Telugu Global
NEWS

అసెంబ్లీలో బాబు కంటతడి.. కౌంటర్ ఇచ్చిన రోజా..

ఏపీ అసెంబ్లీ రెండోరోజు ఓ విచిత్ర సంఘటన జరిగింది. సభలో తనను అవమానించారని, తన భార్య గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు వాకవుట్ చేశారు. తాను సీఎం అయ్యే వరకు తిరిగి అసెంబ్లీ గడప తొక్కనని చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు. తనని బూతులు తిట్టినా తట్టుకున్నానని, తన కుటుంబ సభ్యుల్ని కూడా అవమానిస్తుంటే తట్టుకోలేకపోయానని చెప్పారు. క్షేత్ర స్థాయిలో తేల్చుకున్నాకే అసెంబ్లీకి వెళ్తానన్నారు. చంద్రబాబు ఎపిసోడ్ […]

అసెంబ్లీలో బాబు కంటతడి.. కౌంటర్ ఇచ్చిన రోజా..
X

ఏపీ అసెంబ్లీ రెండోరోజు ఓ విచిత్ర సంఘటన జరిగింది. సభలో తనను అవమానించారని, తన భార్య గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు వాకవుట్ చేశారు. తాను సీఎం అయ్యే వరకు తిరిగి అసెంబ్లీ గడప తొక్కనని చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు. తనని బూతులు తిట్టినా తట్టుకున్నానని, తన కుటుంబ సభ్యుల్ని కూడా అవమానిస్తుంటే తట్టుకోలేకపోయానని చెప్పారు. క్షేత్ర స్థాయిలో తేల్చుకున్నాకే అసెంబ్లీకి వెళ్తానన్నారు.

చంద్రబాబు ఎపిసోడ్ పై వైసీపీ తీవ్రంగా స్పందించింది. చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా ఉండేందుకు ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచించారని, చివరకు తన ప్లాన్ అమలు చేశారని, సీఎం అయ్యే వరకు అసెంబ్లీకి రానంటూ పారిపోయారని ఎద్దేవా చేశారు మంత్రి కొడాలి నాని. చంద్రబాబు అసెంబ్లీలో తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారని అన్నారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. చంద్రబాబుకి ఇక రాజకీయ నిష్క్రమణే గతి అని అన్నారు.

విధి ఎవర్నీ వదిలిపెట్టదు బాబూ..!
“చంద్రబాబూ..! విధి ఎవరినీ వదిలిపెట్టదు.. అందరి సరదా తీర్చేస్తుంది” అంటూ ఎమ్మెల్యే రోజా సెటైర్లు వేశారు. 72 ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌ ను చంద్రబాబు ఎంతగానో ఏడ్పించారని, సరిగ్గా 71 ఏళ్ల 7 నెలలకు చంద్రబాబుకి ఆ పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. మనం ఏం చేస్తే అదే మనకు తిరిగొస్తుందని చెప్పారు రోజా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తనపై సీడీలు చూపించి మరీ దుష్ప్రచారం చేశారని ఆ విషయం చంద్రబాబు మరచిపోయారా అని ప్రశ్నించారు. కుటుంబం, గౌరవం, మర్యాద చంద్రబాబు ఒక్కరికేనా, మిగతా వారికి లేవా అని అడిగారు. టీడీపీ కోసం పదేళ్లు కష్టపడిన తన క్యారెక్టర్ ను చంద్రబాబు అవమానించారని అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేసి తనను మానసికంగా వేధించారని, ఆ విషయాలను ప్రజలు మరచిపోలేదని చెప్పారు. రూల్స్‌కు విరుద్ధంగా తనను ఒక ఏడాదిపాటు చంద్రబాబు సస్పెండ్ చేయించగలిగారని, కానీ.. చంద్రబాబు జీవితకాలం అసెంబ్లీ గడప తొక్కకుండా తనకు తానే శపథం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. బైబై బాబూ అంటూ సెటైర్లు పేల్చారు.

First Published:  19 Nov 2021 3:41 PM IST
Next Story