మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ రివ్యూ
నటీనటులు: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, ఆమని, మురళి శర్మ, జయ ప్రకాష్, ప్రగతి, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, అభయ్, అమిత్ తదితరులు. మ్యూజిక్ : గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ : ప్రదీశ్ ఎమ్ వర్మ దర్శకుడు : బొమ్మరిల్లు భాస్కర్ నిర్మాతలు : బన్నీ వాసు, వాసు వర్మ బ్యానర్ : జీఏ2 పిక్చర్స్ సమర్పణ : అల్లు అరవింద్ నిడివి : 149 నిమిషాలు రేటింగ్: 2.5/5 ఆమధ్య లాక్ డౌన్ ఎత్తేసిన […]
నటీనటులు: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, ఆమని, మురళి శర్మ, జయ ప్రకాష్, ప్రగతి, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, అభయ్, అమిత్ తదితరులు.
మ్యూజిక్ : గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ : ప్రదీశ్ ఎమ్ వర్మ
దర్శకుడు : బొమ్మరిల్లు భాస్కర్
నిర్మాతలు : బన్నీ వాసు, వాసు వర్మ
బ్యానర్ : జీఏ2 పిక్చర్స్
సమర్పణ : అల్లు అరవింద్
నిడివి : 149 నిమిషాలు
రేటింగ్: 2.5/5
ఆమధ్య లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే షాదీ ముబారక్ అనే సినిమా వచ్చింది. అంతకంటే ముందు కొన్నేళ్ల
కిందట హలో అనే సినిమా వచ్చింది. ఇంకాస్త వెనక్కి వెళ్తే పెళ్లిసందడి, బొమ్మరిల్లు సినిమాలు కూడా
ఉన్నాయి. ఈ సినిమాలన్నీ మీరు చూశారా? అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీని సగానికి సగం
చూసేసినట్టే. అవును.. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సినిమాల షేడ్స్ అన్నీ బ్యాచిలర్ లో కనిపిస్తాయి.
సినిమా స్టార్ట్ చేయడమే బొమ్మరిల్లు సినిమాను గుర్తుకుతెచ్చాడు దర్శకుడు భాస్కర్. అక్కడ హీరో ఓ స్కూటీపై వెళ్తూ తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. ఇక్కడ హీరో రోడ్డుపై కనిపించిన జంటకు తన గతం చెబుతాడు. బొమ్మరిల్లు సినిమాను జనం మరిచిపోయి ఉంటారని భాస్కర్ అనుకున్నాడా లేక తనే మరిచిపోయి మరోసారి అలాంటి ఓపెనింగ్ రాసుకున్నాడా అనేది అతడికే తెలియాలి.
ఓ 2-3 లైన్లలో చెప్పుకుంటే ఈ సినిమా కథ బాగుంటుంది. కానీ అదే 2-3 లైన్లను రెండున్నర గంటల పాటు కూర్చోబెట్టగలిగేలా చెప్పాలంటే మాత్రం దర్శకుడు చాలా కష్టపడాలి, ఎంతో క్రియేటివ్ గా ఆలోచించాలి. ఎంటర్ టైన్ మెంట్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ విషయంలో బొమ్మరిల్లు భాస్కర్ ఫెయిల్ అయ్యాడు. మంచి రొమాంటిక్ సీన్లు రాసుకున్న దర్శకుడు, అదే టైమ్ లో కొన్ని హార్ట్ టచింగ్ సీన్లు, ఇంకొన్ని కామెడీ ఎపిసోడ్లు కూడా మంచిగా పెట్టినట్టయితే బాగుండేది. ”బ్యాచిలర్”లో అది లేదు.
అమెరికాలో సెటిలైన హర్ష(అఖిల్) తన పెళ్లిచూపుల కోసం ఇండియా వస్తాడు. అలా ఇండియా వచ్చిన హర్ష కోసం ఉన్నపళంగా ఓ 20 సంబంధాలు లైన్ లో పెట్టేసి పెళ్లి చూపులు ఎరేంజ్ చేస్తారు అతడి తల్లిదండ్రులు. అలా పెళ్లికి రెడీ అవుతూ పెళ్లిచూపులు చూసే హర్ష కొన్ని రీజన్స్ వల్ల తనకి ఎవరు పర్ఫెక్ట్ అనేది తేల్చుకోలేకపోతాడు. ఈ క్రమంలో జాతకాలు కుదరకపోవడంతో తన తల్లిదండ్రులు రిజెక్ట్ చేసిన విభా(పూజ హెగ్డే)కి దగ్గరై తనతో ప్రేమలో పడతాడు. పెళ్లిపై తనకి ఉన్న ఒపీనియన్ తో స్టాండప్ కామెడీ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేసే విభ, ఓ సందర్భంలో హర్ష లవ్ రిజెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత హర్ష, విభాని ఎలా ఒప్పించాడు..? ఫైనల్ గా జాతకాలు కలవని విభా-హర్ష ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా కథ.
సినిమా మొదటి అర్థభాగాన్ని హీరో ఇంట్రడక్షన్, అతడి పెళ్లిచూపులు, అమ్మానాన్న అనుబంధం, హీరోయిన్ తో పరిచయం లాంటి కార్యక్రమాలకు వాడేశాడు దర్శకుడు. సెకెండాఫ్ నుంచి కథను నెమ్మదిగా ఎత్తుకోవడం స్టార్ట్ చేశాడు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతుంది. పెళ్లిచూపుల ప్రహసనానికే ప్రేక్షకుడికి మొహం మొత్తేస్తుంది. ఇక సెకెండాఫ్ నుంచి సినిమా ఎక్కడ్నుంచి ఎటు పోతుందో అర్థంకాక ప్రేక్షకుడు బిక్కమొహం వేయాల్సిందే. నిజానికి మంచి సీన్లు రాసుకొని, ఫన్ జనరేట్ చేయగలిగితే ఇలాంటి కంప్లయింట్స్ వచ్చేవి కాదు. ఆ వినోదం లేకపోవడంతో సినిమా గాడితప్పిన ఫీలింగ్ కలుగుతుంది.
దాదాపు ఐదేళ్లుగా ”గీతా” కాంపౌండ్ లో తిరుగుతున్నాడు భాస్కర్. అల్లు అరవింద్ కు చాలా స్టోరీలైన్స్ వినిపించాడు. ఫైనల్ గా ఈ కథను, ఇలాంటి సన్నివేశాలతో అల్లు అరవింద్ ఎలా ఓకే చేశారో తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. మొత్తమ్మీద ఈ సినిమాతోనైనా హిట్ కొట్టాలనే అఖిల్ ఆశ నెరవేరదు. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకున్న భాస్కర్ ఆశ కూడా తీరేలా లేదు.
పేలవమైన ఈ కథకు పూర్తిన్యాయం చేశారు అఖిల్, పూజాహెగ్డే. అఖిల్ లో హీరో మెటీరియల్ పుష్కలంగా ఉంది. స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్ మాడ్యులేషన్ అన్నీ పెర్ ఫెక్ట్. ఎటొచ్చి మంచి కథ పడడం లేదంతే. ఇక హీరోయిన్ పూజా హెగ్డే స్టాండప్ కమెడియన్ గా చిరాకు తెప్పించింది. కానీ మిగతా అన్ని సన్నివేశాల్లో చాలా బాగా చేసింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె ది బెస్ట్ ఇచ్చిందని కూడా చెప్పొచ్చు. మిగతా నటీనటుల్లో తల్లిదండ్రులుగా నటించిన ఆమని-జయప్రకాష్ తో పాటు ఇషా రెబ్బ, ప్రగతి, సుడిగాలి సుధీర్, ఫరియా అబ్దుల్లా.. ఇలా చాలామంది ఉన్నారు. కానీ ఎవ్వరికీ గుర్తుండిపోయే పాత్రలు, మేనరిజమ్స్ ఇవ్వలేకపోయాడు దర్శకుడు.
టెక్నికల్ గా సినిమాలో గోపీసుందర్ మ్యూజిక్ మాత్రం బాగుంది. లెహరాయి పాట వినడానికి, చూడ్డానికి కూడా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. దర్శకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ పనితీరు విశ్లేషించుకుంటే, కచ్చితంగా అతడ్నుంచి రావాల్సిన కంటెంట్ మాత్రం కాదిది.
ఓవరాల్ గా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. హార్ట్ టచింగ్ మూమెంట్స్ లేక, కామెడీ పండక, పాటలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.