Telugu Global
National

వ్యాక్సిన్ మైత్రి: 10కోట్ల టీకాలు దానం చేసిన భారత్..

ఓ దశలో భారత్ లో తీవ్ర స్థాయిలో కరోనా వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. రాష్ట్రాలు ప్రాధేయపడ్డా.. కేంద్రం సరఫరా చేయలేని పరిస్థితి. బహిరంగ మార్కెట్లో కొనాలన్నా, కంపెనీలు కేంద్రాన్ని కాదని రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేయలేకపోయాయి. అదే సమయంలో ఇతర దేశాలకు మాత్రం ఉదారంగా భారత్ వ్యాక్సిన్లను సరఫరా చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంది. కేంద్రం ప్రభుత్వ వైఫల్యం వల్లే దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి, ఇతర దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్లను సరఫరా చేశారంటూ ప్రతిపక్షాలు బీజేపీపై […]

వ్యాక్సిన్ మైత్రి: 10కోట్ల టీకాలు దానం చేసిన భారత్..
X

ఓ దశలో భారత్ లో తీవ్ర స్థాయిలో కరోనా వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. రాష్ట్రాలు ప్రాధేయపడ్డా.. కేంద్రం సరఫరా చేయలేని పరిస్థితి. బహిరంగ మార్కెట్లో కొనాలన్నా, కంపెనీలు కేంద్రాన్ని కాదని రాష్ట్రాలకు నేరుగా సరఫరా చేయలేకపోయాయి. అదే సమయంలో ఇతర దేశాలకు మాత్రం ఉదారంగా భారత్ వ్యాక్సిన్లను సరఫరా చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంది. కేంద్రం ప్రభుత్వ వైఫల్యం వల్లే దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి, ఇతర దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్లను సరఫరా చేశారంటూ ప్రతిపక్షాలు బీజేపీపై మండిపడ్డాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ లో వ్యాక్సిన్ల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చాయా అంటే పూర్తిగా ఔనని చెప్పలేం. వ్యాక్సిన్లకు కొరత లేదు కానీ, వ్యాక్సిన్ల పంపిణీ మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే ఇప్పుడు హడావిడిగా కేంద్రం మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. ‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమంలో భాగంగా 10కోట్ల డోసుల్ని విదేశాలకు పంపిణీ చేసింది.

పొరుగు దేశాలతో ‘వ్యాక్సిన్ మైత్రి’ కోరుకుంటున్నామని చెప్పే ప్రధాని మోదీ.. నేపాల్, మయన్మార్, ఇరాన్, బంగ్లాదేశ్ కి మొత్తం 10కోట్ల డోసుల్ని పంపించారు. వాస్తవానికి పేద దేశాలు కరోనా వ్యాక్సిన్ల కొరత ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ విషయంలో ధనిక దేశాలు మాత్రం తమ ఉదారతను చాటుకోలేకపోతున్నాయి. అమెరికా కూడా భారత్ లాగా ధారాళంగా వ్యాక్సిన్లను ఉచితంగా పేద దేశాలకు సరఫరా చేయడంలేదు. తమ దేశ పౌరులకు మాత్రం మూడో డోస్ కూడా వేసేందుకు ఉత్సాహం చూపిస్తోంది. ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం పేద, ధనిక దేశాల మధ్య వ్యాక్సిన్ అంతరాలు రాకూడదని కోరుకుంటోంది. వ్యాక్సిన్ల కొరత ఉన్న రోజుల్లో కూడా భారత్ ఇతర దేశాలకు టీకాలు సరఫరా చేసింది, ఇప్పుడు పరిస్థితులు కాస్త సద్దుమణగగానే మరోసారి తన ఉదారత చాటుకుంది. 10కోట్ల టీకా డోసుల్ని 4 పొరుగు దేశాలకు పంపించింది.

అక్టోబర్ నెలలో 28కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు భారత్ లో తయారవుతాయని, అందువల్ల మనకు ఎలాంటి లోటు లేదని చెబుతున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. భవిష్యత్తులో కూడా భారత్ కు టీకా లోటు లేకుండా విదేశాలకు సరఫరా చేస్తామని చెబుతున్నారాయన. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయంపై ధ్వజమెత్తుతున్నాయి. భారత్ లో వ్యాక్సిన్ పంపిణీ పూర్తి కాకముందే, విదేశాలకు సరఫరా చేయడాన్ని తప్పుబడుతున్నాయి. ఓవైపు వ్యాక్సిన్ ఉచిత పంపిణీని బూచిగా చూపి పెట్రోలియం ఉత్పత్తుల రేట్లను దారుణంగా పెంచేసిన కేంద్రం, పొరుగు దేశాల ఉచితాల భారాన్ని కూడా భారత ప్రజలపైనే వేయడం ఎంతవరకు సమంజసం అంటున్నారు ప్రతిపక్ష నేతలు.

First Published:  15 Oct 2021 2:28 AM GMT
Next Story