Telugu Global
National

ఉపాధి హామీకి నిధుల్లేవు.. రాష్ట్రాలపై నిందమోపుతున్న కేంద్రం..

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి ఇప్పటికే రాష్ట్రాలకు కేటాయింపులు జరిగిపోయాయని, కొత్తగా పనులు చేపట్టి నిధులకోసం ఒత్తిడి తేవడం సరికాదంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 35కు గాను 25చోట్ల స్థానిక ప్రభుత్వాలు 100శాతం నిధుల్ని ఖర్చు చేశాయని కేంద్రం లెక్కలు చెబుతోంది. ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులను మించి నిధులిచ్చామని చెబుతోంది. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు ఎక్కువగా ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రాలు […]

ఉపాధి హామీకి నిధుల్లేవు.. రాష్ట్రాలపై నిందమోపుతున్న కేంద్రం..
X

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి ఇప్పటికే రాష్ట్రాలకు కేటాయింపులు జరిగిపోయాయని, కొత్తగా పనులు చేపట్టి నిధులకోసం ఒత్తిడి తేవడం సరికాదంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 35కు గాను 25చోట్ల స్థానిక ప్రభుత్వాలు 100శాతం నిధుల్ని ఖర్చు చేశాయని కేంద్రం లెక్కలు చెబుతోంది. ఇప్పటికే బడ్జెట్ కేటాయింపులను మించి నిధులిచ్చామని చెబుతోంది.

కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు ఎక్కువగా ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రాలు వినియోగించుకున్నాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి జరిగిన కేటాయింపులు ఇప్పటికే పూర్తిగా ఖర్చయ్యాయి. చాలా చోట్ల కేంద్రంనుంచి బకాయిలు వస్తాయనే నమ్మకంతో రాష్ట్రాలు ఖర్చు భరిస్తూ, ఉపాధి హామీ పథకాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. కేంద్రం నిధులు సర్దుబాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటికే అవసరానికి మించి రాష్ట్రాలు ఖర్చు చేశాయని, ఇకపై నిధులు ఇవ్వడం కుదరదని కేంద్రం తెగేసి చెబుతోంది.

ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకానికి 73వేలకోట్ల రూపాయలు కేటాయింపులుగా ఉండగా.. ఇప్పటికే 8,686 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చయ్యాయని చెబుతోంది కేంద్రం. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇది మరింతగా పెరుగుతుందని ఆందోళన వెలిబుచ్చింది. అవసరానికి మించి నిధులను వాడుకున్న రాష్ట్రాలు, కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నాయనేది కేంద్రం ఆరోపణ.

ఏపీ, తమిళనాడునుంచి అధిక డిమాండ్..
కరోనా కష్టకాలంలో ఉపాధి పనులపై రాష్ట్ర ప్రభుత్వాలు అధిక శ్రద్ధ చూపించాయి. దీంతో ఏపీ, తమిళనాడులో పనులు ఎక్కువగా జరిగాయి. కేంద్రం లెక్కల ప్రకారం ఏపీలో 2,323 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1999 కోట్ల రూపాయలు నెగెటివ్ నెట్ బ్యాలెన్స్ గా చూపిస్తున్నాయి. మొత్తం 21 రాష్ట్రాలు ఇలా నెగెటిన్ నెట్ బ్యాలెన్స్ చూపించడం గమనార్హం. మరోవైపు కరోనా కష్టకాలంలో ఉపాధి కరువై, వలస వెళ్లిన పేదలంతా సొంత స్థలాలకు వచ్చేశారు. అలాంటి వారందరికీ ఉపాధి హామీ పథకం సంజీవనిగా పనిచేసింది. ఈ దశలో కేంద్రం రాష్ట్రాలపై నిందలు వేయడం సరికాదంటున్నారు మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ నేతలు. అటు రాష్ట్రాలు కూడా నిధులకోసం డిమాండ్ చేస్తున్నాయి, కేంద్రం చేస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నాయి.

First Published:  29 Oct 2021 10:28 PM GMT
Next Story