Telugu Global
National

మహారాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ ఎన్సీబీ.. శృతిమించిన ఆరోపణలు..

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది ముంబైలోని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ). ఈ వ్యవహారంలో మొదట్లో నేరుగా జోక్యం చేసుకోని శివసేన ప్రభుత్వం, మెల్ల మెల్లగా షారుఖ్ ఖాన్ కి, టోటల్ గా సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ గా నిలుస్తోంది. అదే సమయంలో ఎన్సీబీపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఆమధ్య ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే.. తనపై స్థానిక పోలీసులు నిఘా పెట్టారంటూ సంచలన […]

మహారాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ ఎన్సీబీ.. శృతిమించిన ఆరోపణలు..
X

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది ముంబైలోని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ). ఈ వ్యవహారంలో మొదట్లో నేరుగా జోక్యం చేసుకోని శివసేన ప్రభుత్వం, మెల్ల మెల్లగా షారుఖ్ ఖాన్ కి, టోటల్ గా సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ గా నిలుస్తోంది. అదే సమయంలో ఎన్సీబీపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఆమధ్య ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే.. తనపై స్థానిక పోలీసులు నిఘా పెట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనకు అపాయం ఉందని కూడా అన్నారు. ఆ తర్వాత శివసేన నేత కిషోర్ తివారి, ఆర్యన్ ఖాన్ హక్కులకు భంగం వాటిల్లిందంటూ నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొంతమంది సినీ ప్రముఖులను ఎన్సీబీ టార్గెట్ చేసిందని విమర్శించారు.

తాజాగా ఈ వివాదంలోకి శివసేన మిత్రపక్షం ఎన్సీపీ కూడా వచ్చి చేరింది. మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్, సమీర్ వాంఖడేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమీర్ ఓ తోలుబొమ్మ అని అన్నారు. డ్రగ్స్‌ వ్యవహారంలో ఆయన సినీ పరిశ్రమను టార్గెట్‌ చేశారని, తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఈ ఏడాదిలోనే సమీర్‌ ఉద్యోగం పోవడం ఖాయమని, ఆయన్ను జైలులో పెట్టేవరకు తాను వదిలిపెట్టబోనన్నారు.

మాల్దీవుల్లో మకాం.. దుబాయ్ లో షికార్లు..
బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు విచారణకు ప్రత్యేక అధికారిగా వచ్చిన సమీర్.. ఆ కేసు వదిలేసి డ్రగ్స్ విషయాల్లో సినీ ఇండస్ట్రీపై పడ్డారని విమర్శించారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్. క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు కథలల్లారని, వాస్తవానికి వాట్సాప్‌ చాట్‌ ఆధారంగానే అరెస్టులు చేస్తున్నారన్నారని మండిపడ్డారు నవాబ్. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల్ని తప్పుడు కేసుల్లో ఇరికించడానికి సమీర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. కరోనా టైమ్ లో సినీ ఇండస్ట్రీ ప్రముఖులంతా మాల్దీవుల్లో ఉన్నారని, అప్పుడు సమీర్ కూడా మాల్దీవ్స్ కి వెళ్లారని ఆరోపించారు నవాబ్. అక్కడే వసూళ్ల పర్వానికి తెరతీశారని, ఆ తర్వాత దుబాయ్ కూడా వెళ్లారని అన్నారు.

మాల్దీవ్స్ కి వెళ్లాను.. కానీ..!
క్రూజ్ షిప్ వ్యవహారం బయటపడిన కొత్తల్లో సమీర్ వాంఖడేని మీడియా హీరోలా ప్రొజెక్ట్ చేసింది. రాను రాను, మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేస్తుండటంతో సమీర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ప్రస్తుతం మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ వ్యాఖ్యలపై స్పందించిన సమీర్.. తాను కుటుంబంతో కలసి మాల్దీవ్స్ కి విహార యాత్రకు వెళ్లానని, అయితే ప్రభుత్వ అనుమతితోనే తాను టూర్ ప్లాన్ చేసుకున్నానని వివరణ ఇచ్చారు. దుబాయ్ కి మాత్రం తాను వెళ్లలేదని అన్నారు. తాను కేవలం ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే అని, నవాబ్ రాష్ట్ర మంత్రి స్థానంలో ఉన్నారని చెప్పారు. నిజాయితీగా డ్రగ్స్ కేసులో విచారణ చేపట్టినందుకు తనను జైలుకి పంపిస్తే సంతోషం అని ముక్తాయించారు. తన కుటుంబ సభ్యుల గురించి కూడా ఆరోపణలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోపణలు చేసేకొద్దీ తాను మరింత ధైర్యంగా ఉంటానని అన్నారు. మొత్తానికి క్రూజ్ షిప్ డ్రగ్స్ కేసు విచారణ పొలిటికల్ టర్న్ తీసుకుంది. స్థానిక ప్రభుత్వం విచారణ సంస్థపై ఆరోపణలు చేయడంతో తీవ్ర కలకలం రేగింది.

First Published:  22 Oct 2021 4:37 AM IST
Next Story