Telugu Global
Health & Life Style

సూపర్ ఫుడ్ ఎంత 'సూపర్'..?

ఆహారానికి మంచి, చెడు అనే లక్షణాలుండవు. అయితే మనం తీసుకునే సమయం, సందర్భం, మన శరీర తత్వం.. వీటి ఆధారంగా కొన్నింటిని దూరం పెట్టాల్సి ఉంటుంది. సూపర్ ఫుడ్ అంటూ ఇప్పుడు మార్కెట్ లో కొన్ని ఆహార పదార్థాలకు విపరీత ప్రచారం జరుగుతోంది. సూపర్ మార్కెట్లలో లభించే కొన్ని రకాల పండ్లు, కూరగాయలు సూపర్ ఫుడ్ అనే బ్రాండ్ తో ప్రచారంలోకి వస్తున్నాయి. కివి, బ్లూబెర్రీస్.. ఇలా స్థానికంగా లభించని కొన్ని రకాల పండ్లకు సూపర్ ఫుడ్ […]

సూపర్ ఫుడ్ ఎంత సూపర్..?
X

ఆహారానికి మంచి, చెడు అనే లక్షణాలుండవు. అయితే మనం తీసుకునే సమయం, సందర్భం, మన శరీర తత్వం.. వీటి ఆధారంగా కొన్నింటిని దూరం పెట్టాల్సి ఉంటుంది. సూపర్ ఫుడ్ అంటూ ఇప్పుడు మార్కెట్ లో కొన్ని ఆహార పదార్థాలకు విపరీత ప్రచారం జరుగుతోంది. సూపర్ మార్కెట్లలో లభించే కొన్ని రకాల పండ్లు, కూరగాయలు సూపర్ ఫుడ్ అనే బ్రాండ్ తో ప్రచారంలోకి వస్తున్నాయి. కివి, బ్లూబెర్రీస్.. ఇలా స్థానికంగా లభించని కొన్ని రకాల పండ్లకు సూపర్ ఫుడ్ అనే బ్రాండ్ తగిలించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. ఆ ప్రచారానికి మధ్యతరగతి మనిషి కూడా బోల్తా పడుతున్నాడు.

అరటి పండు మంచిదా.. బ్లూ బెర్రీస్ మంచివా..
గతంలో అరటిపండ్లు ఆరోగ్యానికి మంచివి అనేవారు. ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి యాపిల్ వచ్చింది. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండొచ్చని చెప్పేవారు. ఇప్పుడు యాపిల్ లభ్యత బాగా పెరిగిపోవడంతో.. మరో అరుదైన రకం కావాల్సి వచ్చింది. బ్లూబెర్రీస్ తింటే ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండని, దాన్ని సూపర్ ఫుడ్ జాబితాలో చేర్చారు. వాస్తవానికి ఒక కప్పు బ్లూబెర్రీస్, అరటిపండ్లను పోల్చి చూస్తే వాటిద్వారా శరీరానికి కలిగే మేలు దాదాపు సమానం. బ్లూ బెర్రీస్ లో సి, కె విటమిన్లు కాస్త ఎక్కువ. అరటి పండ్లలో బి2, బి6, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువ. బ్లూ బెర్రీస్ తో పోల్చుకుంటే అరటిపండ్లు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలే కాస్త అధికం అంటారు. కానీ అరటిపండు రేటు తక్కువ, దాని లభ్యత ఎక్కువ. అందుకే బ్లూబెర్రీస్ పై అందరికీ మోజు ఎక్కువ.

బ్రెజిల్ లో ఎక్కువగా దొరికే అకాయ్ పండ్లను రోజూ ఉదయం అల్పాహారంగా తీసుకుంటే క్యాన్సర్ నయమవుతుందనే ప్రచారం ఇటీవల జోరందుకుంది. అకాయ్ కి సూపర్ ఫుడ్ అనే పేరు పెట్టి మార్కెటింగ్ చేస్తున్నారు. అకాయ్ బౌల్ రెసిపీ అని గూగుల్ లో వెదికితే లెక్కలేన్ని వీడియోలు కనపడతాయి. అసలేంటీ అకాయ్, దానికి క్యాన్సర్ ని నయం చేసే గుణం ఉంటే.. ఎందుకీ ఆస్పత్రులు, డాక్టర్లు, పరిశోధనలు. సంతాన లేమిని దూరం చేయడానికి ఓ సూపర్ ఫుడ్, ఊబకాయాన్ని తగ్గించడానికి మరో సూపర్ ఫుడ్, వయసుని అసలు కనపడనివ్వకుండా చూసేందుకు యాంటీ ఏజింగ్ సూపర్ ఫుడ్.. ఇలా రకరకాల పేర్లతో కొన్ని ఉత్పత్తులు మార్కెట్ ని ముంచెత్తుతున్నాయి.

ఫలానా ఆహారంలో ఏయే విటమిన్లు ఉన్నాయో ప్రకటించొచ్చు కానీ, ఆయా పదార్థాలు తినడం వల్ల కలిగే ఉపయోగాలను ప్రకటించకూడదని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గతంలోనే ప్రకటించింది. ఆహార పదార్థాల విషయంలో ప్రకటనలతో వినియోగదారుల్ని మోసగించకూడదని ఎఫ్.డి.ఐ. చెబుతోంది.

దేనికదే సూపర్ ఫుడ్..
ఫలానా ఆహారం తింటేనే వందేళ్లు బతుకుతారు, ఆరోగ్యంగా ఉంటారు.. అని ఎవరూ సర్టిఫై చేయలేరు. అదే సమయంలో సూపర్ ఫుడ్ గా ప్రచారంలో ఉన్న కొన్ని ఆహార పదార్థాలను తీసుకుని, మిగతా రోజువారీ ఆహారాన్ని ఆపేస్తే అసలుకే మోసం వస్తుందని చెబుతున్నారు నిపుణులు. సమతుల ఆహారం మంచిదని అంటున్నారు. సూపర్ ఫుడ్ గా ప్రచారం చేసుకునేది కేవలం అదనపు ఆహారమే కానీ, అసలు ఆహారం కాదని సూచిస్తున్నారు. దురలవాట్లు లేకపోవడం, వ్యాయామం.. ఇవే మనిషి ఆరోగ్యాన్ని కాపాడతాయని చెబుతున్నారు.

First Published:  9 Nov 2021 4:48 AM IST
Next Story