నాట్యం మూవీ రివ్యూ
నటీనటులు: సంధ్యారాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ స్క్రిప్ట్, కెమెరా, ఎడిటింగ్, దర్శకత్వం: రేవంత్ కోరుకొండ నిర్మాణ సంస్థ: నిశ్రింకళ ఫిల్మ్ సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ ప్రొడక్షన్ డిజైనర్, నిర్మాత: సంధ్యా రాజు నిడివి: 2 గంటల 16 నిమిషాలు రేటింగ్: 2/5 కొన్ని సినిమాలకు మంచి కథలు దొరుకుతాయి. కానీ సరైన నటీనటులు, బడ్జెట్ సెట్ అవ్వక అరకొరగా తెరకెక్కుతాయి. వీటికి భిన్నంగా మరికొన్ని కథలకు మంచి సెటప్ […]
నటీనటులు: సంధ్యారాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ
స్క్రిప్ట్, కెమెరా, ఎడిటింగ్, దర్శకత్వం: రేవంత్ కోరుకొండ
నిర్మాణ సంస్థ: నిశ్రింకళ ఫిల్మ్
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
ప్రొడక్షన్ డిజైనర్, నిర్మాత: సంధ్యా రాజు
నిడివి: 2 గంటల 16 నిమిషాలు
రేటింగ్: 2/5
కొన్ని సినిమాలకు మంచి కథలు దొరుకుతాయి. కానీ సరైన నటీనటులు, బడ్జెట్ సెట్ అవ్వక అరకొరగా
తెరకెక్కుతాయి. వీటికి భిన్నంగా మరికొన్ని కథలకు మంచి సెటప్ కుదురుతుంది. పుష్కలంగా
వనరులుంటాయి. కానీ కథతోనే సమస్య వచ్చి పడుతుంది. నాట్యం సినిమా ఈ రెండో కోవకు చెందుతుంది.
అన్నీ తామై సంధ్యారాజు (లీడ్ ఆర్టిస్ట్, నిర్మాత), రేవంత్ కోరుకొండ (స్క్రిప్ట్, కెమెరా, ఎడిటింగ్, దర్శకత్వం) తీసిన ఈ సినిమా కనువిందుగా ఉంటుంది. అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్, గ్రాఫిక్స్, కెమెరా వర్క్ కనిపిస్తుంది. కానీ అసలైన కథనం మాత్రం లోపించింది. దీంతో నాట్యం సినిమా అనుకున్న టార్గెట్ ను అందుకోలేకపోయింది. శాస్త్రీయ నృత్యం ఆధారంగా తెలుగులో అద్భుతమైన సినిమాలొచ్చాయి. సాగరసంగమం, స్వర్ణకమలం లాంటి సినిమాలు ఆణిముత్యాలు. వాటితో ఈ సినిమాను కంపేర్ చేసుకుంటే మాత్రం భంగపాటు తప్పదు.
నాట్యం అనే ఊరిలో గురువు గారు (ఆదిత్య మీనన్) అందరికీ శాస్త్రీయ నృత్యం నేర్పిస్తుంటారు. ఆ కళాక్షేత్రంలోనే తల్లి (భానుప్రియ) చాటు బిడ్డగా పెరుగుతుంది కూతురు సితార (సంధ్య రాజు). చిన్నప్పట్నుంచే సితారకు నాట్యం అంటే ప్రాణం. గురువుగారు ఆమెకు నాట్యం నేర్పిస్తారు. కాదంబరి కథతోనే అరంగేట్రం చేస్తానని పట్టుబడుతుంది సితార. కానీ గురువుగారు ఒప్పుకోరు.
మరోవైపు రోహిత్ (రోహిత్ బెహల్) హైదరాబాద్ లో మంచి డాన్సర్. అమెరికాలో జరిగే ఇంటర్నేషనల్ డాన్స్ కాంపిటిషన్ కోసం ప్రిపేర్ అవుతుంటాడు. మంచి కాన్సెప్ట్ కోసం నాట్యం ఊరికి వస్తాడు. అక్కడ సితారతో పరిచయం ఏర్పడుతుంది. ఓ టైమ్ లో ఇద్దరూ తన్మయత్వంతో డాన్స్ చేస్తుంటారు. ఆ సమయంలో రోహిత్ ను సితార ముద్దాడుతుంది. నాట్య కళకు అవమానం జరిగిందంటూ సితారను ఊరి నుంచి తరిమేస్తారు.
హైదరాబాద్ కు వచ్చిన సితార.. రోహిత్ తో కలిసి అమెరికాలో డాన్స్ కాంపిటిషన్ కు ప్రిపేర్ అవుతుంది. మరి సితార అనుకున్నది సాధించిందా? తన ఊరికి తిరిగి వచ్చిందా? పోయిన పరువును సంపాదించుకుందా? ఇంతకీ గురువుగారు వద్దన్న కాదంబరి కథ వెనక ఉన్న రహస్యం ఏంటి? అనేది మిగతా కథ.
ఇలా చెప్పుకోడానికి ఈ కథ బాగున్నట్టు అనిపిస్తుంది కానీ తెరపై చూస్తే మాత్రం బోర్ కొడుతుంది. ఎందుకంటే, రేవంత్ నెరేషన్ అలా ఉంది మరి. చెప్పాలనుకున్న విషయాన్ని ఇంట్రెస్టింగ్ గా చెప్పలేకపోయాడు దర్శకుడు. తెరనిండా మంచి ప్రొడక్షన్ వాల్యూస్, కాస్ట్యూమ్స్, కెమెరా ఫ్రేములు కనిపిస్తుంటాయి కానీ సీన్ మాత్రం రక్తికట్టదు. అదే ఈ సినిమాకు ప్రధాన సమస్య. సినిమాలో నాట్యం ఎపిసోడ్స్ బాగుంటాయి కానీ స్క్రీన్ ప్లే మెప్పించదు. సెకండాప్ లో ట్విస్టులు బాగుంటాయి కానీ ఎమోషన్ పండదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉంటుంది కానీ వెంటాడదు. ఇలా సగం ఉడికీ ఉడకని కూరలా అనిపిస్తుంది ఈ సినిమా.
ఈ హాఫ్-బాయిల్డ్ వంటకంలో ఆకట్టుకున్న అంశం ఏదైనా ఉందంటే అది సంధ్యారాజు డాన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రమే. సినిమాలో ఆమెపై తీసిన డాన్స్ ఎపిసోడ్స్ బాగున్నాయి. వీటిలో సంధ్యారాజుతో కలిసి శాస్త్రీయ నృత్యం చేసిన కమల్ కామరాజు అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు. అతడి ఫిజిక్, క్లాసికల్ డాన్స్ సరిగ్గా సరిపోయాయి. ఇక సంధ్యారాజు తల్లిగా నటించిన భానుప్రియకు అస్సలు నటించే స్కోప్ లేదు. గురువుగారిగా నటించిన ఆదిత్య మీనన్, సాత్వికమైన ఆ పాత్రను పండించలేకపోయాడు. ఇక హీరోగా నటించిన రోహిత్ అయితే ఘోరం. ఎంత బాగా డాన్స్ చేశాడో అంత చెత్తగా నటించాడు.
టెక్నికల్ గా చూసుకుంటే, ఇంతకుముందే చెప్పుకున్నట్టు సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయి. సంధ్యారాజు ఖర్చుకు వెనకాడకుండా డబ్బు పెట్టారు. చిన్న చిన్న షాట్స్ కు కూడా క్రేన్స్, ట్రాలీలు వాడారు. చిన్న సన్నివేశాలకు కూడా అద్భుతంగా ఆర్ట్ వర్క్ చేశారు. పెద్దగా ఎలివేట్ అవ్వని పాత్రకు కూడా మంచి కాస్ట్యూమ్స్ వాడారు. ఇలా చెప్పుకుంటూపోతే టెక్నికల్ గా ఈ సినిమా రిచ్ గా ఉంటుంది. ఇక సంగీత దర్శకుడు శ్రవణ్ భరధ్వాజ్ తన మ్యూజిక్ తో ఈ సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లాడు. సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే బాగుంది.
ఓవరాల్ గా చూసుకుంటే.. ముందుగా కథ, స్క్రీన్ ప్లేపై గట్టిగా కూర్చొని, ఆ తర్వాత భారీగా ఖర్చుపెడితే బాగుండేది. అలా చేయకపోవడం వల్ల నాట్యం సినిమా రిచ్ గా కనిపిస్తుంది కానీ ఎమోషన్ ను మాత్రం క్యారీ చేయదు. కూర్చున్న సీట్లో అసహనంగా అటుఇటు కదిలితే అది మీ తప్పు కాదు.