కన్నీరు ఇంకిపోయిన ఖాకీ కష్టాలు..
పోలీస్ ఉద్యోగం. చాలా మందికి చాలా రకాల అభిప్రాయాలుంటాయి. గౌరవం ఉండే ఉద్యోగం అని కొందరు, జీతం అక్కర్లేకుండా లంచాలతో బతికేయొచ్చని కొందరు, సెటిల్మెంట్లతో లక్షలు వెనకేసుకుంటారని కొందరు.. ఇలా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ ఖాకీ యూనిఫామ్ వెనక ఎవరూ ఊహించని కష్టం ఉంటుందని, అది రోజుకి 8 గంటలు చేసే డ్యూటీ కాదని చెబుతున్నాయి సర్వేలు. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం పోలీసులకు వారి పుట్టినరోజు, పెళ్లి రోజున సెలవు ఇచ్చేలా జీవో జారీ […]
పోలీస్ ఉద్యోగం. చాలా మందికి చాలా రకాల అభిప్రాయాలుంటాయి. గౌరవం ఉండే ఉద్యోగం అని కొందరు, జీతం అక్కర్లేకుండా లంచాలతో బతికేయొచ్చని కొందరు, సెటిల్మెంట్లతో లక్షలు వెనకేసుకుంటారని కొందరు.. ఇలా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ ఖాకీ యూనిఫామ్ వెనక ఎవరూ ఊహించని కష్టం ఉంటుందని, అది రోజుకి 8 గంటలు చేసే డ్యూటీ కాదని చెబుతున్నాయి సర్వేలు.
ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం పోలీసులకు వారి పుట్టినరోజు, పెళ్లి రోజున సెలవు ఇచ్చేలా జీవో జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం కూడా ఇటీవలే పోలీసులకు వీక్లీఆఫ్ మంజూరు చేసింది. తమిళనాడు ప్రభుత్వం కూడా అదే బాటలో వారాంతపు సెలవులు ప్రకటించింది. ఇవన్నీ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు. అయితే ఇప్పటి వరకూ పోలీసులు వీక్లీ ఆఫ్ లు లేకుండా, డబుల్ డ్యూటీలు చేస్తూ అష్టకష్టాలు పడేవారని సర్వేలు చెబుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు మినహాయిస్తే.. భారత్ లో సగటున పోలీసులకు డబుల్ డ్యూటీ కష్టాలే ఎక్కువ.
పనిగంటలు..
మోడల్ పోలీస్ యాక్ట్ ప్రకారం పోలీసులకు రోజువారీ 8 గంటలు మాత్రమే పనిచేయాలి. కానీ దేశవ్యాప్తంగా 8గంటల డ్యూటీ చేసే పోలీసులు కేవలం 13శాతం మంది మాత్రమే. 37శాతం మంది పోలీసులు రోజుకి 9నుంచి 12 గంటలసేపు డ్యూటీలో ఉంటారు. 20శాతం మంది 16గంటల వరకు పనిచేస్తారు. 24శాతం మంది రోజుకి 16గంటలకంటే ఎక్కువ పని చేస్తున్నారు. అంటే పోలీస్ డ్యూటీ అంటే ఇంట్లోనుంచి బయటకి వెళ్లడమే కానీ, ఏ టైమ్ కి తిరిగొస్తారనేది వారికే తెలియదన్నమాట. సగటున 80శాతం మంది పోలీసులు రోజుకి 8గంటల కంటే ఎక్కువసేపు డ్యూటీలో ఉంటున్నారు.
వీక్లీ ఆఫ్..
భారత దేశంలో ఉన్న పోలీసుల్లో సగానికి సగం మంది వీక్లీ ఆఫ్ లు లేకుండానే పనిచేస్తున్నారు. దాదాపు 51 రోజులకి ఒకసారి మాత్రమే తాము ఇంటిపట్టున ఉంటున్నట్టు చెబుతున్నారు వీరంతా. వారానికి ఒక్కరోజు వీక్లీ ఆఫ్ లు తీసుకునేవారు కేవలం 26శాతం మంది మాత్రమే. అతి తక్కువగా 4 శాతం మందికి వారానికి రెండు రోజులు వీక్లీ ఆఫ్ తీసుకునే వెసులుబాటు ఉంది.
అత్యథిక పని వేళల వల్ల పోలీసుల్లో 73శాతం మంది తాము శారీరక, మానకిక ఇబ్బందులకు లోనవుతున్నట్టు చెబుతున్నారు. 84శాతం మందిలో కుటుంబానికి తగిన సమయం కేటాయించలేదన్న అసంతృప్తి ఉంది. ఇక 76 శాతం మంది పని ఒత్తిడితో సరిగ్గా డ్యూటీ చేయలేకపోతున్నామనే అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.
మోడల్ పోలీస్ యాక్ట్ అనేది కేవలం చట్టం రూపంలో మాత్రమే ఉంది. అమలు తీరులో మాత్రం చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇటీవల ఏపీ, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాలు పోలీసులకు వీక్లీ ఆఫ్ లు, ఇతర వెసులుబాట్లు ఇచ్చేందుకు సిద్ధపడ్డాయి. ఇదే రీతిలో ఇతర రాష్ట్రాలు కూడా ముందుకొస్తే పోలీసులపై పని ఒత్తిడి తగ్గుతుంది.