Telugu Global
National

బీజేపీ పాపం నాకొద్దు.. తెలివిగా తప్పించుకున్న అమరీందర్..

పంజాబ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాల ప్రభావం పంజాబ్ ఎన్నికలపై కచ్చితంగా ఉంటుంది. సాగు చట్టాల రద్దుకోసం ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగని పోరాటం చేస్తున్నవారిలో మెజార్టీ రైతులు పంజాబ్ నుంచే వెళ్లారు. ఉద్యమానికి నాయకత్వం కూడా పంజాబ్ దే. ఈ సమయంలో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ కొన్నాళ్లుగా బీజేపీ వైపు చూస్తున్నారు. హోం మంత్రి అమిత్ షా ని కలిశారు, పార్టీ […]

బీజేపీ పాపం నాకొద్దు.. తెలివిగా తప్పించుకున్న అమరీందర్..
X

పంజాబ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాల ప్రభావం పంజాబ్ ఎన్నికలపై కచ్చితంగా ఉంటుంది. సాగు చట్టాల రద్దుకోసం ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగని పోరాటం చేస్తున్నవారిలో మెజార్టీ రైతులు పంజాబ్ నుంచే వెళ్లారు. ఉద్యమానికి నాయకత్వం కూడా పంజాబ్ దే. ఈ సమయంలో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ కొన్నాళ్లుగా బీజేపీ వైపు చూస్తున్నారు. హోం మంత్రి అమిత్ షా ని కలిశారు, పార్టీ చేరికపై కూడా చర్చించారు. కానీ చివరి నిముషంలో ఆయన వెనక్కి తగ్గారు. బీజేపీపై రైతులకు ఉన్న ఆగ్రహానికి తాను బలికావాలని ఆయన కోరుకోవడంలేదు. అందుకే సొంత కుంపటి పెట్టుకున్నారు. త్వరలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పరిరక్షించేందుకు కొత్త పార్టీ పెట్టడానికి నిర్ణయంచుకున్నట్టు తెలిపారు మాజీ సీఎం అమరీందర్ సింగ్. రైతు సమస్యలపై పోరాడుతున్న శిరోమణి అకాలీదళ్ తో కలసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అయితే అదే సమయంలో బీజేపీనుంచి తానేమీ దూరం జరగలేదనే సంకేతాలను కూడా పంపారు. బీజేపీపై కర్చీఫ్ వేసి ఉంచారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తే వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలసి పనిచేస్తామని చెప్పారాయన.

నూతన సాగు చట్టాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చినా బీజేపీ మాత్రం వెనక్కి తగ్గలేదు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు దగ్గరపడుతున్నా, వాటిపై సాగు చట్టాల ప్రభావం ఉంటుందని తెలిసినా కూడా రద్దు చేసేందుకు ముందుకు రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలితే.. అది అక్కడితో ఆగదు, కచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికలపై కూడా ప్రభావం చూపిస్తుంది. దీంతో బీజేపీ మిత్ర పక్షాలు కూడా ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతున్నాయి. సాగు చట్టాల రద్దు కోరుతూ.. శిరోమణి అకాలీదళ్ ఏకంగా మోదీ కేబినెట్ నుంచి బయటకొచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పింది. ఇప్పుడు బీజేపీలో చేరతారనుకున్న అమరీందర్ కూడా వెనకడుగు వేశారు. కొత్త పార్టీ అంటూ ప్రస్తుతానికి సేఫ్ గేమ్ మొదలు పెట్టారు. సాగు చట్టాలను రద్దు చేసి, బీజేపీ మైలేజీ పెంచుకుంటే మాత్రం ఆ పార్టీతో కలసి పనిచేస్తానని చెబుతున్నారు.

First Published:  20 Oct 2021 2:22 AM IST
Next Story