Telugu Global
National

రాష్ట్రాల్లో చాపకింద నీరులా.. టీఎంసీ మాస్టర్ ప్లాన్..

ఖేలా హోబే అంటూ.. పశ్చిమబెంగాల్ లో బీజేపీకి గట్టి షాకిచ్చిన మమతా బెనర్జీ.. ఇప్పుడు దేశ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు. ఇటీవలే ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ లాంఛనం కూడా పూర్తి చేసిన ఆమె ఢిల్లీ సింహాసనానికి గురిపెట్టారు. ఇన్నాళ్లూ బీజేపీ వైరి పక్షాలన్నీ ఒక్కటై కమలదళాన్ని టార్గెట్ చేస్తాయని అందరూ ఊహించారు. కానీ ఆ క్రతువులో కాంగ్రెస్ తో ఎవరూ కలసి నడిచేలా కనిపించడంలేదు. వచ్చే ఏడాది జరగబోతున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ […]

రాష్ట్రాల్లో చాపకింద నీరులా.. టీఎంసీ మాస్టర్ ప్లాన్..
X

ఖేలా హోబే అంటూ.. పశ్చిమబెంగాల్ లో బీజేపీకి గట్టి షాకిచ్చిన మమతా బెనర్జీ.. ఇప్పుడు దేశ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు. ఇటీవలే ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ లాంఛనం కూడా పూర్తి చేసిన ఆమె ఢిల్లీ సింహాసనానికి గురిపెట్టారు. ఇన్నాళ్లూ బీజేపీ వైరి పక్షాలన్నీ ఒక్కటై కమలదళాన్ని టార్గెట్ చేస్తాయని అందరూ ఊహించారు. కానీ ఆ క్రతువులో కాంగ్రెస్ తో ఎవరూ కలసి నడిచేలా కనిపించడంలేదు. వచ్చే ఏడాది జరగబోతున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ పొత్తులు, ఎత్తులు, పైఎత్తులపై క్లారిటీ ఇవ్వబోతున్నాయి. ఇప్పటికే పశ్చిమబెంగాల్ లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది పరిస్థితి. అటు తృణమూల్ కాంగ్రెస్ చాపకింద నీరులా అన్ని రాష్ట్రాల్లోనూ పాతుకుపోయేందుకు ప్లాన్ గీస్తోంది. మొత్తం 15 రాష్ట్రాల్లో టీఎంసీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. తూతూమంత్రంగా ఆఫీస్ లు ఏర్పాటు చేసి ఆగిపోబోమని.. ఆయా రాష్ట్రాల రాజకీయాల్లో టీఎంసీ ప్రభావం కచ్చితంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. పశ్చిమబెంగాల్ తో పాటు, గోవా, త్రిపురలో ఇప్పటికే తృణమూల్ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇవి కాకుండా రాబోయే మూడు నెలల్లో మరో ఐదు రాష్ట్రాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామంటున్నారు అభిషేక్ బెనర్జీ. వచ్చే ఏడాదికి మొత్తం 15 రాష్ట్రాలను టార్గెట్ చేస్తామని చెప్పారు.

టార్గెట్ బీజేపీ.. టార్గెట్ కాంగ్రెస్..
బీజేపీతోపాటు కాంగ్రెస్ ని కూడా ఒకే సమయంలో టార్గెట్ చేస్తోంది టీఎంసీ. గత ఏడేళ్లుగా కాంగ్రెస్ బీజేపీ చేతిలో ఓడిపోతూనే ఉందని, అదే సమయంలో టీఎంసీ ఏడేళ్లుగా బీజేపీతో పోరాడుతూ ప్రతి ఎన్నికల్లోనూ గెలుస్తూ ఉందని అంటున్నారు ఆ పార్టీ నేతలు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ వద్ద ఎలాంటి ఉపాయాలు లేవని, అది ఆ పార్టీ వల్ల సాధ్యం కాదని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాభవాన్ని తగ్గించాలంటే అది టీఎంసీతోనే సాధ్యమని చెబుతున్నారు. అందుకే 15 రాష్ట్రాల్లో పార్టీని పటిష్టపరిచే చర్యలు మొదలు పెట్టారు.

పొలిటికల్ టూరిజం..
15 రాష్ట్రాల్లో కార్యాలయాలు ప్రారంభిస్తామంటూ టీఎంసీ నేతలు ప్రకటించడాన్ని బీజేపీ విమర్శించింది. ఆఫీస్ లు తెరవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మండిపడింది. టీఎంసీ వ్యవహారాన్ని పొలిటికల్ టూరిజంగా పేర్కొన్నారు బీజేపీ అధికార ప్రతినిధి సామిక్ భట్టాచార్య. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జాతీయ నేతలు ప్రచారానికి వస్తే.. స్థానికేతరులంటూ దుర్భాషలాడారని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని 15 రాష్ట్రాలకు వెళ్తున్నారని ప్రశ్నించారు. విమర్శలు ఎలా ఉన్నా.. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీఎంసీ.. మాస్టర్ ప్లాన్ అమలు చేయబోతోంది.

First Published:  23 Oct 2021 8:42 PM GMT
Next Story