2 రోజులు కాదు, వారంపాటు ఢిల్లీలో లాక్ డౌన్ తరహా ఆంక్షలు..
ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా.. రెండురోజులపాటు లాక్ డౌన్ విధిస్తారా అని ప్రశ్నించిన కొన్ని గంటల వ్యవధిలో కేజ్రీవాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో ఏకంగా వారం రోజులపాటు లాక్ డౌన్ తరహా ఆంక్షలు విధించింది. సోమవారం నుంచి వారం రోజులపాటు పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సమయంలో ఆన్ లైన్ తరగతుల నిర్వహించాలని యాజమాన్యాలకు సూచించింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కార్యాలయాలకు […]
ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా.. రెండురోజులపాటు లాక్ డౌన్ విధిస్తారా అని ప్రశ్నించిన కొన్ని గంటల వ్యవధిలో కేజ్రీవాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో ఏకంగా వారం రోజులపాటు లాక్ డౌన్ తరహా ఆంక్షలు విధించింది. సోమవారం నుంచి వారం రోజులపాటు పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సమయంలో ఆన్ లైన్ తరగతుల నిర్వహించాలని యాజమాన్యాలకు సూచించింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కార్యాలయాలకు రాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించింది. ప్రైవేటు కంపెనీలు కూడా వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలు అమలు చేయాలని కోరింది.
నిర్మాణ పనులు కూడా ఆపేయాల్సిందే..?
నగరంలో దుమ్మురేగకుండా అన్ని నిర్మాణ పనుల్ని నాలుగు రోజులపాటు ఆపివేయాలని ఢిల్లీ సర్కారు ఆదేశాలిచ్చింది. అయితే ఈ తరహా ఆంక్షలతో, సెలవలొచ్చాయి కదా అని అందరూ వినోదాల కోసం బయటకి వస్తే అప్పుడు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. ఇతరత్రా వ్యాపార కార్యకలాపాలపై కూడా ఆంక్షలు విధించే దిశగా ఆలోచిస్తోంది. వాహనాల రద్దీ నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటోంది.
సుప్రీం చీవాట్లతో వెంటనే నిర్ణయం..
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. శీతాకాలంలో ఒక్కసారిగా పెరిగిపోయే కాలుష్యానికి.. వ్యవసాయ వ్యర్థాల కాల్చివేతను ప్రభుత్వం సాకుగా చూపడం సరికాదని, రైతులపై నిందలు వేయడం తప్పు అని పేర్కొంది. ఢిల్లీలో దీపావళి బాణసంచా కాల్పులపై నిషేధం ఏమైపోయిందని, వాహనాల రద్దీ, పరిశ్రమల కాలుష్యాన్ని ఎందుకు గుర్తించరని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండురోజులు లాక్ డౌన్ విధిస్తారా అని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏకంగా వారం రోజులపాటు లాక్ డౌన్ తరహా ఆంక్షలు విధించి సంచలన నిర్ణయం తీసుకుంది.