ఢిల్లీపై కమ్ముకున్న దీపావళి పొగ.. నిబంధనలు బేఖాతరు..
ఢిల్లీలో టపాకాయలు కాల్చడంపై పూర్తి నిషేధం ఉన్నా.. ప్రజలెవరూ ఆంక్షలను లక్ష్యపెట్టలేదు. సాయంత్రం 7 గంటలనుంచే ఢిల్లీలో టపాకాయల మోత మోగింది. దీంతో వాతావరణ కాలుష్యం పెరిగిందని దీపావళి తర్వాత తీవ్రమైన పొగమంచు అలముకుందని చెబుతున్నారు స్థానికులు. వచ్చే ఏడాది జనవరి 1 వరకు ఢిల్లీలో టపాకాయలు కాల్చకూడదని నిషేధాజ్ఞలను అమలులోకి తెచ్చింది కేజ్రీవాల్ ప్రభుత్వం. అటు హర్యానాలో కూడా నిషేధం అమలులో ఉంది. అయితే ప్రజలు మాత్రం ఈ నిషేధాజ్ఞలను లెక్కపెట్టలేదు. లజపత్ నగర్, బురారీ, […]
ఢిల్లీలో టపాకాయలు కాల్చడంపై పూర్తి నిషేధం ఉన్నా.. ప్రజలెవరూ ఆంక్షలను లక్ష్యపెట్టలేదు. సాయంత్రం 7 గంటలనుంచే ఢిల్లీలో టపాకాయల మోత మోగింది. దీంతో వాతావరణ కాలుష్యం పెరిగిందని దీపావళి తర్వాత తీవ్రమైన పొగమంచు అలముకుందని చెబుతున్నారు స్థానికులు. వచ్చే ఏడాది జనవరి 1 వరకు ఢిల్లీలో టపాకాయలు కాల్చకూడదని నిషేధాజ్ఞలను అమలులోకి తెచ్చింది కేజ్రీవాల్ ప్రభుత్వం. అటు హర్యానాలో కూడా నిషేధం అమలులో ఉంది. అయితే ప్రజలు మాత్రం ఈ నిషేధాజ్ఞలను లెక్కపెట్టలేదు. లజపత్ నగర్, బురారీ, పశ్చమ్ విహార్, షహదారా ప్రాంతాల్లో దీపావళి బాణసంచా భారీగా పేలింది. గురుగ్రామ్, ఫరీదాబాద్ లో కూడా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు.
శీతాకాలంలో ఢిల్లీలో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనికి వాతావరణ కాలుష్యం కూడా తోడై ఢిల్లీ వాసులు మరింత ఇబ్బంది పడతారు. కళ్లనుంచి నీరు కారడం, కళ్లు, ముక్కు మంటలు, శ్వాస కోశ సమస్యలు దేశ రాజధానిలో అధికం. దీంతో అక్కడ బాణసంచా కాల్పులపై ప్రభుత్వం నిషేధం విధించింది. అంతే కాదు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడంపై కూడా ఆంక్షలున్నాయి. కానీ అవేవీ అమలుకావడంలేదు. ఈ ఏడాది కూడా పరిస్థితి మారలేదు. దీపావళి తర్వాత ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు దట్టంగా అలముకొంది. గాలినాణ్యత బాగా పడిపోయిందని భారత వాతావరణ శాఖ చెబుతోంది.
దీపావళిని పొగమంచు ఫస్ట్ ఎపిసోడ్ గా అభివర్ణిస్తున్నారు. గతేడాదితో పోల్చి చూస్తే బాణసంచా కాల్పులు 50శాతం మేర తగ్గినా.. వాయు కాలుష్య ప్రభావం మాత్రం పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0 నుంచి 50 మధ్య ఉంటే మంచిది. అలాంటిది అది ఢిల్లీలో మామూలు రోజుల్లోనే 200కి పైగా ఉంటుంది. దీపావళి సీజన్లో 400కి చేరుకుంటుంది. ఈ దఫా దీపావళి కారణంగా AQI 500కి చేరుకుని ఉంటుందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంచనా. టపాకాయలు కాల్చడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు 13 వేల కిలోలకు పైగా అక్రమ టపాకాయల నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 33మందిని అరెస్ట్ చేశారు. అయినా లాభం లేదని తేలిపోయింది. పూర్తిగా నిషేధం అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పినా 50శాతం కూడా అది అమలు కాలేదు. ఢిల్లీకి పొగబాధ తప్పలేదు.