్చల్లో చట్టాల రద్దు కాకుండా ఇంకేమైనా కోరండని ప్రభుత్వం వారికి ఆఫర్ ఇచ్చింది. అయితే చట్టాలను కచ్చితంగా రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు తేల్చి చెప్పాయి. దీంతో ఈవ్యవహారంపై పీటముడి పడింది. చర్చలు అటకెక్కాయి. అయితే ఇన్నాళ్లకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు.
దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి 2020లో మూడు ఆర్డినెన్సులను తీసుకొచ్చిన కేంద్రం ఆ తర్వాత వాటి స్థానంలో చట్టాలను రూపొందించింది. 2020 సెప్టెంబర్ 15వ తేదీన ఒక బిల్లు, 17వ తేదీన మిగతా రెండు బిల్లులు లోక్ సభలో ఆమోదం పొంది చట్టాలయ్యాయి. నిత్యావసర సరకుల సవరణ బిల్లు, రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార ప్రోత్సాహక, సులభతర బిల్లు, రైతుల సాధికారత, రక్షణ, ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లులు చట్టరూపం దాల్చిన తర్వాత రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. రైతాంగం కార్పొరేట్ కబంధ హస్తాల్లో మగ్గిపోయే అవకాశముందని, పేద, బడుగు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందనేది వారి వాదన. ఈ క్రమంలో ఎన్డీఏ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకొచ్చింది. వివిధ రైతు సంఘాలన్నీ రాకేష్ టికాయత్ ఆధ్వర్యంలో ఏకమై ఢిల్లీ సరిహద్దుల్లో గుడారాలు వేసుకుని మరీ నిరసనకు దిగాయి. ప్రభుత్వం దిగిరాకపోయినా, ఎండయినా, వానయినా అక్కడే రైతులు శాంతియుతంగా నిరసన చేపడుతున్నారు. ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 22న లక్నోలో మహా పంచాయత్ నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు.