బెంగాల్ లో బీజేపీకి మరో షాక్.. టీఎంసీ క్లీన్ స్వీప్..
పశ్చిమబెంగాల్ ఉప ఎన్నికల్లో బీజేపీకి మరో షాక్ తగిలింది. గతంలో ఆ పార్టీ గెలిచిన రెండు స్థానాల్ని కూడా ఉప ఎన్నికల్లో కోల్పోవాల్సి వచ్చింది. బెంగాల్ లో అధికారం గ్యారెంటీ అనుకున్న క్రమంలో ఎంపీలను సైతం పదవీకాలం ఉండగానే బెంగాల్ అసెంబ్లీ బరిలో నిలిపింది బీజేపీ అధిష్టానం. ఇలా ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులపై విజయం సాధించారు. నిశిత్ ప్రామాణిక్.. దిన్హట నియోజకవర్గం నుంచి, జగన్నాథ్ సర్కార్.. సంతిపూర్ నియోజకవర్గం నుంచి […]
పశ్చిమబెంగాల్ ఉప ఎన్నికల్లో బీజేపీకి మరో షాక్ తగిలింది. గతంలో ఆ పార్టీ గెలిచిన రెండు స్థానాల్ని కూడా ఉప ఎన్నికల్లో కోల్పోవాల్సి వచ్చింది. బెంగాల్ లో అధికారం గ్యారెంటీ అనుకున్న క్రమంలో ఎంపీలను సైతం పదవీకాలం ఉండగానే బెంగాల్ అసెంబ్లీ బరిలో నిలిపింది బీజేపీ అధిష్టానం. ఇలా ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులపై విజయం సాధించారు. నిశిత్ ప్రామాణిక్.. దిన్హట నియోజకవర్గం నుంచి, జగన్నాథ్ సర్కార్.. సంతిపూర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయితే బెంగాల్ అసెంబ్లీలో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడం, టీఎంసీ ఘన విజయంతో.. ఎమ్మెల్యే పదవులకు ఆ ఎంపీలిద్దరూ రాజీనామా చేశారు. వారిని లోక్ సభలో కొనసాగించేందుకే బీజేపీ అధిష్టానం ఇష్టపడింది. ఈ క్రమంలో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఆ రెండు నియోజకవర్గాలతోపాటు.. టీఎంసీ ఎమ్మెల్యేలు చనిపోవడంతో ఖాళీ అయిన గొసాబా, ఖర్దా నియోజకవర్గాలకు కూడా ఒకేసారి ఉప ఎన్నికలు జరిగాయి. ఫలితాల్లో టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది.
టీఎంసీ నియోజకవర్గాలైన గొసాబా, ఖర్దాతోపాటు, బీజేపీ సిట్టింగ్ స్థానాలైన సంతిపూర్, దిన్హటలో కూడా టీఎంసీ అభ్యర్థులు భారీ మెజార్టీ సాధించారు. సంతిపూర్ లో కిశోర్ గోస్వామి విజయం సాధించగా, దిన్హటలో ఉదయన్ గుహ, గొసాబాలో సుబ్రత మండల్, ఖర్దాలో సోవన్ దేవ్ ఛటోపాధ్యాయ.. విజేతలుగా నిలిచారు.
విద్వేష రాజకీయాలు, ప్రచార హంగామాల కంటే అభివృద్ధి రాజకీయాలు, ఐక్యతకే బెంగాల్ ఓటర్లు పట్టం కట్టారని అన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ప్రజల ఆశీస్సులతో బెంగాల్ పురోభివృద్ధికి తాము పాటుపడతామని స్పష్టం చేశారు. బెంగాల్ ఉప ఎన్నికల ఫలితాల్లాగే.. వచ్చే ఏడాది జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ మట్టికరుస్తుందని ఆమె జోస్యం చెప్పారు.