Telugu Global
National

యూపీలో ప్రియాంక వ్యూహం.. మహిళలకు 40శాతం సీట్లు..

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకోసం కాంగ్రెస్ సర్వ శక్తులూ ఒడ్డుతోంది. యూపీలో యోగి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, అదే తమకు అనుకూలంగా మారుతుందని భావిస్తోంది కాంగ్రెస్. ఆ వ్యతిరేకతే నిజమైతే.. ఆ ఓట్లను సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలతో కలసి కాంగ్రెస్ పంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి విపక్షాల మధ్య పొత్తు చర్చలేవీ జరగలేదు. మూడు పార్టీలు ఎవరికి వారే సొంతంగా బరిలో దిగుతామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో యూపీ కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న […]

యూపీలో ప్రియాంక వ్యూహం.. మహిళలకు 40శాతం సీట్లు..
X

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకోసం కాంగ్రెస్ సర్వ శక్తులూ ఒడ్డుతోంది. యూపీలో యోగి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, అదే తమకు అనుకూలంగా మారుతుందని భావిస్తోంది కాంగ్రెస్. ఆ వ్యతిరేకతే నిజమైతే.. ఆ ఓట్లను సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలతో కలసి కాంగ్రెస్ పంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి విపక్షాల మధ్య పొత్తు చర్చలేవీ జరగలేదు. మూడు పార్టీలు ఎవరికి వారే సొంతంగా బరిలో దిగుతామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో యూపీ కాంగ్రెస్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రియాంక గాంధీ మహిళలకు 40శాతం సీట్లు కేటాయిస్తామంటూ సంచలన ప్రకటన చేశారు.

యూపీ అసెంబ్లీలో 403 సీట్లు ఉండగా.. అందులో 305 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా 100 సీట్లను స్వతంత్రులు, విపక్షాలు అన్నీ పంచుకున్నాయి. యూపీలో కాంగ్రెస్ కి కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈసారి ఏకంగా అధికారాన్నే చేజిక్కించుకోడానికి కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. 160కి పైగా స్థానాల్లో మహిళా అభ్యర్థుల్ని రంగంలోకి దింపుతామంటున్నారు ప్రియాంక గాంధీ. యూపీ రాజకీయాలను కులాల కుంపట్లుగా పేర్కొంటున్న ప్రియాంక.. కుల మతాలకు అతీతంగా తమ అభ్యర్థుల్ని ఎంపిక చేస్తామంటున్నారు. మహిళలను అభ్యర్థులుగా ప్రకటించినా వారి సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటామే కానీ, కులాలను పరిగణలోకి తీసుకోమని చెప్పారు ప్రియాంక.

ఎన్నికల స్టంట్ అంటూ విమర్శలు..
40శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామంటూ ప్రియాంక చేసిన ప్రకటనను ఎన్నికల స్టంట్ గా కొట్టిపారేశారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మహిళలు, దళితులను ఆ పార్టీ పట్టించుకోలేదని, అధికారంలేనప్పుడు మాత్రమే ఓట్లు, సీట్లు అంటూ మహిళలకు ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారామె. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాల అనైక్యతపైనే బీజేపీ ఆశలన్నీ..
యూపీలో ప్రతిపక్షాల అనైక్యతే తమ విజయానికి బాటలు వేస్తుందని ఆశిస్తున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇటీవల కాలంలో ఆయన ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. అధిష్టానం కూడా యోగికి ప్రాధాన్యత తగ్గించి కొత్తవారిని దగ్గరకు తీస్తోంది. ఈ క్రమంలో లఖింపూర్ ఖేరి వంటి సంఘటనలు ప్రభుత్వ ప్రతిష్టను మరింతగా దిగజారుస్తున్నాయి. దీంతో అధికార పక్షంలో ఆందోళన మొదలైనా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షాల మధ్య చీలిపోతుందని బీజేపీ అంచనా వేస్తోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ.. మూడూ విడివిడిగా పోటీ చేస్తామంటున్నాయి. బీజేపీకి అప్నాదల్ సోనేలాల్ వంటి మిత్ర పక్షాల అండ ఉంది. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో స్వతంత్రుల హవా కూడా ఎక్కువే. దీంతో కనిష్ట మెజార్టీతో అయినా అధికారాన్ని నిలబెట్టుకుంటామనే ధీమాతో బీజేపీ ఉంది.

First Published:  20 Oct 2021 3:51 AM IST
Next Story