Telugu Global
NEWS

గడువు తీరినా కేంద్రం మౌనం.. జలవివాదాలకు ఉందా పరిష్కారం..?

కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఆయా బోర్డులకు అప్పగించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ లో విధించిన గడువు ఈ నెల 14తో ముగిసింది. గెజిట్ ప్రకారం ప్రాజెక్ట్ లను అప్పగించే విషయంలో రెండు రాష్ట్రాలు తుది నిర్ణయాలను ప్రకటించినా అవి అమలుకి సాధ్యం కావడంలేదు. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఏపీ వైఖరి ఏంటి..? కేంద్రం ప్రకటించిన గెజిట్‌ షెడ్యూల్‌-2లో ఉన్న ప్రాజెక్టులను విద్యుత్ కేంద్రాలతో సహా తెలంగాణ […]

గడువు తీరినా కేంద్రం మౌనం.. జలవివాదాలకు ఉందా పరిష్కారం..?
X
కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఆయా బోర్డులకు అప్పగించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ లో విధించిన గడువు ఈ నెల 14తో ముగిసింది. గెజిట్ ప్రకారం ప్రాజెక్ట్ లను అప్పగించే విషయంలో రెండు రాష్ట్రాలు తుది నిర్ణయాలను ప్రకటించినా అవి అమలుకి సాధ్యం కావడంలేదు. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.
ఏపీ వైఖరి ఏంటి..?
కేంద్రం ప్రకటించిన గెజిట్‌ షెడ్యూల్‌-2లో ఉన్న ప్రాజెక్టులను విద్యుత్ కేంద్రాలతో సహా తెలంగాణ అప్పగిస్తే తామూ సిద్ధంగా ఉన్నామని ఏపీ చెబుతోంది. ఈ మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ, ఇంధన శాఖ విడివిడిగా ఉత్తర్వులు కూడా జారీ చేశాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లకు సంబంధించి విద్యుత్ కేంద్రాలు, ప్రధాన కాల్వలు కృష్ణా రివర్ బోర్డ్ కి అప్పగిస్తామని, అయితే తెలంగాణ కూడా ఇందుకోసం ముందుకు రావాలని షరతు విధించింది. ప్రాజెక్ట్ లను ఏకకాలంతో బోర్డు పరిధిలోకి తీసుకోవాలని, ముందు ఒక రాష్ట్రం, తర్వాత మరొక రాష్ట్రం అంటే కుదరదని ఏపీ తేల్చి చెబుతోంది.
తెలంగాణ వాదన ఏంటి..?
తెలంగాణ మాత్రం జల విద్యుత్ కేంద్రాల విషయంలో పీటముడి వేసింది. గతంలో విద్యుత్ ఉత్పత్తి విషయంలోనే ఏపీ, తెలంగాణ మధ్య వివాదం రాజుకుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ లోని నీటిని సాగుకోసం వాడుకోవాల్సి ఉండగా, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పేరుతో వృథా చేస్తోందని, ఆ నీరు సముద్రంపాలైందని ఏపీ అప్పట్లో బోర్డ్ కి కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. అయితే శ్రీశైలం ప్రాజెక్ట్ ని ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తికోసమే ఏర్పాటు చేశారని, తెలంగాణలో ఎత్తిపోతల పథకాలు చాలా ఉన్నాయని, వాటికి సరపడా విద్యుత్ కావాలంటే ఉత్పత్తి జరగాల్సిందేనని కేసీఆర్ సర్కారు వాదించింది. ఇప్పుడు విద్యుత్ కేంద్రాలను రివరే మేనేజ్ మెంట్ బోర్డ్ లకు అప్పగిస్తే.. భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే విద్యుత్ కేంద్రాలు మినహా.. అంటూ కండిషన్ పెట్టింది.
దీంతో ప్రాజెక్టుల అప్పగింత ప్రక్రియకు బ్రేక్‌ పడింది. రెండు తెలుగు రాష్ట్రాలూ తమ అభిప్రాయాలను వెల్లడించాయి కాబట్టి తుది అడుగు వేయాల్సిన బాధ్యత బోర్డులపైనే ఉంది. రాష్ట్రాలు ప్రాజెక్టులు అప్పగిస్తేనే తాము వాటి యాజమాన్య నిర్వహణ చూస్తామని కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ ఇప్పటికే స్పష్టం చేశాయి. మరోవైపు గడువు పెంచాలంటూ ఇప్పటికే రెండు సార్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. ఈ దశలో అసలు కేంద్రం జోక్యం చేసుకుంటుందా..? రెండు రాష్ట్రాలకు మరోసారి గడువు ఇస్తుందా..? లేక ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుందా అనేది తేలాల్సి ఉంది.
First Published:  16 Oct 2021 9:16 PM GMT
Next Story