100కోట్ల వ్యాక్సిన్ పై ఆమ్ ఆద్మీ వ్యంగ్యాస్త్రం..
కేవలం 9 నెలల్లోనే భారత్ లో 100 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు పంపిణీ చేశామంటూ కేంద్రం గొప్పలు చెప్పుకోవడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్రం చేతగాని తనం వల్లే భారత్ లో వ్యాక్సిన్ పంపిణీ నత్తనడకన సాగిందని.. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే 6 నెలల ముందే ఈ ఘనతను భారత్ అందుకుని ఉండేదని అన్నారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. వ్యాక్సిన్ పంపిణీ సమర్థంగా లేకపోవడం, లేనిపోని గొప్పలకోసం విదేశాలకు […]
కేవలం 9 నెలల్లోనే భారత్ లో 100 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు పంపిణీ చేశామంటూ కేంద్రం గొప్పలు చెప్పుకోవడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్రం చేతగాని తనం వల్లే భారత్ లో వ్యాక్సిన్ పంపిణీ నత్తనడకన సాగిందని.. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే 6 నెలల ముందే ఈ ఘనతను భారత్ అందుకుని ఉండేదని అన్నారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. వ్యాక్సిన్ పంపిణీ సమర్థంగా లేకపోవడం, లేనిపోని గొప్పలకోసం విదేశాలకు టీకాను ఉచితంగా దోచిపెట్టడం వల్లే భారత్ లో వ్యాక్సినేషన్ బాగా ఆలస్యమైందని చెప్పారాయన.
ఈ ఏడాది జనవరి 16న భారత్ లో వ్యాక్సినేషన్ మొదలైంది. ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో మొదలు పెట్టి, ఆ తర్వాత వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు.. చివరిగా 18ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ టీకా అందిస్తూ వస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం 100కోట్ల డోసుల పంపిణీ పూర్తయిందే కానీ, 50కోట్ల మందికి రెండు డోసులు వేశామని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. పంపిణీ చేసిన టీకాల సంఖ్య చెబుతున్నారే కానీ, వ్యాక్సినేషన్ చేయించుకున్న జనాభా సంఖ్య మాత్రం విడుదల చేయలేదు. ఆ లెక్కల్లో చాలా తేడాలున్నాయని, అందుకే ప్రభుత్వం వాటిని చెప్పడంలేదనేది విపక్షాల విమర్శ.
తాజాగా 100కోట్ల డోసుల పంపిణీ మైలురాయిని దాటిన సందర్భంగా కేంద్రం సంబరాలు మొదలు పెట్టింది. ప్రధాని మోదీని బాహుబలిగా కీర్తిస్తూ బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించిందని, ఇతర దేశాలు శుభాకాంక్షలు చెప్పాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇదంతా కేవలం బీజేపీ జిమ్మిక్కు అని, వ్యాక్సినేషన్ ఆలస్యం అయింది మోదీ వల్లేనని విమర్శిస్తున్నారు ఆమ్ ఆద్మీ నేతలు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకుంటూ ఇలా ప్రచారం చేయించుకోవడం మోదీకే చెల్లిందని విమర్శించారు. గతంలో వివిధ రాష్ట్రాలనుంచి వ్యాక్సిన్ కోసం అర్జీలు పెట్టుకున్నా దిక్కులేదని, ఆ తర్వాత చాన్నాళ్లకు సరఫరా మెరుగైందని గుర్తు చేశారు. మధ్యలో విదేశాలకు ఉదారంగా వ్యాక్సిన్ విరాళంగా ఇచ్చారని, ఇదంతా కేవలం మోదీ పేరుకోసమేనని విమర్శించారు. 100 కోట్ల మార్కుని 6నెలలు ఆలస్యంగా చేరుకున్నందుకా ఈ సంబరాలంటూ ప్రశ్నిస్తున్నారు ఆమ్ ఆద్మీ నేతలు.