బరువెక్కిన బాల భారతం..
కరోనా వల్ల వచ్చిన సామాజిక మార్పుల్లో ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యతో సతమతం అవుతున్న తొలిదేశం చైనా కాగా, మలిదేశం భారత్. ప్రపంచ వ్యాప్తంగా కరోనా తర్వాత ఊబకాయుల లెక్కలు తీస్తే.. చైనాలో అత్యథికంగా 1.53 కోట్లమంది బాలలు ఉండగా, భారత్ లో ఊబకాయంతో బాధపడుతున్న బాలల సంఖ్య 1.44కోట్లు గా తేలింది. కొవిడ్ రాక మునుపు దేశంలో 10నుంచి 13శాతం మంది పిల్లల్లో మాత్రమే ఉన్న ఊబకాయ సమస్య.. కొవిడ్ తర్వాత […]
కరోనా వల్ల వచ్చిన సామాజిక మార్పుల్లో ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యతో సతమతం అవుతున్న తొలిదేశం చైనా కాగా, మలిదేశం భారత్. ప్రపంచ వ్యాప్తంగా కరోనా తర్వాత ఊబకాయుల లెక్కలు తీస్తే.. చైనాలో అత్యథికంగా 1.53 కోట్లమంది బాలలు ఉండగా, భారత్ లో ఊబకాయంతో బాధపడుతున్న బాలల సంఖ్య 1.44కోట్లు గా తేలింది. కొవిడ్ రాక మునుపు దేశంలో 10నుంచి 13శాతం మంది పిల్లల్లో మాత్రమే ఉన్న ఊబకాయ సమస్య.. కొవిడ్ తర్వాత 16 శాతానికి ఎగబాకింది. లాక్ డౌన్ సమయంలో మారిన చిన్నారుల ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, స్కూళ్లకు పరుగులు పెట్టే పని లేకపోవడమే ప్రధాన కారణం అని తేలుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన బరువులు..
కొవిడ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య భారీగా పెరిగిందిని, అందులో పిల్లల సంఖ్య అధికంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. 2020-21 కాలంలో 5నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న బాలలు సగటు రెండున్నర కేజీల బరువు పెరిగారని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యయనంలో తేలింది. 12నుంచి 17 సంవత్సరాల మధ్య వయసున్న వారు సగటున 2కిలోల బరువు పెరిగారు.
ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి..
ఇనుపకండలు, ఉక్కు నరాలు.. కావాల్సిన సమయంలో.. బాల భారతం, భావి భారతం ఇలా ఊబకాయంతో సతమతం అవడం పెద్ద సమస్యేనంటున్నారు నిపుణులు. బాలల్లో స్థూలకాయ సమస్యను తొలి దశలోనే నివారించకపోతే భవిష్యత్తులో మరిన్ని దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. భారత్ లో 72శాతం మంది పిల్లలకు సరైన వ్యాయామం ఉండటంలేదు. కరోనా టైమ్ లో వీరంతా సెల్ ఫోన్లు, ట్యాబ్ లు, టీవీలంటూ ఇళ్లకే పరిమితం అయ్యారు. పిల్లలు, తల్లిదండ్రులు కూడా ఇంటిపట్టునే ఉండటంతో.. వారి ఆహారంపై మరింత జాగ్రత్త పెరిగింది. అప్రయత్నంగానే వారు తీసుకునే ఆహార పరిమాణం పెరిగింది. ఫలితంగా ఊబకాయ సమస్య కూడా పెరిగింది.
జపాన్ ఆదర్శం..
జపాన్ లో ఊబకాయుల సంఖ్య తక్కువ, జపాన్ పిల్లల్లో కూడా ఊబకాయం సమస్య పెద్దగా కనిపించదు. అక్కడ పిల్లలకిచ్చే డైట్ ప్రత్యేకంగా ఉంటుంది. అంతే కాదు.. విద్యార్థులంతా నడిచి లేదా సైకిళ్లలో స్కూళ్లకు వెళ్తారు. భారత్ లో మాత్రం స్కూల్ బస్సులు, ఆటోల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. దీంతో సహజంగానే పిల్లలకు వ్యాయామం, శారీరక శ్రమ దూరమవుతోంది. ఇలాంటి వాటిపై దృష్టిపెడితే ఊబకాయం సమస్యను అధిగమించగలం అంటున్నారు నిపుణులు.