భారత్ లో బూస్టర్ గుబులు..
భారత్ లో ఇప్పటి వరకూ 95 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. అంటే ఒక వ్యక్తికి రెండు డోసుల లెక్కన తీసుకుంటే.. 18ఏళ్లు పైబడినవారిలో దాదాపు సగం జనాభాకు వ్యాక్సిన్ ఇచ్చేసినట్టే లెక్క. మరి స్వచ్ఛంద సంస్థల సర్వేల ప్రకారం ఇంకా 30శాతం మంది వయోజనులకు కూడా రెండు డోసుల టీకాలు అందలేదు. ఈ లెక్కలు ఎక్కడో తేడా కొడుతున్నాయి. పంపిణీ అయిన డోసుల లెక్కలు చెబుతున్న ప్రభుత్వం, వ్యాక్సిన్ తీసుకున్న […]
భారత్ లో ఇప్పటి వరకూ 95 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. అంటే ఒక వ్యక్తికి రెండు డోసుల లెక్కన తీసుకుంటే.. 18ఏళ్లు పైబడినవారిలో దాదాపు సగం జనాభాకు వ్యాక్సిన్ ఇచ్చేసినట్టే లెక్క. మరి స్వచ్ఛంద సంస్థల సర్వేల ప్రకారం ఇంకా 30శాతం మంది వయోజనులకు కూడా రెండు డోసుల టీకాలు అందలేదు. ఈ లెక్కలు ఎక్కడో తేడా కొడుతున్నాయి. పంపిణీ అయిన డోసుల లెక్కలు చెబుతున్న ప్రభుత్వం, వ్యాక్సిన్ తీసుకున్న మనుషుల లెక్కలు మాత్రం బయటపెట్టడంలేదు.
బూస్టర్ గుబులు మొదలైందా..?
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎన్నిరోజులపాటు వారి శరీరంలో యాంటీబాడీలు ఉంటాయనే విషయంపై ఇప్పటి వరకూ శాస్త్రీయ ఆధారాలు లేవు. మహా అయితే గరిష్టంగా 6 నెలలు యాంటీబాడీలు ఉంటాయని తెలుస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్నా సరే మూడు నెలల గ్యాప్ లో కూడా రెండుసార్లు కొవిడ్ బారినపడిన వారి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈ దశలో రెండు డోసులు కూడా పూర్తికాని భారత్ లో మూడో డోస్ (బూస్టర్ డోస్) గురించి ఆలోచించడం కూడా అత్యాశే అవుతుంది.
వైద్యులకు బూస్టర్ డోస్..
మరోవైపు ఢిల్లీ, ముంబైలోని వైద్య వర్గాలు బూస్టర్ డోస్ తీసుకుంటున్నాయనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. సాధారణ ప్రజలకు సింగిల్ డోస్ కష్టమవుతున్న నేపథ్యంలో వైద్య వర్గాలకు బూస్టర్ డోస్ ఏంటనేది సామాన్యుల ప్రశ్న. అయితే నిత్యం రోగుల మధ్య తిరిగే హై రిస్క్ గ్రూప్ లకు బూస్టర్ డోస్ ఇవ్వాల్సిందేనని ఆయా వర్గాలనుంచి డిమాండ్ వినిపిస్తోంది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు రెండు డోసుల టీకా తీసుకున్నప్పటికీ, తరుచూ వైరస్ బారిన పడుతున్నారు. దీంతో వారిలో యాంటిబాడీల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఈ క్రమంలోనే ప్రధాన నగరాల్లోని కొందరు వైద్యులు బూస్టర్ డోస్ తీసుకున్నట్టు సమాచారం.
బూస్టర్ కి అనుమతి ఉందా..?
వాస్తవానికి భారత్ లో ఒక్కో వ్యక్తికి రెండు డోసుల టీకా మాత్రమే వేయాలి. అధికారికంగా మూడో డోస్ కి అనుమతి లేదు. అయితే వైద్య వర్గాలు వీటిని ఎలా సంపాదిస్తున్నాయనేదే అసలు ప్రశ్న. ప్రభుత్వం సరఫరా చేసే వ్యాక్సిన్ వయల్స్ లో ‘స్పిల్లింగ్ డోస్’ పేరిట కొన్ని టీకా సీసాలను అదనంగా చేరుస్తారు. వ్యాక్సిన్ వృథా అయిన సందర్భాల్లోనే వీటిని వినియోగిస్తారు. ఇవి అధికారిక లెక్కల్లోకి రావు. ప్రస్తుతం వైద్యులు ఈ అదనపు సీసాల్లోని ‘స్పిల్లింగ్ డోస్’లనే బూస్టర్ డోసులుగా వేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద భారత్ లో రెండు డోసుల టీకా పంపిణీ పూర్తి కాకముందే.. బూస్టర్ రగడ మొదలైంది. వ్యాక్సినేషన్లో స్పీడ్ పెంచామని కేంద్రం చెబుతున్నా.. ఈ ఏడాది చివరికల్లా వయోజనులకు రెండు డోసుల టీకా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని భారత్ అందుకునేలా కనిపించడం లేదు.