బెంగాల్ లో బీజేపీ చేతులెత్తేసినట్టేనా..?
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ పూర్తిగా చేతులెత్తేసినట్టు కనపడుతోంది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ సహా.. ఇతర కేంద్ర మంత్రులు, మందీ మార్బలాన్ని వెంటేసుకుని ప్రచారానికొచ్చారు. బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరచి తీరతామంటూ సవాళ్లు విసిరారు. వచ్చినవారికి వచ్చినట్టు పార్టీ తీర్థం పోశారు, కాషాయ కండువాలు కప్పేశారు. తీరా ఎన్నికల ఫలితాలు తేడాకొట్టే సరికి ఎక్కడివాళ్లు అక్కడ గప్ చుప్ గా అయిపోయారు. సెప్టెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ […]
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ పూర్తిగా చేతులెత్తేసినట్టు కనపడుతోంది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ సహా.. ఇతర కేంద్ర మంత్రులు, మందీ మార్బలాన్ని వెంటేసుకుని ప్రచారానికొచ్చారు. బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరచి తీరతామంటూ సవాళ్లు విసిరారు. వచ్చినవారికి వచ్చినట్టు పార్టీ తీర్థం పోశారు, కాషాయ కండువాలు కప్పేశారు. తీరా ఎన్నికల ఫలితాలు తేడాకొట్టే సరికి ఎక్కడివాళ్లు అక్కడ గప్ చుప్ గా అయిపోయారు. సెప్టెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బీజేపీలో నీరసం మరింత పెరిగింది. ఇటీవల జరిగిన నాలుగు స్థానాల ఉప ఎన్నికల విషయంలో బీజేపీ నేతలు పూర్తిగా అస్త్ర సన్యాసం చేశారు. అధిష్టానం సపోర్ట్ చేయలేదు, రాష్ట్ర నాయకులు కూడా ప్రచారంపై దృష్టిపెట్టలేదు. దీంతో తాజా ఉప ఎన్నికల్లో నాలుగు చోట్ల భారీ మెజార్టీలతో టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది.
ఉప ఎన్నికల తర్వాత పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ బలం 217కి పెరిగింది. అటు బీజేపీ బలం క్రమంగా తగ్గిపోతోంది. కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో, ముకుల్ రాయ్, రజీబ్ బెనర్జీ వంటి కీలక నేతలు సైతం టీఎంసీ పంచన చేరడంతో.. మమతా బెనర్జీ ఆధిపత్యం క్రమక్రమంగా బలపడుతోంది. అదే సమయంలో బీజేపీ కాడె పడేసినట్టు అర్థమవుతోంది. అక్టోబర్ లో జరిగిన నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు పూర్తిగా పడిపోగా.. వామపక్షాలకు ఓట్ల శాతం పెరగడం గమనార్హం.
బీజేపీ స్ట్రాటజీ మార్చక తప్పదా..?
27శాతం మైనార్టీలు ఉన్న పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల వ్యూహాలు ఫలించకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఎన్నికల తర్వాత చెలరేగిన హింసపై కొన్నాళ్లు పోరాటం చేసిన బీజేపీ.. ఇప్పుడు పూర్తిగా ఆ విషయాన్ని వదిలేసింది. వచ్చే ఏడాది కోల్ కతా కార్పొరేషన్ సహా.. రాష్ట్రంలోని మెజార్టీ మున్సిపాల్టీలకు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సందర్భంలో బీజేపీ ఎన్నికల స్ట్రాటజీ మారిస్తేనే ఫలితం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఉప ఎన్నికల లాగే ఉసూరుమంటే మాత్రం.. బెంగాల్ లో బీజేపీ ఇక ఎప్పటికీ కోలుకునే అవకాశమే ఉండదు.