స్వరం మార్చిన పన్నీర్ సెల్వం.. శశికళ రీఎంట్రీ ఖాయం..?
అన్నాడీఎంకే నుంచి శశికళను సస్పెండ్ చేసి బయటకు పంపించేసిన తర్వాత తొలిసారిగా ఆమెపై సానుకూల ధోరణిలో పార్టీ స్పందించింది. పార్టీ సమన్వయ కర్త, మాజీ సీఎం పన్నీర్ సెల్వం శశికళ రీఎంట్రీపై స్పందించారు. పార్టీ కోర్ కమిటీ ఆమె పునరాగమనంపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. జైలునుంచి విడుదలై వచ్చిన తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించిన శశికళ.. ఇటీవల అన్నాడీఎంకేకు తిరిగి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమె ప్రయత్నాలను చాలామంది కింది స్థాయి నేతలు ఖండిస్తూ […]
అన్నాడీఎంకే నుంచి శశికళను సస్పెండ్ చేసి బయటకు పంపించేసిన తర్వాత తొలిసారిగా ఆమెపై సానుకూల ధోరణిలో పార్టీ స్పందించింది. పార్టీ సమన్వయ కర్త, మాజీ సీఎం పన్నీర్ సెల్వం శశికళ రీఎంట్రీపై స్పందించారు. పార్టీ కోర్ కమిటీ ఆమె పునరాగమనంపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. జైలునుంచి విడుదలై వచ్చిన తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించిన శశికళ.. ఇటీవల అన్నాడీఎంకేకు తిరిగి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమె ప్రయత్నాలను చాలామంది కింది స్థాయి నేతలు ఖండిస్తూ వచ్చారు. శశికళకు పార్టీకి సంబంధం లేదని ప్రకటనలు ఇచ్చారు. తాజాగా పన్నీర్ సెల్వం స్పందన మాత్రం శశికళ రీఎంట్రీ ఖాయమని చెబుతోంది.
2017 ఫిబ్రవరిలో అవినీతి ఆరోపణలతో శశికళ జైలుకెళ్లారు. ఆ తర్వాత సెప్టెంబర్ లో శశికళను పార్టీ జనరల్ సెక్రటరీ పదవినుంచి తప్పించారు. డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా ఉన్న టీటీవీ దినకరన్ ని కూడా సాగనంపారు. శశికళ జైలునుంచి విడుదలైన తర్వాత సహజంగానే అన్నాడీఎంకే పార్టీలో గుబులు పుట్టింది. పన్నీర్ సెల్వం, పళని స్వామి.. ఆమె ఆధిపత్యాన్ని తట్టుకోలేరని అందరూ భావించారు. అయితే అందరికీ షాకిస్తూ ఆమె రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే చిత్తుగా ఓడిపోవడంతో.. శశికళ రీఎంట్రీపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అనుకున్నట్టుగానే.. శశికళ కూడా పార్టీలోని కొంతమంది నేతలు, కార్యకర్తలతో చర్చలు మొదలు పెట్టారు. దీంతో పార్టీ పెద్దల్లో కలవరం మొదలైంది.
పార్జీ జెండాతో మొదలు..
ఈనెల 17న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శశికళ అన్నాడీఎంకే జెండా ఎగురవేశారు. జెండా స్తంభం ముందు పెట్టిన శిలా ఫలకంలో శశికళను పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా పేర్కొన్నారు. దీనిపై అన్నాడీఎంకే నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పార్టీ అధికార ప్రతినిధి జయకుమార్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెలువడిన కొన్ని రోజులకే మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్ సెల్వం శశికళ పునరాగమనంపై కోర్ కమిటీ చర్చిస్తుందని స్పష్టం చేశారు. దీంతో అన్నాడీఎంకే వర్గాల్లో మరోసారి కలవరం మొదలైంది. మరో కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ విషయంపై ఏం చెప్తారనేది చర్చనీయాంశంగా మారింది. శశికళ విషయంలో పార్టీ రెండుగా చీలిపోయే అవకాశం ఉందా..? లేక ఒక్కటిగానే ఉంటుందా..? వేచి చూడాలి.